ది ట్రయల్: సీజన్ 2 టాక్ ఎలా ఉంది?
ముఖ్యంగా లా ఫర్మ్‌లో వచ్చే కేసులు, వాటి సొసైటల్ యాంగిల్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రాసుకున్నారు.
By: M Prashanth | 22 Sept 2025 10:53 PM ISTఈ మధ్య కాలంలో లీగల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన వెబ్ సీరీస్ లకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ వాటిలో గుర్తిండిపోయేవి తక్కువ. ఇక లేటెస్ట్ గా ది ట్రయల్ అనే ప్రాజెక్ట్ కూడా వచ్చింది. మొదటి సీజన్‌తో పెద్దగా అంచనాలు పెంచుకోలేకపోయినా, ఆడియన్స్ దృష్టిని ఆకర్షించగలిగింది. అదే కారణంగా రెండో సీజన్‌ని జియో హాట్‌స్టార్ ముందుకు తెచ్చింది. ఈసారి మొత్తం ఆరు ఎపిసోడ్‌లు, దాదాపు 4 గంటల 40 నిమిషాల కంటెంట్‌తో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.
రెండో సీజన్‌లో కథ నేరుగా నోయనికా, రాజీవ్ మధ్య జరుగుతున్న సంబంధాల సంక్షోభం నుంచి మొదలవుతుంది. ఒకవైపు తన ఇమేజ్ క్లీనప్ కోసం రాజకీయాల్లోకి దూసుకెళ్లే రాజీవ్, మరోవైపు లా ఫర్మ్‌లో నోయనికా ఎదుర్కొనే సవాళ్లు, ఈ రెండింటి మధ్య నడుస్తున్న లవ్ హేట్ ట్రాక్ ఈ సీజన్‌కి మేజర్ పాయింట్ గా నిలుస్తుంది. కొత్త కేసులు, కొత్త సమస్యలు, కొత్త డైలమాస్ ఈసారి సిరీస్‌కి మరింత వేగాన్ని తెచ్చాయి.
ముఖ్యంగా లా ఫర్మ్‌లో వచ్చే కేసులు, వాటి సొసైటల్ యాంగిల్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రాసుకున్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణం పోవడం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో జరిగే యాక్సిడెంట్, మసాజ్ పార్లర్‌లో ఉద్యోగిని లైంగికంగా వేధించే వ్యక్తిపై కేసు.. ఇవన్నీ కథలో బలమైన పాయింట్లు. కానీ కోర్ట్ రూమ్ సన్నివేశాలు కచ్చితమైన పంచ్ లేకపోవడం వల్ల అసలైన ఎఫెక్ట్ రాలేదు. ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ, క్లైమాక్స్‌లు చాలా ఈజీగా రాసుకున్నట్టుగా అనిపిస్తాయి.
రాజకీయ రంగంలో నారాయణి వర్సెస్ రాజీవ్ పోటీని చూపించిన తీరు కూడా మరింత హ్యూమన్‌గా ఉండి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ కూడా చాలా సర్ఫెస్ లెవెల్ ట్రీట్‌మెంట్‌నే కనిపిస్తుంది. అయితే మహిళలపై రాజకీయాల్లో జరిగే క్యారెక్టర్ అససినేషన్, పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఇమేజ్ బిల్డప్ వంటి పాయింట్లు మాత్రం ఆకట్టుకుంటాయి. అదే సమయంలో నోయనికా తన వ్యక్తిగత జీవితంలో విభజన, వృత్తి జీవితంలో తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు ఈ సీజన్‌లో మరింత హైలైట్ అయ్యాయి.
నటీనటుల గురించి చెప్పాలంటే కాజోల్ ఈసారి కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం చేయలేకపోయారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా కాకుండా, ఒక సమస్య నుంచి మరోదాంట్లోకి పరుగులు పెట్టినట్టే కనిపించారు. జిషు సేంగుప్తా నటన బాగుంది కానీ రోల్ మరింత బలంగా రాసి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేది. సోనాలి కుల్కర్ణి చేసిన నారాయణి పాత్రకు కొంత ఫైర్ ఉన్నప్పటికీ రాయడంలో బలం తగ్గింది. షీబా చద్దా, కుబ్రా సైత్ లాంటి వారు పాత్రలకి తమ వంతు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా చూస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవసరమైన చోట టెన్షన్‌ను బిల్డ్ చేసినా, అంతగా ప్రత్యేకత లేదు. సినిమాటోగ్రఫీ సాదాసీదాగా ఉన్నా సన్నివేశాలకు న్యాయం చేసింది. పేస్ బాగానే ఉన్నా, ఎక్కడా ఆగి ఎమోషన్‌ని రిజిస్టర్ చేయకుండా దూసుకెళ్లిపోవడం వల్ల కనెక్ట్ తగ్గింది. మొత్తం మీద ది ట్రయల్ సీజన్ 2 మొదటి సీజన్ కంటే కాస్త బెటర్ అనిపించినా, ఇప్పటికీ పెద్దగా గుర్తుండిపోయేలా కంటెంట్ ఏమి ఇవ్వలేకపోయింది. లీగల్ డ్రామాలంటే ఇష్టం ఉన్నవారు టైమ్ పాస్ కోసం చూడొచ్చు.
