Begin typing your search above and press return to search.

8 నెలలు నిరాశే.. నిర్మాతల ఆశలన్నీ ఆ రెండు సినిమాలపైనే!

2025 ఏడాదిలో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రేంజ్ సినిమాలు రాలేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు అందుకున్న సినిమాలు కూడా లేవు.

By:  M Prashanth   |   5 Sept 2025 2:00 PM IST
8 నెలలు నిరాశే.. నిర్మాతల ఆశలన్నీ ఆ రెండు సినిమాలపైనే!
X

2025 ఏడాదిలో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రేంజ్ సినిమాలు రాలేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు అందుకున్న సినిమాలు కూడా లేవు. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్వ్కేర్ వంటి ఒకట్రెండు సినిమాలు తప్పా తెలుగులో పెద్ద హిట్లు రాలేదు. అనేక అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్, కింగ్డమ్, కన్నప్ప, హరిహర వీరమల్లు వంటి భారీ సినిమాలు ఓ మోస్తారు టాక్ అందుకున్నా ఆశించిన రేంజ్ లో ఆడలేదు.

దీంతో టాలీవుడ్ లో అనేక మంది నిర్మాతలు పలు కారణాల వల్ల చాలా ఒత్తిడిలో ఉన్నారు. బడ్జెట్లు పెరిగిపోవడం, డిజిటల్ ప్లాట్ఫామ్‌ ల పోటీ ఎక్కువవడం, కొత్త కొత్త నిబంధనలు నిర్మాతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో సినిమాకు పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రావడం గగనంగా మారింది. అందుకే అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ ధరకు సినిమా కొనేంత రిస్క్ తీసుకోవడం లేదు.

దీంతో చాలా మంది నిర్మాతలు సొంతంగానే తమతమ సినిమాలు విడుదల చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 8 నెలలు పూర్తయ్యాయి. మిగిలింది నాలుగు నెలలే. అయితే ఈ నాలుగు నెలల్లోనే తెలుగు బాక్సాఫీస్ ముందుకు రెండు భారీ బడ్జెట్ సినిమాలు రానున్నాయి. ఆ రెండు సినిమాలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆశలు రేకెత్తిస్తున్నాయి. మరి తెలుగు సినిమాలో విడుదలకు రెడీగా ఉన్న ఆ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఏవో కాదు. ఒకటి ఓజీ. మరొకటి అఖండ 2.

పవన్ కళ్యాణ్ OG ఇప్పటికే భారీ బజ్‌ ను సంపాదించింది. దానికి తగ్గట్లే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, అఢ్వాన్స్ సేల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు సినిమాలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రాంతీయ సినిమాల్లో బిజినెస్ కూడా భారీగానే చేసింది. దసరా సెలవులను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సెలవుల్లో మరే సినిమా రిలీజ్ లేకపోవడం ఓజీకి కలిసొస్తుంది.

మరొకటి బాలకృష్ణ అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుందని టాక్. బాలకృష్ణ ఆధ్యాత్మిక పాత్రలో నటిస్తున్నారు. ఈ సీక్వెల్ నుంచి ఇటీవల రిలీజైన టీజర్ అదిరిపోయింది. బోయపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్ల నుండి నిర్మాతల వరకు అందరూ OG, అఖండ 2 పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాల ఫలితాలే 2025 కి తెలుగు సినిమాకు కీలకం కానున్నాయి.