Begin typing your search above and press return to search.

థియేటర్ అనుభూతి మిస్ అవుతున్న ప్రేక్షకులు.. కారణాలు ఇవేనా?

ప్రస్తుతం థియేటర్లలో రెండు రకాల ప్రొజెక్టర్లు ఉపయోగంలో ఉన్నాయి. పాత లాంప్ ప్రొజెక్టర్లు, కొత్త లేజర్ ప్రొజెక్టర్లు.

By:  M Prashanth   |   16 Sept 2025 7:33 PM IST
థియేటర్ అనుభూతి మిస్ అవుతున్న ప్రేక్షకులు.. కారణాలు ఇవేనా?
X

భారత ప్రేక్షకులకు థియేటర్‌ లో సినిమా చూడటం కేవలం వినోదమే కాదు, అదొక ప్రత్యేక అనుభవం. చీకటి ఆడిటోరియంలో వందలాది మందితో కలిసి సినిమా ఆస్వాదించడం, అద్భుతమైన వీడియో, ఆడియో అనుభవం కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అయితే, లేజర్ షార్ప్ ప్రొజెక్టర్లు, నాణ్యమైన సౌండ్ సిస్టమ్‌ లు అందించే అత్యుత్తమ విజువల్స్, ఆడియో అనుభవం చాలా థియేటర్లలో లభ్యం కావడం లేదని ప్రేక్షకులు ఫిర్యాదు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా, మెట్రో నగరాలతో సహా చాలా ప్రాంతాల్లోని థియేటర్లు ప్రేక్షకులకు స్టాండర్డ్ ఎక్స్పీరియన్స్ అందించడంలో విఫలం అవుతున్నాయి. డల్ బ్రైట్‌ నెస్, తక్కువ కాంట్రాస్ట్‌ తో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో, సినిమాటోగ్రాఫర్లు, చిత్ర నిర్మాతలు థియేటర్లలో సినిమా చూడటం పీడకలగా మారిందని వాపోతున్నారు. హోమ్ ప్రొజెక్టర్లు, మొబైల్ ఫోన్లలాంటివి థియేటర్ ప్రొజెక్టర్ల కంటే ఎక్కువ కలర్స్, బ్రైట్‌ నెస్ అందిస్తున్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం థియేటర్లలో రెండు రకాల ప్రొజెక్టర్లు ఉపయోగంలో ఉన్నాయి. పాత లాంప్ ప్రొజెక్టర్లు, కొత్త లేజర్ ప్రొజెక్టర్లు. అయితే, PVR, INOX వంటి ప్రముఖ సినిమా చైన్‌ లలోని చాలా స్క్రీన్‌ లతో సహా దేశంలోని ఎక్కువ థియేటర్లు ఇప్పటికీ లాంప్ ప్రొజెక్టర్లనే ఉపయోగిస్తున్నాయని తెలుస్తోంది. కొందరు ఎగ్జిబిటర్లు బల్బ్ లైఫ్ టైమ్ పెంచడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా తక్కువ బ్రైట్‌ నెస్‌ ఉండే ప్రొజెక్టర్లను ఉపయోగిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

అందుకే కనీసం నాలుగేళ్ల కంటే తక్కువ లైఫ్ ఉన్న మల్టిప్లెక్స్ ల్లోనే సినిమా చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 3- 4ఏళ్ల తర్వాత థియేటర్లలో ప్రొజెక్టర్లు ఫేడ్ అయిపోతాయని, అవి ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభూతి ఇవ్వవవని అంటున్నారు. అందుకే ప్రీమియం థియేట్రికల్ అనుభవాన్ని అందించడంలో మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమమని చెబుతున్నారు.

ఇక్కడ అనేక మల్టీప్లెక్స్‌ లే కాకుండా, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. PVR, INOX వంటి నేషనల్ చైన్స్ ఇప్పటికీ అనేక ప్రాంతాలలో 2K స్క్రీన్‌లను అందిస్తుంటే.. ఏసియన్, ప్రసాద్స్ వంటి లోకల్ మల్టిప్లెక్స్ లు లేటెస్ట్ స్క్రీన్‌ లతో ప్రీమియం అనుభవాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.