100 కోట్లకు పైగా థియేట్రికల్ లాభాలు సాధించిన సినిమాలెన్ని?
అదే బాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన `ఆర్‌ఆర్ఆర్` కూడా థియేట్రికల్ రన్‌లోనే డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు భారీ నికర లాభాలను అందించిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
By: Srikanth Kontham | 10 Sept 2026 6:00 AM ISTతెలుగు పరిశ్రమ స్థాయి పాన్-ఇండియా రేంజ్‌కు పెరిగిన తర్వాత వందల కోట్ల వసూళ్లు సాధించడం సాధారణ విషయంగా మారింది. అయితే ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 100 కోట్లు.. 200 కోట్లు గ్రాస్ వసూలు చేయడం వేరు.. థియేట్రికల్ హక్కుల కొనుగోలు వ్యయం పోను బిజినెస్ పరంగా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఏకంగా 100 కోట్లకు పైగా నికర లాభాలు అందించడం వేరు. టాలీవుడ్ చరిత్రలోనే కేవలం థియేట్రికల్ రన్ ద్వారానే 100 కోట్ల ప్రాఫిట్ మార్కును అందుకున్న సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ అరుదైన ఫీట్ సాధించిన ఎనిమిది చిత్రాలున్నాయి.
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినవి రాజమౌళి దృశ్యకావ్యాలు `బాహుబలి: ది బిగినింగ్`, `బాహుబలి: ది కన్క్లూజన్`, `'ఆర్‌ఆర్ఆర్`. `బాహుబలి 1` తెలుగు సినిమా బాక్సాఫీస్ హద్దులను పూర్తిగా చెరిపేసి నిర్మాతలకు, కొను గోలుదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక `బాహుబలి 2` ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, డిస్ట్రిబ్యూటర్లకు వందల కోట్ల ప్రాఫిట్స్ అందించింది. అదే బాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన `ఆర్‌ఆర్ఆర్` కూడా థియేట్రికల్ రన్‌లోనే డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు భారీ నికర లాభాలను అందించిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన `పుష్ప 2: ది రూల్`, ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన `కల్కి 2898 AD` చిత్రాలు పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాయి. ఈ రెండూ భారీ బడ్జెట్ - అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్నా? ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనంతో 100 కోట్లకు పైగా నికర లాభాలను అందించి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. పరిమిత బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `హనుమాన్` కూడా ఈ జాబితాలో ఉంది.
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. తక్కువ ధరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవడంతో డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడిపై కొన్ని రెట్ల లాభం తెచ్చిపెట్టి 100 కోట్ల ప్రాఫిట్ క్లబ్‌లో చేరిన అసాధారణ చిత్రంగా నిలిచింది. అలాగే విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కలయికలో రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రం కూడా థియేట్రికల్ రన్‌లో ఈ మైలురాయిని చేరుకుంది. పండుగ రేస్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి కొనుగోలుదారులందరికీ 100 కోట్లకు పైగా నికర లాభాలను అందించి వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా రికార్డు సృష్టించింది.
ఇటీవల మాస్ మహారాజా రవితేజ- శివ నిర్వాణ కాంబినేషన్‌లో రిలీజ్ అయి సరికొత్త చరిత్ర సృష్టించిన `ఇరుముడి` చిత్రం కూడా అరుదైన జాబితాలో చేరింది. తక్కువ బడ్జెట్...బిజినెస్ రేంజ్ లో రిలీజ్ అయిన `ఇరుముడి` 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కొనుగోలుదారులకు ఊహించని రీతిలో 100 కోట్లకు పైగా నికర లాభాలను అందించింది. ఇలా ఎనిమిది చిత్రాలు తెలుగు పరిశ్రమ స్థాయిని, బిజినెస్ పొటెన్షియల్‌ను చాటి చెప్పాయి.
