Begin typing your search above and press return to search.

థియేటర్ల నిర్వహణలో కొత్త చర్చ: రెంటల్ (X) పర్సంటేజీ షేరింగ్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల నిర్వహణ ప్రధానంగా లీజు లేదా అద్దె (రెంట‌ల్) ప్రాతిపదికన సాగుతోంది.

By:  Sivaji Kontham   |   15 May 2026 9:35 AM IST
థియేటర్ల నిర్వహణలో కొత్త చర్చ: రెంటల్ (X) పర్సంటేజీ షేరింగ్
X

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల నిర్వహణ ప్రధానంగా లీజు లేదా అద్దె (రెంట‌ల్) ప్రాతిపదికన సాగుతోంది. ఈ విధానంలో ఒక వ్యక్తి లేదా సంస్థ (లెస్సీ) థియేటర్ యజమాని నుండి నిర్ణీత కాలానికి థియేటర్‌ను లీజుకు తీసుకుంటారు. ఇందుకు ప్రతిగా ప్రతి వారం కొంత ఫిక్స్‌డ్ అద్దెను యజమానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఎగ్జిబిటర్లు ఈ అద్దె విధానం కంటే `పర్సంటేజీ షేరింగ్` మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రతి వారం భారీ అద్దెలు కట్టడం భారం అవుతోందని.. దీని వెనుక కేవలం రాజకీయం మాత్రమే కాకుండా మారుతున్న సినిమా మార్కెట్ పరిస్థితులు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

థియేటర్ రెంటల్ వ్యవస్థలో లాభనష్టాలను పరిశీలిస్తే.. ఇందులో యజమానికి ఒక స్థిరమైన ఆదాయం గ్యారెంటీగా ఉంటుంది. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అద్దె చెల్లించాల్సిందే. సాధారణంగా ఈ కాంట్రాక్టులు లాంగ్ టర్మ్ (కొన్ని ఏళ్ల పాటు) ఉంటాయి. ఇందులో నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు అన్నీ లీజుకు తీసుకున్న వారే భరించాలి. సినిమా భారీ వసూళ్లు సాధిస్తే లీజుదారుడికి భారీ లాభాలు వస్తాయి కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే మాత్రం జేబులోంచి అద్దె కట్టాల్సి రావడం పెద్ద నష్టదాయకమైన అంశం.

మరోవైపు పర్సంటేజీ షేరింగ్ విధానంలో థియేటర్ యజమానులకు... నిర్మాతలకు మధ్య వసూళ్లలో వాటాల పంపిణీ జరుగుతుంది. అంటే సినిమాకు వచ్చే గ్రాస్ వసూళ్లలో నిర్ణీత శాతం థియేటర్ మెయింటెనెన్స్ కోసం కేటాయించి... మిగిలిన మొత్తాన్ని పంచుకుంటారు. ఈ మోడల్‌లో థియేటర్ యజమానులకు లాభాలు నేరుగా సినిమా విజయంతో ముడిపడి ఉంటాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయితే అద్దె కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వసూళ్లు లేని సమయంలో యజమానికి ఆదాయం తగ్గడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా భారంగా మారవచ్చు. కానీ ఇది నిర్మాతలు- ఎగ్జిబిటర్ల మధ్య రిస్క్‌ను సమానంగా పంచుకునేలా చేస్తుంది.

రెంటల్ విధానం, పర్సంటేజీ షేరింగ్ మోడల్‌లలో ఏది ఉత్తమమైనది? అంటే అది ఆ సినిమా స్థాయిపై ఆధారపడి ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలకు రెంటల్ విధానం లీజుదారులకు లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ అద్దె చెల్లించి భారీ వసూళ్లను దక్కించుకోవచ్చు. కానీ చిన్న - మధ్య తరహా సినిమాలకు పర్సంటేజీ షేరింగ్ మోడల్ సరైనది. దీనివల్ల థియేటర్ల అద్దె భారం తగ్గి నిర్మాతలు తమ సినిమాలను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. పారదర్శకత పెరిగి బాక్సాఫీస్ వద్ద ప్రతి రూపాయికి లెక్క ఉండేలా చూస్తే పర్సంటేజీ షేరింగ్ విధానం దీర్ఘకాలంలో పరిశ్రమకు ఆరోగ్యకరమని ప్ర‌ముఖ ఎగ్జిబిట‌ర్ విశ్లేషించారు.

గ‌డిచిన కొద్ది రోజులుగా ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్సెస్ నిర్మాత‌ల వార్ గురించి తెలిసిందే. ఇరు వ‌ర్గాలు ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌పై స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏషియ‌న్ సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి వ‌ర్గం దూకుడుగా ప్రెస్ మీట్ లో ఎగ్జిబిట‌ర్ స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్థావించ‌గా, దానికి కౌంట‌ర్ గా నాగ‌వంశీ- మైత్రి ర‌వి శంక‌ర్, సాహు గార‌పాటి వంటి నిర్మాత‌లు మ‌రో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు. ఇరువ‌ర్గాల మ‌ధ్యా మాట‌ల యుద్ధం పెరిగింది. పెద్ది, ఫైజి వంటి పెద్ద సినిమాల రిలీజ్ ల వేళ ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్సెస్ నిర్మాత‌ల వార్ ఎటు దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొంది. అయితే ఈరోజు సినీపెద్ద‌ల స‌మ‌క్షంలో దీనిపై పంచాయితీ జ‌ర‌గ‌నుంది. ఈ పంచాయితీలో ఏదో ఒక ప‌రిష్కారం దొరుకుతుంద‌ని అంతా ఆశిస్తున్నారు. అద్దె విధాన‌మా? ప‌ర్సంటేజీ షేరింగ్ విధాన‌మా? అంతిమంగా దేనిని డిసైడ్ చేస్తారో వేచి చూడాలి.