Begin typing your search above and press return to search.

థియేటర్ లెక్కల్లో క్రెడిబిలిటీ మిస్ అవుతుందా?

అయితే ఆ విధానం సరైన విధంగా వర్కౌట్ అవ్వాలంటే కలెక్షన్ల లెక్కలు పూర్తిగా క్రెడిబిలిటీతో ఉండాల్సి ఉంటుంది. టికెట్ అమ్మకాల వివరాలు కచ్చితంగా నమోదు కావాలి.

By:  M Prashanth   |   24 Jun 2026 11:24 PM IST
థియేటర్ లెక్కల్లో క్రెడిబిలిటీ మిస్ అవుతుందా?
X

సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల రెవెన్యూ షేరింగ్ విధానం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య కలెక్షన్ల లెక్కలు విషయంలో క్రెడిబిలిటీ ఎంత అవసరమో ఇటీవల వైరల్ అవుతున్న ఓ ఘటన మళ్లీ గుర్తు చేసింది. ముఖ్యంగా పర్సంటేజ్ రెవెన్యూ షేరింగ్ విధానం అమలవుతున్న సమయంలో టికెట్ విక్రయాలపై అనుమానాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది.

సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత వచ్చిన వసూళ్లను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు ముందుగా నిర్ణయించిన ఒప్పందాల ప్రకారం పంచుకుంటాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో థియేటర్ యజమానులు అద్దె విధానం కంటే పర్సంటేజ్ బేస్డ్ రెవెన్యూ షేరింగ్ విధానాన్ని ఎక్కువగా కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ విధానంలో సినిమా ఎంత వసూలు చేస్తే, వాటాల రూపంలో పంచుకుంటారు.

అయితే ఆ విధానం సరైన విధంగా వర్కౌట్ అవ్వాలంటే కలెక్షన్ల లెక్కలు పూర్తిగా క్రెడిబిలిటీతో ఉండాల్సి ఉంటుంది. టికెట్ అమ్మకాల వివరాలు కచ్చితంగా నమోదు కావాలి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఆ అంశంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఒక థియేటర్‌ లో రీసెంట్ గా ఓ షోకు కొన్ని టికెట్లు సేల్ అవ్వగా.. రికార్డుల్లో మాత్రం అందులో సగం మాత్రమే నమోదు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది.

ఆ డిఫరెన్స్ పొరపాటు కాదని, కలెక్షన్లలో క్రెడిబిలిటీ లేకపోతే నిర్మాతలకు నష్టం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిర్మాతకు రావాల్సిన పర్సంటేజీ అధికారికంగా చూపించిన వసూళ్ల ఆధారంగా లెక్కిస్తారు. అలాంటి పరిస్థితుల్లో అమ్ముడైన ప్రతి టికెట్ రికార్డులో లేకపోతే, ఆ మొత్తానికి సంబంధించిన వాటా నిర్మాతకు అందకపోవచ్చని అంటున్నారు.

ఇంకో విషయం ఏమిటంటే, ఆ థియేటర్‌ ను నిర్వహిస్తున్న సంస్థ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ నెట్‌ వర్క్‌ తో బిజినెస్ లింక్ కలిగి ఉందని ప్రచారం జరుగుతోంది. పెద్ద మల్టీప్లెక్సులను కూడా నిర్వహిస్తున్న సంస్థ పరిధిలో అలా జరిగినట్లు చెబుతుండటంతో మరింత చర్చ మొదలైంది. చిన్న థియేటర్లలో కాకుండా పెద్ద స్థాయి సంస్థల వద్ద కూడా ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఇండస్ట్రీలో గత కొంతకాలంగా నిర్మాతలు తమ ఖర్చులు, బడ్జెట్లు, వసూళ్ల లెక్కలు పారదర్శకంగా వెల్లడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో థియేటర్ స్థాయిలో జరిగే టికెట్ సేల్స్ లెక్కలు కూడా స్పష్టంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు నిర్మాతల నుంచి పూర్తి పారదర్శకత కోరుతూ, మరోవైపు టికెట్ విక్రయాల విషయంలో డౌట్స్ వస్తే అది పరిశ్రమకు మంచిది కాదని చెప్పాలి.

ప్రస్తుతం ఓటీటీలు, డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న థియేటర్లకు ప్రేక్షకుల రెస్పాన్స్ తో పాటు నిర్మాతల నమ్మకం కూడా ఎంతో కీలకం. అందుకే టికెట్ విక్రయాల నుంచి కలెక్షన్ లెక్కల వరకు ప్రతి విషయంలో క్రెడిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నమ్మకంతో ముందుకు సాగినప్పుడే సినిమా బిజినెస్ హెల్దీగా కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.