'ది రాకీ హారర్ పిక్చర్ షో ' నటుడు మృతి.. పక్షవాతం వచ్చినా నటనను వీడని వైనం!
ఇంగ్లాండ్ లోని చెషైర్ లో పుట్టిన టిమ్ కర్రీ తొలిసారి హెయిర్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు.
By: Madhu Reddy | 4 Sept 2026 9:21 AM ISTచిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ది రాకీ హారర్ పిక్చర్ షో ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హాలీవుడ్ నటుడు, గాయకుడు టిమ్ కర్రీ 80 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. 2012 నుండి అనారోగ్యంతో వీల్ చైర్కే పరిమితమైన ఆయన.. లాస్ ఏంజెల్స్ లోని తన ఇంట్లోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కాస్త ఆలస్యంగా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు..
ఇంగ్లాండ్ లోని చెషైర్ లో పుట్టిన టిమ్ కర్రీ తొలిసారి హెయిర్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత రాయల్ షేక్ స్పియర్ కంపెనీ, రాయల్ కోర్ట్ థియేటర్ వారి నాటకాలలో చోటు దక్కించుకున్న రాయల్ కోర్టు థియేటర్లో ప్రదర్శించిన ది రాకీ హారర్ పిక్చర్ షో కి ఎంపికయ్యారు. ఇందులో ట్రాన్సిల్వేనియన్ ఫ్రాక్ ఎన్ ఫర్టర్ అనే పాత్రతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ నాటక రంగ ప్రవేశం ఈయన కెరియర్ కు మంచి పునాదులు వేసింది. ఆ తర్వాత వచ్చిన యానీ, హోమ్ అలోన్ 2: లాస్ట్ ఇయర్ న్యూయార్క్, కాంగో, క్లూ లాంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
పక్షవాతం బారిన పడ్డా ఆగని నటన..
సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటూ బిజీగా మారిన సమయంలో అనూహ్యంగా 2012లో ఆయన పక్షవాతం బారిన పడ్డారు. అయినా సరే సినిమా పట్ల తనకున్న మక్కువను తగ్గించుకోలేకపోయారు. ఎలాగైనా సరే సినిమాలలో కొనసాగాలనే నేపథ్యంలో ఒకవైపు వీల్ చైర్కే పరిమితమైనా.. మరొకవైపు వాయిస్ యాక్టర్ గా పుస్తక రచయితగా కూడా కొనసాగారు టిమ్ కర్రీ.
పెళ్లి చేసుకోకుండానే..
ఇకపోతే 80 సంవత్సరాల టిమ్ కర్రీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగానే మిగిలిపోవడం ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. నిజానికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న ఈయన.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియకుండా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరియర్ లీడ్ చేశారు. ఇకపోతే తన జీవితం గురించి ఆయన చెప్పాలనుకున్న కొన్ని విషయాలను మాత్రం వగబోండ్: ఏ మెమోర్ అనే తన ఆత్మకథలు ఆయనే స్వయంగా రాసుకొచ్చారు.
అవార్డులు కూడా..
సినిమాలలో నటించడంతోపాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, పుస్తక రచయితగా కొనసాగిన టిమ్ కర్రీ.. పీటర్ పాన్ అండ్ ది పైరేట్స్ అనే సినిమాలో కెప్టెన్ బుక్ పాత్రకు తన గొంతును అందించి.." డై టైమ్ ఎమ్మీ అవార్డు"ను సొంతం చేసుకున్నారు.
