Begin typing your search above and press return to search.

ఇత‌డే స్టార్ హీరోపై కుట్ర‌కు సూత్ర‌ధారి? జైలు నుంచి బెయిల్‌పై వ‌చ్చిన ఇంజినీర్ స్టోరి!

అక్టోబర్ 18 సాయంత్రం జుహూలోని పుష్ప నార్సీ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడి తన కారులో తిరిగి వెళ్తున్న 36 ఏళ్ల టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.

By:  Sivaji Kontham   |   26 Oct 2026 10:00 PM IST
ఇత‌డే స్టార్ హీరోపై కుట్ర‌కు సూత్ర‌ధారి? జైలు నుంచి బెయిల్‌పై వ‌చ్చిన ఇంజినీర్ స్టోరి!
X

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలోని జుహూ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన భారతీయ వినోద పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేసి విచారిస్తుండ‌గా, ఇప్పుడు 11వ అరెస్ట్ తీవ్ర ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ కేసులో అత్యంత కీల‌క‌మైన వ్య‌క్తిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇప్ప‌టికే ఒక బిజినెస్‌మేన్‌ పై ఎటాక్ చేసి జైలుకు వెళ్లిన 22 ఏళ్ల ఇంజినీర్ ఇప్పుడు టైగ‌ర్ ష్రాఫ్ పై ఎటాక్ కి ప్లాన్ చేసాడనే నిజం షాకిస్తోంది. ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ఈ కొత్త నిందితుడి వ‌య‌సు కేవ‌లం 22. అత‌డు ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించిన అక్ష‌రాస్యుడు. పేరు ప్రాంజ‌ల్ థాక్రాల్. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్ లో అత‌డి అలికిడిని ప‌సిగట్టిన పోలీస్ మాటు వేసి వెంటాడి అరెస్ట్ చేసారు. అత‌డు ఇంత‌కీ ఈ కేసులో కీల‌కంగా ఎలా మారాడు? అన్న‌ది ప‌రిశీలిస్తే.....విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రధాన సూత్రధారి అనీల్ పండిత్ ఆదేశాల మేరకే అత‌డు టైగ‌ర్ ష్రాఫ్ పై దాడి ప్రణాళికను అమలు చేసినట్లు పోలీసు విచారణలో ఆధారాలు లభించాయి.

ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రాంజల్ థాక్రాల్ సాధారణ నిందితుడు కాదని. అతనికి నేర చరిత్ర ఉందని అధికారులు వెల్లడించారు. గతంలో పానిపట్‌లోని ఒక వ్యాపారిపై అనీల్ పండిత్ ఆదేశాల మేరకు దాడి చేసిన కేసులో ప్రాంజల్ జైలుకు వెళ్లాడు. మార్చి 2026లోనే జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రాంజల్ వెంటనే అనీల్ పండిత్‌తో మళ్లీ కనెక్ట్ అయి ముంబైలో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి వ్యూహరచన ప్రారంభించాడు. నిందితులకు అవసరమైన నిధులు, రవాణా సౌకర్యాలతో పాటు కాల్పులు జరిపిన షూటర్‌కు రెండవ పిస్టల్‌ను కూడా ప్రాంజలే అందించినట్లు స్పష్టమైంది.

అక్టోబర్ 18 సాయంత్రం జుహూలోని పుష్ప నార్సీ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడి తన కారులో తిరిగి వెళ్తున్న 36 ఏళ్ల టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం బైక్‌పై పారిపోయిన షూటర్లు.. దాన్ని అంధేరీ వద్ద వదిలేసి సూరత్ మీదుగా రైలులో రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఢిల్లీ మార్గం ద్వారా నేపాల్‌కు పారిపోయేందుకు యత్నిస్తుండగా కోటా వద్ద ముగ్గురు ప్రధాన షూటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడైన అనీల్ పండిత్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

పోలీసుల నిఘా.. ట్రాకింగ్ నుంచి తప్పించు కోవడానికి అనీల్ పండిత్, ప్రాంజల్ థాక్రాల్‌లతో పాటు ఇతర గ్యాంగ్ సభ్యులు అత్యంత రహస్యమైన ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం ప్రాంజల్ మొబైల్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్న చాట్‌లు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా విదేశాల్లో దాక్కున్న అనీల్ పండిత్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రాంజల్‌ను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి అక్టోబర్ 31 వరకు పోలీసు కస్టడీ విధించింది.

బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ ముఠా జరుపుతున్న వరుస దాడులు, రెక్కీలు పరిశ్రమలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. విదేశాల్లో ఉంటూ డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా భారతదేశంలోని యువతను నేరాల వైపు మళ్లించి ఇటువంటి దాడులకు పాల్పడుతుండటం పోలీసు వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన ముఠా సభ్యులను పట్టుకోవడంతో పాటు సెలబ్రిటీల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.