మాస్ సినిమా డ్యాన్స్ ఫార్ములానే మార్చేస్తున్న 'ది ప్యారడైజ్'?
సాధారణంగా మాస్ సినిమా అంటే హీరో నుంచి భారీ డ్యాన్స్ మూమెంట్స్, స్టైలిష్ హుక్ స్టెప్స్, థియేటర్లలో ఆడియన్స్ తో ఈలలు వేయించే కొరియోగ్రఫీని ఆశిస్తారు.
By: Sravani Lakshmi Srungarapu | 12 Sept 2026 7:28 PM ISTది ప్యారడైజ్.. నాని కెరీర్‌లోనే కాకుండా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల జర్నీలోనూ భారీ అంచనాలు పెంచుతున్న సినిమా. దసరా తర్వాత శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన ఆయా షేర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మ్యూజిక్ పరంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా వచ్చిన యేషనాగుల కట్ట కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళ్లింది. అయితే ఈ సాంగ్ విషయంలో ఆసక్తికరమైన అంశం మ్యూజిక్ మాత్రమే కాదు.. దాని డ్యాన్స్ ట్రీట్‌మెంట్ కూడా ఇప్పుడు డిస్కషన్‌కు దారితీస్తోంది.
సాధారణంగా మాస్ సినిమా అంటే హీరో నుంచి భారీ డ్యాన్స్ మూమెంట్స్, స్టైలిష్ హుక్ స్టెప్స్, థియేటర్లలో ఆడియన్స్ తో ఈలలు వేయించే కొరియోగ్రఫీని ఆశిస్తారు. ముఖ్యంగా స్టార్ హీరో నుంచి సినిమా వస్తుందంటే అందులో ఏ సాంగ్ లో ఎలాంటి హుక్ స్టెప్ ఉంటుందో, ఏది వైరల్ అవుతుందో అని అందరూ ఎదురుచూస్తుంటారు. కానీ యేషనాగుల కట్ట సాంగ్‌లో మాత్రం శ్రీకాంత్ ఓదెల అందుకు భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నారు. సాంగ్‌లో ఉన్న జోష్‌ను భారీ డ్యాన్స్ స్టెప్స్‌తో చూపించకుండా, నేచురల్ మాస్ మూమెంట్స్‌తో విజువలైజ్ చేయడం ద్వారా ప్యారడైజ్ ప్రపంచానికి తగ్గ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడే ఈ సాంగ్ డ్యాన్స్‌పై మొదట్లో వచ్చిన విమర్శలు కూడా సినిమాకు ఒక రకంగా ప్లస్‌గా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట్లో డ్యాన్స్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం, కొరియోగ్రఫీపై డిస్కషన్ జరగడం వల్ల సాంగ్‌కు ఎక్స్‌ట్రా అటెన్షన్ వచ్చింది. సాధారణంగా ఒక సాంగ్ రిలీజైన తర్వాత కొన్ని రోజులకు దాని గురించి డిస్కషన్ తగ్గిపోతుంది. కానీ యేషనాగుల కట్ట విషయంలో మాత్రం ఇలాంటి ఊపున్న సాంగ్ కు అంత స్లో స్టెప్పులేయించారు? అసలు డైరెక్టర్ ఉద్దేశ్యమేంటనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించాయి. ఈ విమర్శలే ఒక విధంగా సాంగ్‌కు ఫ్రీ ప్రమోషన్‌గా మారాయి.
అయితే సాంగ్‌కు ఇలాంటి డ్యాన్స్ కంపోజేషన్ ను ఫిక్స్ చేసింది తానేనని, ఓ ఇరగదీసే స్టెప్పులు కాకుండా, సినిమాను వీలైనంత నేచురల్ గా ఉండేలా తీయాలనే ఆలోచనతోనే ఈ డెసిషన్ ను తీసుకున్నానని, ఇందులో కొరియోగ్రాఫర్ తప్పేమీ లేదని డైరెక్టర్ చెప్పారు. అయితే స్పెషల్ సాంగ్ కు ఇలాంటి స్లో స్టెప్పులు వేయించడం ట్రెండ్ కోసం తీసుకున్న డెసిషనా లేక ది ప్యారడైజ్ సినిమాలో మాస్‌ను చూపించే విధానమే మారబోతోందా? అనేది ఆసక్తికరంగా మారింది. మాస్ అంటే తప్పనిసరిగా భారీ స్టెప్పులు ఉండాల్సిన అవసరం లేదని, పాత్రల సహజత్వం, కథా ప్రపంచం, సిట్యుయేషన్‌కు తగ్గ బాడీ లాంగ్వేజ్ కూడా మాస్ ఎలివేషన్‌గా పనిచేయగలదని శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నారా అనే డిస్కషన్ మొదలైంది.
ఇప్పటికే సాంగ్స్ ఆడియన్స్ లోకి బలంగా వెళ్లడంతో ది ప్యారడైజ్ కు మ్యూజిక్ పరంగా మంచి బజ్ ఏర్పడింది. సెప్టెంబర్ 24న సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో.. సాంగ్స్ ద్వారా వచ్చిన ఈ హైప్ సినిమాకు ఎంతవరకు ఆసక్తికరంగా మారుతుందో చూడాలి. ఒకవేళ శ్రీకాంత్ ఓదెల తన మాస్ ట్రీట్‌మెంట్‌తో మరోసారి కొత్త మార్క్ సెట్ చేస్తే, యేషనాగుల కట్టపై జరిగిన డిస్కషన్ సినిమా ప్రమోషన్‌లో కీలకమైన ముందస్తు అడుగుగా మిగిలిపోవచ్చు.
