Begin typing your search above and press return to search.

మరాఠా యోధుడి పాత్రలో రిషబ్ శెట్టి విశ్వరూపం!

చారిత్రక వీరుల జీవిత చరిత్రలను వెండితెరపై ఆవిష్కరించే పరంపరలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.

By:  Srikanth Kontham   |   30 Oct 2026 11:00 PM IST
మరాఠా యోధుడి పాత్రలో రిషబ్ శెట్టి విశ్వరూపం!
X

చారిత్రక వీరుల జీవిత చరిత్రలను వెండితెరపై ఆవిష్కరించే పరంపరలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తెరపైకి రానుంది. `కాంతార` వంటి సంచలన విజయం తర్వాత బాక్సాఫీస్ వద్ద పాన్-ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరియు దర్శకుడు సందీప్ సింగ్ సంయుక్తంగా ఈ భారీ చారిత్రక చిత్రాన్ని నిర్మించనున్నారు.

`ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్` అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్క‌నుంది. మరాఠా యోధుడి అసాధారణ జీవితం.. సాధించిన చారిత్రక విజయాలు.. స్వరాజ్య స్థాపన కోసం కన్న కలలు .. చేసిన త్యాగాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. తెలిసిన చరిత్రే కాకుండా శివాజీ మహారాజ్ జీవితానికి సంబంధించిన అరుదైన తక్కువగా ప్రచారంలో ఉన్న అంశాలను కూడా ఈ చిత్రంలో వెలికితీయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమా ప్రకటన సందర్భంగా ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ క్షణం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్‌తో తమ అనుబంధాన్ని పురస్కరించుకుని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్.. హీరో రిషబ్ శెట్టికి ఒక శతాబ్దం నాటి పురాతన ఛత్రపతి శివాజీ మహారాజ్ పెయింటింగ్‌ను బహుమతిగా అందించడం విశేషం. శివాజీ మహారాజ్ శక్తివంతమైన నాయకత్వాన్ని.. దార్శనికతను తెరపైకి తీసుకురావడానికి రిషబ్ శెట్టి వంటి పవర్ పుల్ నటుడే సరైన ఎంపిక అని భూషణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఈ చారిత్రక చిత్రాన్ని ఒకే పార్ట్‌గా కాకుండా భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జ‌రుగుతున్నాయి. 2027 ప్రారంభంలోనే షూటింగ్ ప్రారంభం కానుంది . భారతదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు, భారీ తారాగణం ఈ చిత్రంలో భాగం కానున్నారు.

సందీప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిషి విర్మానితో కలిసి కథను కూడా అందిస్తున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్ - లెజెండ్ స్టూడియోస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సినిమా నిర్మిస్తున్నారు. రిషబ్ శెట్టితో పాటు శివ్ చనానా, కబీర్ సదానంద్ భారీ ప్రాజెక్ట్‌కు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

`కాంతార`తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు చరిత్రలో అత్యంత యోధుడి పాత్రను ఎంచుకోవడం ఇండస్ట్రీలో అంచనాలను అంత‌కంత‌కు పెంచేస్తుంది. `ది ప్రైడ్ ఆఫ్ భారత్` రూపంలో రాబోతున్న రెండు భాగాల విజువల్ వండర్ ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.