టాలీవుడ్.. ఈసారి రేసులో లేదు
బాహుబలి సినిమా రావడానికి ముందు వరకు దాదాపుగా ప్రతి సంవత్సరం ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డు బాలీవుడ్ పేరిటే ఉండేది.
By: Garuda Media | 20 Dec 2025 12:00 AM ISTబాహుబలి సినిమా రావడానికి ముందు వరకు దాదాపుగా ప్రతి సంవత్సరం ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డు బాలీవుడ్ పేరిటే ఉండేది. కానీ రాజమౌళి మొత్తం కథను మార్చేశాడు. బాహుబలి రెండు భాగాలతో బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేశాడు. బాహుబలి తర్వాత కూడా ఇండియన్ సినిమాలో టాలీవుడ్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ ఘనత టాలీవుడ్‌దే కావడం విశేషం.
2021లో పుష్ప సినిమాతో రికార్డు కొట్టింది టాలీవుడ్. తర్వాతి ఏడాది రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును చేజిక్కించుకుంది. ఐతే 2023లో షారుఖ్ ఖాన్ సినిమాలు జవాన్, పఠాన్ టాప్-2లో నిలిచాయి. ఐతే తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్, టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ భారీ వసూళ్లే సాధించాయి. ఇక గత ఏడాది పుష్ప-2తో హైయెస్ట్ గ్రాసర్ రికార్డును భారీ మార్జిన్‌తో ఖాతాలో వేసుకుంది టాలీవుడ్. కానీ ఈ ఏడాది మాత్రం రేసులో తెలుగు సినిమా బాగా వెనుకబడిపోయింది.
ఈ ఏడాది ప్రస్తుతానికి కన్నడ చిత్రం కాంతార-చాప్టర్ 1 హైయెస్ట్ గ్రాసర్‌గా కొనసాగుతోంది. ఆ చిత్రం రూ.850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఛావా రూ.800 కోట్లతో రెండో స్థానంలో ఉంది. రెండో వారంలోనూ భారీ వసూళ్లు సాధిస్తున్న దురంధర్ నంబర్ వన్ స్థానానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఐతే టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ ఘనతకు దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయింది. కనీసం ఈ ఏడాది తెలుగు సినిమా రూ.500 కోట్ల మార్కును కూడా చేరుకోలేకపోయింది. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రూ.300 కోట్ల మార్కును అందుకున్నాయి.
ఈ ఏడాది తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపే భారీ చిత్రాలు లేకపోవడం మైనస్ అయింది. ప్రభాస్ మూవీ రాజాసాబ్ వస్తే రూ.500 కోట్ల వసూళ్లు సాధ్యమయ్యేవేమో. టాక్ బాగుంటే హైయెస్ట్ గ్రాసర్ కూడా అయ్యేదేమో. ఏడాది చివర్లో వచ్చిన బాలయ్య సినిమా అఖండ-2 పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపుతుందని.. భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనాలు కలిగాయి కానీ.. అది ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కోలీవుడ్ సైతం కూలీ మూవీతో రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టింది కానీ.. టాలీవుడ్‌కు మాత్రం ఆ మైలురాయి అందలేదు.
