Begin typing your search above and press return to search.

ఫార్ములాల వెనుక ప‌డి సృజనాత్మకతను చంపేస్తున్నారు!

కొత్తదనంతో కథలు చెప్పాలనుకునే దర్శకులకు ఇక్కడి వ్యవస్థ ఎంతమాత్రం సహకరించదన్నారు. ఒక ఫార్ములా విజయం సాధించ‌లేక‌పోతున్నా?

By:  Srikanth Kontham   |   17 Sept 2026 7:54 AM IST
ఫార్ములాల వెనుక ప‌డి సృజనాత్మకతను చంపేస్తున్నారు!
X

`హాసిల్`, `పాన్ సింగ్ తోమర్`, `సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్` వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు తిగ్మాన్షు ధులియా హిందీ చిత్రసీమలోని ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో మంచి కళాత్మక చిత్రాలు రాకుండా పరిశ్రమే అడ్డుపడుతోందని విమర్శించారు. నేటి రోజుల్లో ప్రతి సినిమా తయారీ ఓ పెద్ద పోరాటంగా మారిపోయిందని ఆవేదన చెందారు. హిందీ చిత్రసీమలో ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపే వ్యక్తులకు, నిర్మాతలకు కనీస దూరదృష్టి లేదని ధులియా ఘాటుగా వ్యాఖ్యానించారు.

కొత్తదనంతో కథలు చెప్పాలనుకునే దర్శకులకు ఇక్కడి వ్యవస్థ ఎంతమాత్రం సహకరించదన్నారు. ఒక ఫార్ములా విజయం సాధించ‌లేక‌పోతున్నా? దానినే పదే పదే రుద్దడానికి ప్రయత్నిస్తూ సృజనాత్మకతను చంపేస్తున్నారని ఆరోపించారు. నిర్మాతలు అనుసరిస్తున్న రొటీన్ ఫార్ములాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా విఫలమవుతున్నప్పటికీ వారి వైఖరిలో మార్పు రావడం లేదని విమర్శించారు. విజయాల శాతం తక్కువగా ఉన్నా? పాత పద్ధతులనే పట్టుకుని వేళ్లాడటం వల్ల కథకులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం కోల్పోతున్నారన్నారు. భారతీయ సినిమా రంగంలో మంచి పని చేయాలనుకునే వారికి నిరంతరం ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయన్నారు.

అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో తాను తెరకెక్కించిన తాజా చిత్రం `ఘమాసాన్` అనుభవాలను పంచుకున్నారు. ఇది అన్ని వర్గాలకూ నచ్చే పూర్తి కమర్షియల్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ థియేటర్లలో విడుదల కాకుండా కేవలం ఓటీటీకి మాత్రమే పరిమితమవ్వడం త‌న‌ని ఎంతగానో బాధించిందన్నారు. తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

తొలుత థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతోనే `ఘమాసాన్` చిత్రాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. కమర్షియల్ సినిమాలకు, కథాబలం ఉన్న సినిమాలకు మధ్య తేడాను గుర్తించడంలో పరిశ్రమ వైఫల్యం చెందుతోందన్నారు. తుపాకులు, పోరాటాలు, సాధారణ డ్రామాతో రూపొందించిన స్పష్టమైన కథను కూడా థియేటర్లకు తీసుకురాలేకపోవడం విచారకరమన్నారు. నటుడిగా, దర్శకుడిగా సుదీర్ఘ సేవలు అందించిన 59 ఏళ్ల ధులియా, ప్రస్తుతం ప్రముఖ హిందీ రచయిత ఉదయ్ ప్రకాష్ రాసిన `దిల్లీ కీ దీవార్` కథ ఆధారంగా `వో ఫిర్ కభీ దిఖా నహీ` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ కథానాయకుడిగా ఢిల్లీ మురికివాడల నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా ఇదే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

పరిశ్రమలో ఇన్ని ప్రతికూలతలు, సవాళ్లు ఎదురువుతున్నా? సినిమాపై ఉన్న అపరిమితమైన ప్రేమతోనే తాము ముందుకు సాగుతున్నామని ధులియా ఉద్ఘాటించారు. వ్యాపార సమీకరణల కంటే కథలోని నిజాయితీకే ప్రాధాన్యమిస్తామని, వచ్చే ప్రతిబంధకాలను అధిగమిస్తూనే వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. మార్కెట్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, రాబోయే రోజుల్లో కూడా అర్థవంతమైన, సమాజాన్ని ఆలోచింపజేసే కథలనే తెరకెక్కిస్తానని ధీమా వ్యక్తం చేశారు.