రొటీన్ థ్రిల్లర్ మూవీలో తమన్నా.. బ్రేకొస్తుందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం `ది వి-వ్వాన్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ముంబైలో ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో దూసుకుపోతోంది.
By: Sivaji Kontham | 17 Sept 2026 7:26 PM ISTసిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం `ది వి-వ్వాన్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ముంబైలో ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈ తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూసిన కొందరు నెటిజన్లు ఇది పూర్తిగా రొటీన్ కంటెంట్‌తో తెరకెక్కిందని.. ఇందులో కొత్తదనం ఏమీ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న ట్రోల్స్‌కు ప్రఖ్యాత నిర్మాత ఏక్తా కపూర్ గట్టిగా బదులిచ్చారు.
సినిమా కంటెంట్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో ఏక్తా కపూర్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన దేశంలోని చాలా మంది కంటెంట్ క్రియేటర్లు, మేకర్స్.. సామాన్య ప్రజల నాడీకి, వాస్తవాలకు దూరంగా ఉంటున్నారని, తాము దేశం కంటే గొప్పవారమనే భ్రమలో విర్రవీగుతున్నారని విమర్శించారు. మనం మన మట్టితో.. దేశ సంస్కృతితో అనుసంధానమై ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని.. నేల విడిచి సాము చేస్తే ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని ఏక్తా హితవు పలికారు.
అయితే తన సినిమాపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి ఎదుటివారిని.. ఇతర క్రియేటర్లను అలా బహిరంగంగా విమర్శించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైంది. ఒక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులు రొటీన్ అని భావిస్తున్నప్పుడు.. దాన్ని కంటెంట్ పరంగా సమర్థించుకోవాలి కానీ.. ఇండస్ట్రీలోని మిగతా వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతమాత్రం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలోని లోపాలను లేదా రొటీన్ కథను ఎత్తిచూపే ప్రేక్షకులను తప్పుపట్టడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి `ది వి-వ్వాన్` ట్రైలర్‌ను పరిశీలిస్తే జానపద కథలు, అడవులు.. అసాధారణ శక్తుల నేపధ్యం పాత సినిమాల ఛాయలను గుర్తుకు తెస్తుందనే వాదనలో కొంత నిజం ఉంది. ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటికే అనేక చిత్రాలు రావడంతో ఇందులో కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏమిటనే దానిపై స్పష్టత కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ రకమైన రొటీన్ ఫీలింగ్ రావడం వల్లే ప్రేక్షకుల నుంచి నెగెటివిటీ వస్తోంది తప్ప.. క్రియేటర్లు అందరూ దేశానికి దూరమయ్యారనే వాదనను దీనికి ఆపాదించడం అతిశయోక్తి అవుతుంది.
అయితే ఈ చిత్రంలో చూపించిన `ఛఠ్ పూజ` వంటి సాంస్కృతిక అంశాలు... `ఛఠీ మయ్యా` పాట సినిమాకు కొంత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా ప్రదర్శించే ఈ ప్రాంతీయ సంస్కృతిని తమన్నా వంటి స్టార్ హీరోయిన్ ఎమోషనల్‌గా ఓన్ చేసుకోవడంపైనా ప్రశంసలు కురుస్తున్నాయి. ఏదేమైనా కేవలం మాటల యుద్ధాలతో విమర్శలను కవర్ చేసుకునే బదులు.. సెప్టెంబర్ 25న విడుదల కానున్న పూర్తి సినిమాతో 'ది వ్వాన్' టీమ్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
