టైగర్ ష్రాఫ్ టిప్: 6 వారాలు దేనికీ.. 6 సెకన్లలోనే ఉక్కు పలకలు ఇలా ట్రై చేయండి
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తన 36 ఏళ్ల వయసులోనూ ఉక్కులాంటి దేహదారుఢ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
By: Sivaji Kontham | 6 Oct 2026 3:12 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తన 36 ఏళ్ల వయసులోనూ ఉక్కులాంటి దేహదారుఢ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తెరపై ఎలాంటి డూప్‌లు లేకుండా రిస్క్ తో కూడిన కఠినమైన యాక్షన్ స్టంట్స్ చేయడంలో అతడు ఎప్పుడూ ముందుంటారు. కేవలం జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం వల్లే టైగర్ ఈ స్థాయి ఫిజిక్‌ను పొందలేదు. దీని వెనుక అతడు కఠినంగా పాటించే కొన్ని ప్రత్యేకమైన రూల్స్, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉన్నాయి.
టైగర్ ష్రాఫ్ తన ప్రతి నిత్యం దినచర్యను అత్యంత శక్తివంతంగా ప్రారంభిస్తారు. అతడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుమారు 45 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయడం ద్వారా కార్డియోతో రోజును మొదలుపెడతారు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రన్నింగ్ పూర్తయిన తర్వాత శరీరం ఫ్లెక్సిబిలిటీ ని- స్టామినాను పెంచుకోవడం కోసం కిక్‌బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) లేదా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటారు. ఇవే కాకుండా డ్యాన్స్ చేయడం కూడా ఒక అద్భుతమైన కార్డియో ఎక్సర్‌సైజ్ కావడంతో తన ఫిట్‌నెస్ రొటీన్‌లో డ్యాన్స్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
ఇక ఉదయం పూట కార్డియో ముగిశాక... సాయంత్రం సమయంలో టైగర్ జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేస్తారు. బరువైన ఇనుప సామాగ్రిని ఎత్తుతూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అతడు తన వర్కౌట్లలో భాగంగా డెడ్‌లిఫ్ట్స్, స్క్వాట్స్ వంటి బరువైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా 4 నుంచి 8 రెప్స్‌తో కూడిన 12 సెట్ల పుల్-అప్స్, 80 నుండి 85 కిలోల బరువుతో పుల్-డౌన్స్.. అలాగే 100 కిలోల బరువుతో లో అండ్ వన్-ఆర్మ్ డంబెల్ రోవ్స్ చేయడం స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో కీలక భాగం.
ఫిట్‌నెస్‌లో వ్యాయామం ఎంత ముఖ్యమో.. తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యమని నమ్మే టైగర్ డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. అతడు అల్పాహారంగా 8 గుడ్లను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్, చికెన్, ఫిష్‌తో పాటు ఉడికించిన కూరగాయలను తింటారు. ఇక రాత్రి పూట కేవలం చేపలు, గ్రీన్ బీన్స్ లేదా బ్రోకలీ మాత్రమే తీసుకుంటారు. ఆకలి వేసినప్పుడు మధ్యలో ప్రోటీన్ షేక్స్ లేదా అరటిపండ్లను ఆహారంగా తీసుకుంటూ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తారు.
అలాగే టైగర్ తన ఫిట్‌నెస్ కోసం కొన్ని కఠినమైన నిబంధనలను ఏర్పరచుకున్నారు. అందులో ముఖ్యమైనది `నో కార్బ్స్ ఆఫ్టర్ 5 PM` రూల్. సాయంత్రం 5 గంటల తర్వాత అతడు అన్నం, బంగాళాదుంపలు, చక్కెర వంటి కార్బోహైడ్రేట్లు ఉండే ఏ పదార్థాన్ని ముట్టరు. సాయంత్రం పూట కార్బ్స్ తీసుకుంటే శరీరం బరువెక్కి కొవ్వు పేరుకుపోతుందని అతడు నమ్ముతారు. జంక్ ఫుడ్స్, సిగరెట్, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండే ఈ యువహీరో అప్పుడప్పుడు కేవలం చాక్లెట్‌ను మాత్రమే ఇష్టపడతారు. ఫిట్‌నెస్ అనేది ఒక రోజుతో ముగిసేది కాదని.. కొన్ని క్రమశిక్షణ నియమాలను పాటిస్తూ ఎప్పుడూ కన్సిస్టెంట్‌గా ఉండటమే విజయ రహస్యం అని ఆయన నిరూపిస్తున్నారు.
MMA మేట్రిక్స్ జిమ్ నుంచి...
బాలీవుడ్ యువ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తన సరికొత్త '6 సెకండ్ల ట్రాన్స్‌ఫర్మేషన్' వీడియోతో సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టించారు. ''6 వారాల ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బోరింగ్... ఇదిగో 6 సెకండ్ల ట్రాన్స్‌ఫర్మేషన్, రెప్పపాటులో మిస్ అవుతారు'' అనే క్యాప్షన్‌తో MMA మేట్రిక్స్ జిమ్ నుంచి అతడు షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో షర్ట్ లేకుండా తన సిక్స్-ప్యాక్ యాబ్స్, పర్‌ఫెక్ట్ బైసెప్స్‌తో అద్భుతమైన ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ కుర్రకారును ఫిదా చేశారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుండగా.. ఆయన కఠిన శ్రమను, ఫిట్‌నెస్‌ను కొనియాడుతూ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
