తారల అందాల మెరుపులు.. వైవిధ్యభరిత సినిమాల హంగామా!
ఈ సారి ఫెస్టివల్‌లో ప్రధానంగా అనూహ్య విజయం సాధించిన వ్యక్తుల, పోరాట యోధుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది.
By: Srikanth Kontham | 10 Sept 2026 10:00 PM ISTఉత్తర అమెరికాలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవంగా పేరుగాంచిన టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (TIFF) 51వ ఎడిషన్ వైభవంగా ప్రారంభమైంది. గురువారం నుంచి సెప్టెంబర్ 20 వరకు సాగే ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 200కి పైగా సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. వెనిస్, టెల్లురైడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ముగిసిన వెంటనే జరుగుతున్న సినీ పండుగకు ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సినీ ప్రియులు, విమర్శకులు, మీడియా ప్రతినిధులు పోటెత్తారు. రెడ్ కార్పెట్ ఈవెంట్లు, గ్రాండ్ ప్రిమియర్లతో టొరంటో నగరం కోలాహలంగా మారింది.
ఈ సారి ఫెస్టివల్‌లో ప్రధానంగా అనూహ్య విజయం సాధించిన వ్యక్తుల, పోరాట యోధుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ `రాకీ` సినిమాను రూపొందించడానికి పడిన కష్టాలు, హాలీవుడ్‌లో ఆయన సాధించిన విజయం నేపథ్యంలో నిర్మించిన `ఐ ప్లే రాకీ` చిత్రం ప్రపంచ ప్రిమియర్ ఫెస్టివల్‌లోనే ప్రదర్శితమవుతోంది. పీటర్ ఫారెల్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సారి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ అమెరికన్ సామాజిక కార్యకర్త జూడీ హ్యూమన్ జీవిత ఆధారంగా నిర్మించిన `బీయింగ్ హ్యూమన్` చిత్రంతో చలనచిత్రోత్సవం అధికారికంగా ప్రారంభమైంది. ఆస్కార్ గ్రహీత సీన్ హెడర్ దర్శకత్వంలో తెరకెక్కిన బయోపిక్‌లో రూత్ మేడ్లీ ప్రధాన పాత్ర పోషించగా, మార్క్ రుఫాలో కీలక పాత్రలో నటించారు. దీంతో పాటు క్యూబెక్ లోని సాధారణ కుటుంబం నుంచి ఫార్ములా-1 రేసింగ్ దిగ్గజంగా ఎదిగిన కార్ రేసర్ గిల్లెస్ విల్నెవ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన `విల్నెవ్: ది రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` బయోపిక్ కూడా ప్రదర్శితమవుతోంది.
ప్రముఖ కమేడియన్, దర్శకుడు క్రిస్ రాక్ తెరకెక్కించిన హాలీవుడ్ ఆకతాయిహాస్య చిత్రం `మిస్టీ గ్రీన్` ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కష్టాల్లో ఉన్న నటి తన కెరీర్‌ను తిరిగి నిర్మించుకునేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డానియల్ కలుయా, ఆడం డ్రైవర్, అన్నా కేండ్రిక్ వంటి ప్రముఖ తారలు ఇందులో నటించారు. వీటితో పాటు చిలీ మాజీ అధ్యక్షుడు సాల్వడార్ అల్లెండే పరిపాలన చివరి రోజుల్లో ఈస్టర్ ఐలాండ్ నేపథ్యంలో సాగే `వైల్డ్ హార్స్ నైన్` థ్రిల్లర్ మూవీ ప్రదర్శనకు జాన్ మాల్కోవిచ్, శామ్ రాక్‌వెల్ వంటి దిగ్గజ నటులు హాజరవుతున్నారు.
ఈ ఫెస్టివల్‌కు వచ్చిన ఇతర ప్రముఖ చిత్రాలలో అండ్రూ స్కాట్, ఒలీవియా కోల్మాన్ నటించిన `ఎల్సినోర్`, జెస్సీ ఐసన్‌బెర్గ్ డైరెక్ట్ చేసిన మ్యూజికల్ కామెడీ `ది డిబ్యూ`, క్రిమిన్ థ్రిల్లర్ నవలా రచయిత్రి పాట్రిషియా హైస్మిత్ కథతో హెలెన్ మిర్రెన్ నటించిన `ఎ టాలెంట్ ఫర్ మర్డర్`, జాక్ స్నైడర్ దర్శకత్వం వహించిన మైండ్-బెండింగ్ యాక్షన్ డ్రామా `ది లాస్ట్ ఫోటోగ్రాఫ్` ముఖ్యమైనవి. రియల్ లైఫ్ దంపతులు జేవియర్ బార్డెమ్, పెనెలోప్ క్రూజ్ కలిసి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ `బంకర్` చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు.
హాటెస్ట్ పాప్ ఐకాన్, బ్లాక్‌పింక్ కే-పాప్ గ్రూప్ స్టార్ `లిసా` నటించిన `ఆల్వేస్ లలిసా` డాక్యుమెంటరీ ఈ ఫెస్టివల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె సోలో మ్యూజిక్ కెరీర్ ప్రారంభం `ది వైట్ లోటస్` షో ద్వారా నటిగా మారిన క్రమాన్ని డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు. ఇలా హాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ పాప్ స్టార్లు, అవార్డు రేసులో ఉండే నాణ్యమైన సినిమాలు ఒకే వేదికపైకి రావడంతో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సినీ జగత్తులో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
