Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: ఇలాంటి ఘోరాన్ని ఇంత‌కుముందెప్పుడూ చూసి ఉండ‌రు!

నిజ‌మైన స్వ‌చ్ఛ‌మైన‌ ప్రేమ ఏం కోరుకుంటుంది? ర‌క్త త‌ర్ప‌ణం చేయ‌మ‌ని కోరుతుందా? క‌త్తులు గొడ్డ‌ళ్ల‌తో న‌రుక్కోమ‌ని సూచిస్తుందా?

By:  Sivaji Kontham   |   30 Aug 2025 10:24 PM IST
ట్రైల‌ర్ టాక్: ఇలాంటి ఘోరాన్ని ఇంత‌కుముందెప్పుడూ చూసి ఉండ‌రు!
X

నిజ‌మైన స్వ‌చ్ఛ‌మైన‌ ప్రేమ ఏం కోరుకుంటుంది? ర‌క్త త‌ర్ప‌ణం చేయ‌మ‌ని కోరుతుందా? క‌త్తులు గొడ్డ‌ళ్ల‌తో న‌రుక్కోమ‌ని సూచిస్తుందా? ప్రేమ క‌థ‌లో ఎంత‌టి ఘోర‌మైన విల‌న్లు ఉన్నా కానీ, మ‌రీ ఈ రేంజులో నిలువునా చీరేసే, ఒంటి నిండా గుచ్చుకున్న చువ్వ‌ల‌తో ర‌క్త మాంసాలు బ‌య‌ట‌ప‌డ‌టం, త‌ల‌లు గాల్లో ఎగిరిప‌డ‌టం..లాంటి భ‌యాన‌క భీభ‌త్స వాతావ‌ర‌ణం సృష్టించ‌డం.. దీనిని ప్రేమ‌క‌థ అని అంటారా?

టైగ‌ర్ ష్రాఫ్- సంజ‌య్ ద‌త్‌ల‌ `భాఘి 4` ట్రైల‌ర్ వీక్షించాక క‌లిగిన సందేహాలివి. మా సినిమా ఆర్- రేటెడ్ అని మేక‌ర్స్ అధికారికంగా బాహాటంగా ప్ర‌క‌టించి మ‌రీ తెర నిండా ర‌క్త‌త‌ర్ప‌ణం చేయ‌డం షాకిస్తోంది. నిజానికి ఇలాంటి సినిమాలు చూసే వ‌ర్గాన్ని సైకోలు, శాడిజం జాతికి చెందిన వారు అంటారో లేదా ఇంకేదైనా భ‌యాన‌క‌మైన పేరుతో పిలుస్తారో! ఎంత గొప్ప యాక్ష‌న్ సినిమాల ప్రియులైనా కానీ, మ‌రీ ఇంత ఘోర‌మైన తీవ్ర‌మైన ఘాతుకాల‌ను క‌ళ్లారా చూడ‌టం చాలా క‌ష్ట‌మైన విద్య‌. చంపుకోవ‌డం, న‌రుక్కోవ‌డం, చీల్చుకోవ‌డం వంటి దుర్మార్గాల‌ను తెర‌పై చూడాల‌ని అనుకోరు. వీట‌న్నిటినీ మించి చాలా రొటీన్ గా సంజ‌య్ ద‌త్ పాత్ర‌ను మ‌రో అబ్రార్ (యానిమ‌ల్) లా చూపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇందులో న‌టించిన అందాల భామ‌లు ర‌క్త పిశాచాల్లా స్టంట్స్ చేయ‌డం కూడా షాకిస్తుంది.

మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీ, అవ‌తార్, అవెంజెర్స్ ఫ్రాంఛైజీల్లో కూడా ఇలాంటి భ‌యాన‌క‌మైన విజువ‌ల్స్ ని చూపించ‌లేదు. నిజం చెప్పాలంటే యానిమ‌ల్ సినిమాలో కూడా మ‌రీ అంత దారుణంగా చూపించ‌లేదు. కిల్ లేదా మార్కో సినిమాల్లో క్రూర‌త్వం, హింస‌, ర‌క్త‌పాతం మ‌రో లెవ‌ల్ అని భావించిన వారికి భాఘి 4 చూశాక, అది చాలా త‌క్కువ అనే భావ‌న క‌ల‌గ‌డం స‌హ‌జ‌మే అవుతుందేమో!

ఇంత‌టి ఘోర‌మైన విజువల్స్ మునుపెన్నడూ చూసి ఉండ‌రు. ఇప్ప‌టికీ ఫ్యామిలీ ఆడియెన్ సెన్సిబిలిటీ మ‌నుషుల్లో చ‌చ్చిపోలేదు. బంధాలు అనుబంధాలు సెంటిమెంట్లు ఇంకా భార‌తీయుల్లో చావ‌లేదు. అయినా అవేవీ లేని మృగాల‌ను తెర‌పై చూపించాల‌నే ప్ర‌య‌త్నం ఏ.హ‌ర్ష‌కు న్యాయ‌మైన‌దేనా? కాబ‌ట్టి ఇప్పుడు థియేట‌ర్ల‌లోకి రాబోతున్న భాఘి 4 ఏ వ‌ర్గంలో అయినా ఆస‌క్తిని రేకెత్తించిందా? అన్న‌ది స‌స్పెన్స్ గా ఉంది. ఈ చిత్రానికి క‌న్న‌డిగ నిమ్మ హ‌ర్ష ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాజిద్ న‌డియాడ్ వాలా నిర్మాత‌. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో రిలీజ్ కి వ‌స్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ చూశాక థియేట‌ర్ కి వెళ్లే సాహ‌సం ఎవ‌రు చేస్తారో చూడాలి.