Begin typing your search above and press return to search.

సెట్స్ లో రూల్స్ అంద‌రికీ ఒకేలా!

పరిశ్రమలో షూటింగ్ వేళల గురించి జరుగుతోన్న చర్చలు ఓ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. సాధారణంగా అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు గంటల తరబడి ప‌నిచేస్తుంటారు.

By:  Srikanth Kontham   |   18 July 2026 5:00 AM IST
సెట్స్ లో రూల్స్ అంద‌రికీ ఒకేలా!
X

పరిశ్రమలో షూటింగ్ వేళల గురించి జరుగుతోన్న చర్చలు ఓ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. సాధారణంగా అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు గంటల తరబడి ప‌నిచేస్తుంటారు. అయితే నటి తిలోత్తమ షోమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో అసమానతలను బ‌య‌ట పెడుతున్నాయి. ఎనిమిది గంటల పని షిఫ్ట్ గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నటీనటులు పని చేసే వేళల గురించి చేసిన విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది.

తిలోత్తమ షోమ్ అభిప్రాయం ప్రకారం.. పరిశ్రమలో పని వేళల విషయంలో ఓ వింతైన వైఖరి కనిపిస్తోంది.

చాలా మంది సీనియర్ కళాకారులు రోజుకు ఎనిమిది గంటల కంటే తక్కువ సమయమే పని చేస్తున్నారని, కానీ ఆ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడరని పేర్కొన్నారు. జూనియర్ కళాకారులు, సాంకేతిక నిపుణులు సుదీర్ఘ పని వేళలతో ఇబ్బందులు పడుతుంటే? అగ్రశ్రేణి నటులకు లభించే సౌలభ్యాలు మాత్రం భిన్నంగా ఉండటం చర్చకు దారితీస్తోంది. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కల్చర్ .. వారికున్న స్టార్ డమ్ అని చెప్పొచ్చు. స్టార్ హీరోలు .. సీనియర్ నటీనటులు సెట్‌కు ఆలస్యంగా రావడం లేదా నిర్ణీత సమయం కంటే ముందే వెళ్ళిపోవడం అనేది సాధారణ ప్రక్రియగా మారిపోయింది.

దీనిని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా స్టార్ల సౌకర్యం కోసం భరిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని సాధారణ నటులు లేదా ఇతర సిబ్బంది విషయంలో ఆశించడం అసాధ్యంగా మారుతోంది. కళాకారుల మధ్య పని వేళల్లో ఉండే ఈ తేడాలు వ్యక్తిగత ప్రాధాన్యత మాత్రమే కాదు. అది పరిశ్రమలోని అధికారిక క్రమాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. తిలోత్తమ షోమ్ ఈ విషయాన్ని ఎత్తిచూపడం వెనుక సమాన పని-సమాన గౌరవం అనే భావన బలంగా క‌నిపిస్తుంది. ఒక సినిమా విజయవంతం కావడానికి అందరి కృషి అవసరమని గుర్తించి నప్పుడు పని వేళల విషయంలో అందరికీ ఒకే రకమైన మానవీయ దృక్పథం ఉండాలని తిలొత్త‌మ‌ ఉద్దేశంగా చెప్పుకొచ్చారు.

పరిశ్రమలో వ‌స్తోన్న‌ ఈ మార్పులు పని పరిస్థితులను మెరుగు పరుచుకోవడంలో భాగంగా చూడాలి. కేవలం అగ్ర నటుల సౌకర్యాలకే పరిమితం కాకుండా సెట్‌లోని ప్రతి ఒక్కరి శ్రమను గుర్తించడం ద్వారానే ఆరోగ్యకరమైన పని వాతావరణం ఏర్పడుతుంది. షూటింగ్ షెడ్యూల్స్ రూపకల్పనలో కూడా అందరి పని గంటలను పరిగణనలోకి తీసుకుంటే అది సినిమా నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

తిలోత్తమ షోమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓ హెచ్చరికగా నిలుస్తున్నాయి. స్టార్ డమ్ అనేది పని వేళల విషయంలో మినహాయింపులకు కారణం కాకూడదు. పని వేళల పట్ల అందరికీ ఒకే నిబంధనలు వర్తించినప్పుడే పరిశ్రమలో మరింత సమగ్రత , వృత్తిపరమైన బాధ్యత పెరుగుతుంది. ఈ చర్చ భవిష్యత్తులో పని సంస్కృతిని ఏ మేరకు మారుస్తుందో చూడాలి.