రాజా సాబ్: తెలుగులో ఓకే.. మరి మిగతా చోట్ల?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజా సాబ్ మూవీతో ఈ ఏడాది సంక్రాంతి సందడి మొదలు కానుంది.
By: M Prashanth | 4 Jan 2026 12:48 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజా సాబ్ మూవీతో ఈ ఏడాది సంక్రాంతి సందడి మొదలు కానుంది. అంతే కాదు.. 2026లో రిలీజ్ కానున్న ఫస్ట్ భారీ చిత్రం కూడా అదే కావడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఆ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది.
అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. దీంతో సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదు కానున్నాయి. ప్రీమియర్స్ ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తుండడంతో.. తొలిరోజు వసూళ్లు పెద్ద ఎత్తున వసూలవ్వడం పక్కా అనే చెప్పాలి.
ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ వస్తే.. రాజా సాబ్ కు తిరుగులేదు. దానికి తోడు సంక్రాంతి సీజన్ కాబట్టి భారీ వసూళ్లు సాధించనుంది. అయితే తెలుగులో రాజా సాబ్ ఓకే.. మరి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందుకే తెలుగు తప్ప మిగతా భాషల్లో పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం.
ముందుగా నార్త్ విషయానికొస్తే.. అక్కడ ప్రభాస్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ప్రమోషన్లతో సంబంధం లేకుండా.. ప్రభాస్ నటించిన పలు సినిమాలు ఇప్పటికే ఉత్తరాది అంతా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నాయి. ఇప్పుడు రాజా సాబ్ మూవీ విషయంలో కూడా అదే జరగనుండడం ఖాయం.
దానికితోడు సంక్రాంతి సీజన్ లో చెప్పుకోదగ్గ హిందీ సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు కాబట్టి రాజా సాబ్‌కు ఎలాంటి పోటీ ఉండదు. ఆ తర్వాత తమిళనాడు విషయానికొస్తే.. అక్కడ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు దళపతి విజయ్ జన నాయగన్ తో.. శివ కార్తికేయన్ పరాశక్తి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఆ రెండు సినిమాలు జనవరి 9వ తేదీ ఒకటి.. జనవరి 10వ తేదీన మరొకటి రిలీజ్ అవుతున్నాయి. దీంతో తమిళనాడులో రాజా సాబ్ గట్టి పోటీ ఎదురయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో కర్ణాటక, కేరళలో రాజా సాబ్ కు పెద్దగా పోటీ ఉండదు. దీంతో అక్కడ మంచి ఓపెనింగ్స్ అందుకుంటుందని చెప్పాలి.
మొత్తానికి.. తమిళనాడు మినహా తెలుగు రాష్ట్రాలు సహా అన్ని చోట్ల రాజా సాబ్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ కచ్చితంగా అందుకుంటుంది. మంచి టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. అనేక రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఉంది. మరి రాజా సాబ్ మూవీ.. ఇండియాలో ఎంతటి ఓపెనింగ్స్ సాధిస్తుందో వేచి చూడాలి.
