Begin typing your search above and press return to search.

టికెట్ల రేట్ల చెల‌గాటానికి మిరాయ్ దూరం

దేశంలో చాలా రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌, ఏపీల్లో సినిమా టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ అన్న‌ది వాస్త‌వం.

By:  Garuda Media   |   29 Aug 2025 9:36 AM IST
టికెట్ల రేట్ల చెల‌గాటానికి మిరాయ్ దూరం
X

దేశంలో చాలా రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌, ఏపీల్లో సినిమా టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ అన్న‌ది వాస్త‌వం. అయినా సరే.. పెద్ద సినిమాలు వచ్చినపుడల్లా వారం పది రోజుల పాటు అదనపు రేట్లు వడ్డించడం అలవాటైపోయింది. తెలంగాణలో పుష్ప-2 రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల ఈ రేట్ల పెంపుకి బ్రేక్ పడింది. కానీ ‘హరిహర వీరమల్లు’కు మళ్లీ రేట్లు పెంచారు. ఏపీలో మాత్రం కాస్త క్రేజున్న ప్ర‌తి సినిమాకూ రేట్లు పెంచుతున్నారు.

ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో వ‌చ్చిన వార్-2, కూలీ చిత్రాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెంచుకోవడానికి గట్టిగా ట్రై చేశారు. ఐతే సోషల్ మీడియా వ్యతిరేకత వల్లో లేక డబ్బింగ్ సినిమాలన్న కారణంతోనో లేక చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలకు తప్ప వేరే వాటికి పెంపు ఉండదన్న మెలిక వల్లో.. తెలంగాణ‌లో రేట్ల పెంపు లేక‌పోయింది. ఏపీలో మాత్రం హైక్ తెచ్చుకున్నారు. ఐతే ఇలా రేట్లు పెంచ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావడం మ‌రింత త‌గ్గిపోతోంద‌ని.. ఆక్యుపెన్సీలు ప‌డిపోయి అంతిమంగా న‌ష్టం జ‌రుగుతోంద‌ని అర్థ‌మ‌వుతున్నా.. చాలామంది నిర్మాత‌లు మార‌డం లేదు.

ఐతే తెలుగు నుంచి రాబోయే నెక్స్ట్ బిగ్ రిలీజ్ మిరాయ్‌కి మాత్రం రేట్ల పెంపు ఉండ‌ద‌ని సంకేతాలు ఇచ్చాడు నిర్మాత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్. తేజ స‌జ్జా చివ‌రి చిత్రం హ‌నుమాన్‌కు హైక్ లేదు. టికెట్ల ధ‌ర‌లు అందుబాటులో ఉండ‌డంతో ఆ సినిమాను జ‌నం విర‌గ‌బ‌డి చూశారు. ఫుట్ ఫాల్స్ పెరిగి సినిమా ఊహించిన స్థాయి విజ‌యం సాధించింది. ఇదే విష‌యాన్ని మిరాయ్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్లో ప్ర‌స్తావిస్తే.. తేజ స‌జ్జా అంగీక‌రించాడు. త‌న వంతుగా టికెట్ల ధ‌ర‌లు అందుబాటులో ఉండేలా చూస్తాన‌న్నాడు.

మిరాయ్ లాంటి సూప‌ర్ హీరో సినిమాను చిన్న‌పిల్ల‌ల నుంచి పెద్ద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌న్నాడు. అంత‌లో నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ అందుకుని.. ఈ సినిమాకు హైక్ ఉండ‌ద‌ని, టికెట్ల ధ‌ర‌లు అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. దీని ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టికెట్ల ధ‌ర‌లు అందుబాటులో ఉంటే.. మంచి ఆక్యుపెన్సీలు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. టాక్ బాగుంటే సినిమాకు లాంగ్ రన్ కూడా ఉంటుంది. కాబ‌ట్టి హైక్స్ జోలికి వెళ్ల‌కుంటేనే మంచిది. ఎక్కువ‌మంది ప్రేక్ష‌కులు సినిమాను ఆదరిస్తే త‌ద్వారా మంచి లాభాలు వ‌స్తాయి.