ఆయుధాలు చేతబట్టి పోరాడిన నలుగురు విప్లవకారుల కథతో
ప్రైమ్ వీడియో సరికొత్త హిందీ ఒరిజినల్ సిరీస్ `ది రివాల్యూషనరీస్` ట్రైలర్‌ను విడుదల చేసింది.
By: Sivaji Kontham | 27 Aug 2026 6:00 PM ISTప్రైమ్ వీడియో సరికొత్త హిందీ ఒరిజినల్ సిరీస్ `ది రివాల్యూషనరీస్` ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా.. సంజీవ్ సన్యాల్ రాసిన `రివాల్యూషనరీస్: ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా వోన్ ఇట్స్ ఫ్రీడమ్` పుస్తకం ఆధారంగా రూపొందింది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయుధాలు చేతబట్టి పోరాడిన నలుగురు యువ విప్లవకారుల కథతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ 11 సెప్టెంబర్ 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్‌లో భువన్ బామ్, రోహిత్ సరాఫ్, ప్రతిభా రంతా, గుర్ఫతే పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించగా జేసన్ షా, పోలీ డామ్, తోటా రాయ్ చౌదరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్‌లో భువన్ బామ్ రాష్ బిహారీ బోస్‌గా, రోహిత్ సరాఫ్ సచింద్ర నాథ్ సన్యాల్‌గా... ప్రతిభా రంతా ప్రతిభా లాహిరిగా ... గుర్ఫతే పిర్జాదా బాగా జతిన్‌గా పరిచయమయ్యారు. బ్రిటిష్ రాజ్ క్రూరత్వానికి.. ముఖ్యంగా జేసన్ షా పోషించిన జనరల్ డయ్యర్ ముప్పుకి వ్యతిరేకంగా ఈ నలుగురు యోధులు జరిపిన సాయుధ పోరాట ఘట్టాలను హైలైట్ చేస్తూ ట్రైలర్ సాగింది.
రాష్ బిహారీ బోస్ పాత్రను పోషించిన ప్రముఖ నటుడు భువన్ బామ్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం సాధారణ స్వాతంత్య్ర సమరయోధుల డ్రామా మాత్రమే కాదని.. స్నేహం, త్యాగం .. ఒకే లక్ష్యం కోసం రక్తం చిందించిన నలుగురు యువకుల కథ అని పేర్కొన్నారు. బ్రిటిష్ క్యాంపుల్లోకి మారువేషంలో చొరబడే రాష్ బిహారీ బోస్ పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు చాలా తక్కువగా ఉండటంతో తన సొంత నటనతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించానని తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం పోరాట ఘట్టాలతో యాక్షన్ మోడ్ లో ఆకట్టుకుంటోంది.
మరో ప్రధాన పాత్రధారి రోహిత్ సరాఫ్ సచింద్ర నాథ్ సన్యాల్‌గా నటించడం తనను శారీరకంగా- మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. సచింద్ర నాథ్ సన్యాల్‌లోని అమాయకత్వం.. అలాగే దేశంపై ఆయనకున్న అచంచలమైన విశ్వాసం ఉత్కంఠకు గురి చేశాయని.. ఈ పాత్ర కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. అలాగే పురుషాధిక్య ప్రపంచంలో తన గొంతును వినిపించే ప్రతిభా లాహిరి పాత్రలో నటించిన ప్రతిభా రంతా ఆనాటి ఒక ప్రగతిశీల మహిళ పోరాటం నేటి కాలానికి కూడా ఎంతో సంబంధం కలిగి ఉందని వివరించారు.
బాగా జతిన్ పాత్రను పోషించిన గుర్ఫతే పిర్జాదా మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత చరిత్రలోని ఒక తెలియని అధ్యాయం తనకు పరిచయమైందని చెప్పారు. బాగా జతిన్‌లోని నిశ్శబ్ద బలం- అదుపులో ఉంచుకునే కోపం తనను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. సాధారణ పీరియడ్ డ్రామాల్లా కాకుండా.. ఈ సిరీస్‌ను యువతకు కనెక్ట్ అయ్యేలా వేగవంతమైన యాక్షన్ టోన్‌తో దర్శకుడు నిఖిల్ అద్వానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మలిచారని తెలిపారు. అయితే స్వాతంత్య్ర సమర యోధుల కథలు భారతీయ ప్రజలకు కొత్తేమీ కాదు. ఈ సిరీస్ లో యూనిక్ గా ఏం ఉంటుంది? అనేదే విజయాన్ని నిర్ణయిస్తుంది.
