'ది గర్ల్‌ఫ్రెండ్' వెనుక సితార వంశీ కథ
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాపై బజ్ గట్టిగానే ఉంది.
By: M Prashanth | 2 Nov 2025 11:00 PM ISTరష్మిక మందన్న లీడ్ రోల్‌లో, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాపై బజ్ గట్టిగానే ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అవ్వడం వెనుక, నిర్మాత ధీరజ్ మొగిలినేని రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన బ్యాక్‌స్టోరీని రివీల్ చేశారు. ఈ కథకు అసలు మూలం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ అని తెలిపారు.
నిర్మాత ధీరజ్ కు 'ది గర్ల్‌ఫ్రెండ్' కథను మొదటిసారి పరిచయం చేసింది నాగవంశీనేనట. "వంశీకి ఈ విషయం గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు" అంటూ ధీరజ్ నవ్వేశారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మొదట ఈ కథను సితార బ్యానర్‌లో చేద్దామనుకుని వంశీకి ఇచ్చారు. అప్పుడు వంశీ, ఆ స్క్రిప్ట్‌ను చదవమని ధీరజ్‌కు ఇచ్చారట.
"అయితే, ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ సెటప్ పూర్తిగా వేరుగా ఉంది.. ఆ రోజు వంశీ అనుకున్న సెటప్, హీరో వేరు. హీరోయిన్‌గా కూడా ఒక కొత్త అమ్మాయిని అనుకున్నారు. బహుశా ఆ టైమ్‌లో అది కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వదేమో అని, లేదా వంశీ వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్లో ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు" అని ధీరజ్ చెప్పారు.
కట్ చేస్తే, చాలా ఏళ్లు గడిచిపోయాయి. ధీరజ్ నిర్మించిన 'బేబీ' సినిమా బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత, ఆయన రష్మికతో ఒకసారి మాట్లాడారు. ఆ టైమ్‌లో రష్మిక మాట్లాడుతూ, "బేబీ లాంటి కథలు నాకెందుకు చెప్పరు? నాకు కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్లు, కాలేజ్ స్టోరీలు చేయాలని ఉంది" అని అన్నారట. "ఆమె అప్పటికే 'పుష్ప', 'యానిమల్' లాంటి పెద్ద సినిమాల్లో మెచ్యూర్డ్ రోల్స్ చేస్తూ, ఈ కాలేజ్ లైఫ్‌ను మిస్ అవుతున్నట్లు ఆమె ఫీల్ అయింది" అని ధీరజ్ అన్నారు.
రష్మిక ఆ మాట అనగానే, ధీరజ్‌కు వెంటనే ఏళ్ల క్రితం వంశీ ఇచ్చిన 'ది గర్ల్‌ఫ్రెండ్' కథ గుర్తొచ్చింది. వెంటనే రాహుల్‌ను పిలిచి, ఈ ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చారు. అలా, ఒకప్పుడు సితార బ్యానర్‌లో వేరే హీరో, కొత్త హీరోయిన్‌తో అనుకుని ఆగిపోయిన కథ, ఇప్పుడు గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో, రష్మిక లీడ్ రోల్‌గా సెట్ అయింది.
ధీరజ్ మాట్లాడుతూ, "ప్రతీ కథకూ ఒక టైమ్ రావాలి. కొన్ని కథలు నలుగురైదుగురు హీరోలను తిరిగి, ఫైనల్‌గా ఒకరి దగ్గర లాక్ అవుతాయి. 'బేబీ' కథ కూడా అలాంటిదే. 'ది గర్ల్‌ఫ్రెండ్' కథకు ఇప్పుడు టైమ్ వచ్చింది" అన్నారు. మొత్తానికి, ఆ రోజు నాగవంశీ ఆ స్క్రిప్ట్‌ను సరదాగా చదవమని ఇవ్వడం వల్లే, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయిందన్నమాట.
