టైర్ -2 హీరోలకు ఎదురవుతోన్న సవాళ్లు!
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అగ్ర హీరోల భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్నాయి.
By: Srikanth Kontham | 2 July 2026 5:00 AM ISTప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అగ్ర హీరోల భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్నాయి. అయితే వందల కోట్ల బడ్జెట్‌తో వచ్చే చిత్రాల వల్ల థియేటర్లలో టైర్-2 ..మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ఆదరణ తగ్గడం, స్క్రీన్లు దొరకకపోవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ ఇమేజ్‌తోనే గడిచిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రేక్షకులు అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ పోటీలో ఉనికిని కాపాడు కోవాలంటే కేవలం స్టార్‌డమ్ మీద ఆధారపడకుండా కంటెంట్ పరంగా వినూత్న ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
టైర్-2 హీరోలు జానర్ పరంగా వైవిధ్యం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుని కూర్చుంటే? భారీ బడ్జెట్ సినిమాల ముందు ఆ సినిమాలు తేలిపోతున్నాయి. దీనికి బదులుగా తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఇంపాక్ట్ చూపించే థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, రియలిస్టిక్ డ్రామాల వైపు అడుగులు వేయడం ఉత్తమంగా కనిపిస్తుంది. కథలో కొత్తదనం ఉన్నప్పుడు బడ్జెట్‌తో పని లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. కంటెంట్ బలమైనప్పుడు ఆటోమేటిక్‌గా బాక్సాఫీస్ వద్ద విజయం దక్కుతుందన్నది అంతే నిజం.
ప్రయోగాత్మక దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం మీడియం రేంజ్ హీరోలకు మంచి మార్గంగా చెప్పొచ్చు. అనుభవజ్ఞులైన దర్శకుల పాత బాణీ కంటే సరికొత్త ఆలోచనలతో ఉన్న యువ దర్శకులు హీరోల ఇమేజ్‌ను మారు స్తున్నారన్నది కాదనలే నిజం. కొత్త తరహా కథాంశాలకు ఆధునిక సాంకేతిక విలువలను జోడించి తెరకెక్కించడం ద్వారా హీరోలు తమకంటూ ప్రత్యేకమైన టార్గెట్ ఆడియన్స్ ను సృష్టించుకోవచ్చు. ఇది వారి సినిమాలకు క్లాస్ - మాస్ అనే తేడా లేకుండా ఆదరణ పెంచుతుంది.
నిర్మాణ వ్యయ నియంత్రణ కూడా అత్యంత కీలకం. భారీ పారితోషికాల జోలికి వెళ్లకుండా బడ్జెట్‌ను సెట్స్‌పై విజువల్స్ పై ఖర్చు చేస్తేనే సినిమా క్వాలిటీ పెరుగుతుంది. అగ్ర హీరోల సినిమాలతో పోల్చినప్పుడు మీడియం రేంజ్ చిత్రాలు తమదైన క్రియేటివ్ టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిర్మాతలు లాభపడేలా చిన్న - మధ్య తరహా బడ్జెట్లతో నాణ్యమైన సినిమాలు తీయడం ద్వారా ఇండస్ట్రీలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను అవకాశంగా ఉపయోగించుకోవడం టైర్-2 హీరోలకు ఒక బహుమతి లాంటిది. థియేట్రికల్ రన్‌తో సంబంధం లేకుండా నేరుగా ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు. ఇక్కడ ప్రేక్షకులు కంటెంట్ కే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి భారీ స్టార్‌డమ్ అవసరం లేదు. భవిష్యత్తులో థియేటర్, ఓటీటీ అనే రెండు మార్గాలను సమాంతరంగా వాడుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే అగ్ర హీరోలతో పోటీ పడాల్సిన అవసరం లేకుండానే సొంత బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు.
అయితే టైర్-2 హీరోలు ఉన్న పళంగా ఇమేజ్ అనే చట్రం నుండి బయటకొచ్చి కథలో లీనమయ్యే పాత్రలను ఎంచుకోవాలి. ప్రేక్షకుడు సినిమాకు వస్తున్నాడంటే? అది హీరో కోసమే కాదు. ఆ కథ అందించే అనుభూతి కోసం అని గుర్తించాలి. మారుతోన్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ప్రయోగాలు చేయాలి. వైవిధ్యమైన సినిమాలతో ముందుకెళ్తేనే మీడియం రేంజ్ హీరోలు బాక్సాఫీస్ రేసులో దీర్ఘకాలం నిలబడగలరు. ఇదే వారి భవిష్యత్తుకు అసలైన పునాది కానుందన్నది పచ్చి వాస్తవం.
