ఆడియన్స్ ను నిందించడం ఈజీ… కానీ?
ఒకప్పుడు సినిమా రిలీజైందంటే థియేటర్ల వద్ద కనిపించే సందడి వేరు. హీరో ఎవరు? సినిమా ఎలా ఉంది? అనే ప్రశ్నల కంటే ముందు ఫస్ట్ డే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో ఉండేది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2026 2:18 PM ISTఒకప్పుడు సినిమా రిలీజైందంటే థియేటర్ల వద్ద కనిపించే సందడి వేరు. హీరో ఎవరు? సినిమా ఎలా ఉంది? అనే ప్రశ్నల కంటే ముందు ఫస్ట్ డే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆడియన్స్ థియేటర్‌కు రావాలంటే వాళ్లను ఎన్నో విషయాల్లో మెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నటుడు శివాజీ చేసిన తాజా కామెంట్స్ మరోసారి థియేటర్ వర్సెస్ ఓటీటీ డిస్కషన్ కు తెరలేపాయి.
బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తే వచ్చే అనుభూతి ప్రత్యేకమని శివాజీ చెప్పడం నిజమే. భారీ స్క్రీన్, మంచి సౌండ్, ఆడియన్స్ రియాక్షన్స్ కలిసి ఒక సినిమాకు భిన్నమైన ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తాయి. ఇంట్లో టీవీ లేదా మొబైల్‌లో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో పాజ్ చేయడం, బ్రేక్ తీసుకోవడం లాంటివి థియేటర్‌లో సాధ్యం కాదు. అదే థియేటర్ మ్యాజిక్‌కు అసలైన బలం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న ఉంది. థియేటర్‌కు వెళ్లని ఆడియన్స్ ను తప్పుపట్టాలా? లేక అతడిని థియేటర్‌కు రప్పించేంత బలమైన కారణాన్ని ఇవ్వని సినిమాలను ప్రశ్నించాలా?
ఆడియన్స్ ఇంట్లో కూర్చోవడానికి కేవలం బద్ధకం ఒక్కటే కారణం కాదు. ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వెళ్లాలంటే టికెట్ల ఖర్చు, ప్రయాణం, పార్కింగ్, ఫుడ్ వంటి ఖర్చులు కూడా పెరిగాయి. ఒక సాధారణ కుటుంబానికి సినిమా చూడటం ఇప్పుడు చిన్న ఖర్చు కాదు. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ ఈ మూవీ కోసం నిజంగానే థియేటర్లకు వెళ్లాలా అనే ప్రశ్నను అడుగుతున్నాడు.
ఇదే అసలు మార్పు. గతంలో స్టార్ హీరో ఉంటే చాలు థియేటర్‌కు వెళ్లే ఆడియన్స్.. ఇప్పుడు కంటెంట్ గురించి ముందే తెలుసుకుంటున్నాడు. ట్రైలర్, టాక్, సోషల్ మీడియా రెస్పాన్స్‌లు చూసి డెసిషన్ తీసుకుంటున్నాడు. అంటే ఆడియన్స్ సినిమాలకు దూరం కాలేదు. తన టైమ్, తమ డబ్బుకు ఎంతో విలువిచ్చి, అలాంటి వాల్యుబుల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఓటీటీ ఆడియన్స్ కు ఇంట్లోనే సినిమా చూసే సౌకర్యాన్ని ఇచ్చింది. కానీ థియేటర్లను పూర్తిగా భర్తీ చేయలేకపోయింది. సరైన సినిమా వస్తే ఇప్పటికీ ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వెళ్తున్నారు. అందుకే సమస్య ప్రేక్షకుడిలో ఉందా, ఓటీటీలో ఉందా అనే దానికంటే… ఆడియన్స్ ను తన సీటు నుంచి లేపి థియేటర్ వరకు తీసుకెళ్లేంత బలమైన సినిమాలు వస్తున్నాయా అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. మొత్తంగా చూసుకుంటే ఆడియన్స్ కు థియేటర్లపై ప్రేమ ఇప్పటికీ తగ్గలేదు. కానీ ప్రతి సినిమాకు తన టైమ్, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన మాత్రం పెరిగింది. బహుశా ఇదే నేటి సినీ మార్కెట్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు అనుకోవచ్చు.
