టైగర్‌పై బుల్లెట్లు: ఒకరిపై అభిమానం మృత్యు కౌగిలిగా మారుతుందా?
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు, రాజస్థాన్‌లోని కోటాలో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక 17 ఏళ్ల మైనర్‌తో పాటు ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
By: Sivaji Kontham | 24 Oct 2026 9:00 PM ISTబాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ - లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు ఇతర అమాయక నటులకు కూడా మృత్యు భయాన్ని కలిగిస్తోంది. సల్మాన్‌తో స్నేహం చేసినా, ఆయనను బహిరంగంగా అభిమానించినా లేదా ఆయనతో కలసి పనిచేసినా బిష్ణోయ్ గ్యాంగ్ రాడార్ కి చిక్కినట్లే. ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి టైగర్ ష్రాఫ్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు, రాజస్థాన్‌లోని కోటాలో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక 17 ఏళ్ల మైనర్‌తో పాటు ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మొత్తం పదిమందిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఆ మైనర్ నిందితుడు తెలిపిన విషయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 2022లో `హీరోపంతి 2` సినిమా ప్రమోషన్స్ సమయంలో సల్మాన్ ఖాన్‌ను ప్రశంసించినందుకే టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకోవాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భావించినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన టైగర్ ష్రాఫ్.. ``ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క టైగర్ ఉన్నారు.. ఆయనే సల్మాన్ సర్. ఆయన ముందు నేను కేవలం పిల్ల పిల్లిని.. సింబా లాంటి చిన్న టైగర్ కబ్ని మాత్రమే`` అని ఎంతో వినయంగా సల్మాన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఒక సీనియర్ హీరోపై చూపించిన ఆ అభిమానమే ఇప్పుడు అతడి ప్రాణాల మీదికి తెచ్చిపెట్టడం.. బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో చేర్చేలా చేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అయితే ఈ ముఠా వెనుక ఉన్న అసలు కుట్రను, కారణాలను పోలీసులు ఇంకా పూర్తిస్థాయిలో ధృవీకరించాల్సి ఉంది.
లారెన్స్ బిష్ణోయ్ నెట్వర్క్ ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. జైలు నుంచే తన గ్యాంగ్‌ను ఆపరేట్ చేస్తూ.. ఇండియా, అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాల్లో దాదాపు 700 మంది షార్ప్ షూటర్లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఏదో ఒక ప్రదేశంలో బైక్‌పై వచ్చి ఉన్నపళంగా బుల్లెట్ల వర్షం కురిపించడం.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారవ్వడం ఈ గ్యాంగ్ నైజం. నేరుగా ప్రాణాలు తీయకపోయినా.. బుల్లెట్లతో బెదిరిస్తూ సెలబ్రిటీలను భయాందోళనలకు గురిచేయడం.. వారిని తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడం వీరి ప్రధాన వ్యూహంగా మారింది.
ప్రస్తుతం అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన 17 ఏళ్ల మైనర్, బీహార్‌కు చెందిన రితిక్ కుమార్ (22), సోనేపట్‌కు చెందిన రెహాన్ (18)లతో పాటు ఇతర నిందితులను కోర్టు అక్టోబర్ 28 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ ఘటనపై ముంబై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. అయితే టైగర్ పై ఘటనను జీర్ణించుకోలేని వారంతా.. ఒకరిపై అభిమానం కురిపిస్తే అది మృత్యు కౌగిలిగా మారుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్స్టర్ల విస్తృత నెట్వర్క్ దృష్ట్యా సెలబ్రిటీలకు ఏ వైపు నుంచి ముప్పు పొంచి ఉందో ఊహించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం 2026 సంవత్సరంలో టైగర్ ష్రాఫ్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నా .. ఇప్పట్లో ఏదీ థియేటర్లలో విడుదల కావడం లేదు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ `లగ్ జా గలే` చిత్రం ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కోలీవుడ్-బాలీవుడ్ కలయికలో తెరకెక్కుతున్న `రాంబో` రీమేక్ ప్రాజెక్ట్‌ను మేకర్స్ పూర్తిగా మార్పులు చేసి కొత్త రూపంలో తీసుకువచ్చే పనుల్లో ఉన్నారు. వీటితో పాటు రేమో డిసౌజా దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం... రామ్ మాధవాని డైరెక్షన్లో `వజ్ర` అనే స్పిరిచ్యువల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ఇంకా నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాదిలో రిలీజ్ లు ఏవీ లేకపోయినా.. త్వరలోనే పలు భారీ ప్రాజెక్ట్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
