రాజాసాబ్ ట్రైలర్ 2.0: హారర్ తో పాటు హెవీ సెంటిమెంట్.. కానీ..
ప్రభాస్ కు, ఆ ఆత్మకు మధ్య జరిగే వార్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని అర్థమవుతోంది.
By: M Prashanth | 29 Dec 2025 3:35 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న 'ది రాజాసాబ్' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ 2.0 సినిమా జానర్ పై మరింత క్లారిటీ ఇచ్చింది. కేవలం హారర్ కామెడీ మాత్రమే కాకుండా, ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ లుక్, డైలాగ్ డెలివరీ వింటేజ్ డార్లింగ్ ను గుర్తు చేసేలా ఉన్నాయి.
ట్రైలర్ ఆరంభమే ఒక ఎమోషనల్ నోట్ తో మొదలైంది. "నానమ్మ.. ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా.. ఆయన్ని మాత్రం అస్సలు మర్చిపోలేవు" అనే డైలాగ్ సినిమాలోని అసలు కథను రివీల్ చేస్తోంది. గంగమ్మ అనే పాత్ర చుట్టూ, ఆమె గతం చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్ధమవుతుంది. నాన్నమ్మ సెంటిమెంట్ సినిమాకు ప్రధాన బలం అయ్యేలా కనిపిస్తోంది. ఆ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న హారర్ ఎలిమెంట్స్ ను మారుతి తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేశారు.
అయితే ట్రైలర్ లోని విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో మాత్రం ఆడియెన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. మహల్ సెటప్, ఇంటీరియర్ షాట్స్ రిచ్ గా ఉన్నప్పటికీ.. దెయ్యాలు, క్రియేచర్స్ కు సంబంధించిన గ్రాఫిక్స్ నాణ్యత అంతంత మాత్రంగానే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ 'తాత' పాత్రలో చాలా సీరియస్ గా, భయపెట్టేలా కనిపించారు. "వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి" అని చెప్పే డైలాగ్ లో విలనిజం కనిపిస్తోంది.
ప్రభాస్ కు, ఆ ఆత్మకు మధ్య జరిగే వార్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రభాస్ "అయితే ఏందిరా ఇప్పుడు?" అంటూ చెప్పే మాస్ డైలాగ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది. ఏదో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా మారుతి మైండ్ గేమ్ తరహాలో స్క్రీన్ ప్లేను మిక్స్ చేసినట్లు అర్ధమవుతుంది.
సాధారణంగా ఇలాంటి హారర్ ఫాంటసీ సినిమాల్లో గ్రాఫిక్స్ ఎంత ముఖ్యమో, కథలోని ఎమోషన్ కూడా అంతే ముఖ్యం. గ్రాఫిక్స్ విషయంలో చిన్న చిన్న లోపాలు ఉన్నా.. సినిమాలోని ఎమోషనల్ ఫ్లో, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటే ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోరు. గతంలో చాలా సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. మారుతి కూడా కథలో ఉన్న డ్రామాను, హ్యూమర్ ను నమ్ముకునే ఈ ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
ఇక ఫైనల్ గా 'రాజాసాబ్' ట్రైలర్ 2.0 ఆడియెన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా సినిమా థీమ్ ఏంటో క్లియర్ గా చెప్పేసింది. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా, ప్రభాస్ స్టార్ డమ్ కు తోడు మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలిసొస్తే బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం రాబట్టే అవకాశం ఉంది. చూడాలి మరి వెండితెరపై రాజాసాబ్ మ్యాజిక్ ఎలా ఉంటుందో.
