ఆ ఎర్రటి బ్యాగులో ఏముంది? ఉత్కంఠ రేపుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ పోస్టర్!
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది.
By: M Prashanth | 2 May 2026 9:26 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. కేవలం కథా బలంతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా మేకర్స్ కొత్త రకమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మెమరీ మేకర్స్’ బ్యానర్‌పై వస్తున్న ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారని అర్ధమవుతుంది. ఇక లేటెస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. రక్తంతో ఉన్న చెయ్యి ఎర్రటి బ్యాగును పట్టుకుని ఉండటం, దాని చుట్టూ తుపాకులు, కత్తులు పడి ఉండటం చూస్తుంటే సినిమాలో ఏ స్థాయిలో హింస, ఉత్కంఠ ఉండబోతున్నాయో తెలుస్తోంది. ఆ బ్యాక్ గ్రౌండ్ సినిమా మూడ్‌ను మరింత డార్క్ గా చూపిస్తోంది.
ఆ బ్యాగ్ మీద ఉన్న బంగారు సీతాకోకచిలుక లోగో ఈ కథలో ఏదో ఒక బలమైన రహస్యం దాగి ఉందని హింట్ ఇస్తోంది. ఈ ఒక్క పోస్టర్‌తోనే డైరెక్టర్ రవి కుమార్ సీరపు ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించారు. సినిమాలోని పాత్రల విషయానికి వస్తే, నెగటివ్ రోల్స్ లో తనదైన ముద్ర వేసిన కబీర్ సింగ్ ఇందులో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ అని మేకర్స్ చెబుతున్నారు.
ఆయనతో పాటు ప్రసాద్ బెహరా, రాధ్య, స్నేహ సింగ్, మోనికా, ఆకాంక్ష వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతి పాత్రకు కథలో ఒక ప్రాముఖ్యత ఉంటుందని, ఎవరూ కేవలం పేరు కోసం కాకుండా కథను మలుపు తిప్పే విధంగానే ఉంటారని సమాచారం. ఈ సినిమాలోని ప్రధాన భాగాలను థాయిలాండ్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. అక్కడ తీసిన యాక్షన్ సీక్వెన్స్ లు, పాటలు సినిమాకు విజువల్ గా ఒక రిచ్ లుక్ తీసుకొస్తాయని టీమ్ నమ్మకంగా ఉంది.
నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి కొత్తవారైనా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను అత్యంత నాణ్యతతో నిర్మించారని తెలుస్తోంది. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ, శేఖర్ మోపురి మ్యూజిక్ సినిమాలోని టెన్షన్‌ను ప్రతి సీన్‌లోనూ ఎలివేట్ చేసేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఎడిటర్ శివ శర్వాణి కట్స్ సినిమా వేగాన్ని ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారట. ప్రస్తుతం టీజర్ పనులు తుది దశలో ఉన్నాయి, త్వరలోనే దీన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే టీజర్ మీద కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక పక్కా విందులా ఉంటుందని మేకర్స్ భరోసా ఇస్తున్నారు. మొత్తానికి ఆ రెడ్ బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ డేంజరస్ గేమ్ వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
