Begin typing your search above and press return to search.

రూ.500 షో నుంచి.. ‘ప్యారడైజ్’ టికెట్ ప్లాన్ ఇలా!

గత కొన్ని రోజులుగా ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లపై ఒక టాక్ నడుస్తోంది. ప్రీమియర్‌కు రూ.300, రూ.400 వరకు ఉండొచ్చనే కామెంట్స్ కూడా వినిపించాయి.

By:  M Prashanth   |   20 Sept 2026 10:12 PM IST
రూ.500 షో నుంచి.. ‘ప్యారడైజ్’ టికెట్ ప్లాన్ ఇలా!
X

గత కొన్ని రోజులుగా ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లపై ఒక టాక్ నడుస్తోంది. ప్రీమియర్‌కు రూ.300, రూ.400 వరకు ఉండొచ్చనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 20 తేదీతో అధికారిక ఆర్డర్ ఇచ్చింది. ఇందులో సెప్టెంబర్ 23 సాయంత్రం 6:30 గంటలకు ఒక్క స్పెషల్ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. జీఎస్టీ కూడా ఇందులోనే ఉంటుంది. నాని సినిమాకు ప్రీమియర్ షోనే ఈ రేటుతో మొదలవుతుండటం వల్ల హైదరాబాద్ బుకింగ్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చూడాల్సి ఉంది.

రెగ్యులర్ రిలీజ్ సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతుంది. 24 నుంచి 27 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరపై రూ.48 అదనపు పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో రూ.95 వరకు పెంచుకోవచ్చు. ఈ నాలుగు రోజులు రోజుకు ఐదు షోలకు ఈ రేట్లు వర్తిస్తాయి. అంటే గురువారం నుంచి ఆదివారం వరకు మొదటి వీకెండ్ మొత్తం పెరిగిన ధరలతోనే సినిమా నడవనుంది. ఓపెనింగ్ వీకెండ్‌లో ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడానికి నిర్మాతలు కోరిన హైక్‌కు ప్రభుత్వం ఈ మేరకు అనుమతి ఇచ్చింది.

అయితే సోమవారం నుంచి కూడా రేట్లు వెంటనే పాత స్థాయికి రావు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.23, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లకు రూ.45 అదనపు పెంపు ఉంటుంది. మొదటి నాలుగు రోజుల తర్వాత హైక్‌ను తగ్గిస్తూ మరో ఆరు రోజులు కొనసాగించేలా అనుమతి ఇచ్చారు. నాని సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా వస్తారు. వీకెండ్ తర్వాత రేటు కొంత తగ్గడం వల్ల రెండో దశలో నార్మల్ ప్రేక్షకులకు ఖర్చు కొంచెం తగ్గుతుంది.

ఈ ఆర్డర్‌లో టికెట్ రేట్లతో పాటు మరో షరతు కూడా ఉంది. నిర్మాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి రూ.1 కోటి తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ మొత్తాన్ని సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలి.

థియేటర్లకు మరో సూచన కూడా ఇచ్చారు. డ్రగ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, లైసెన్సింగ్ అధికారులు ఈ నిబంధనలు అమలవుతున్నాయో చూడాలని పేర్కొన్నారు. దీంతో ‘ది ప్యారడైజ్’ కోసం ఇచ్చిన ప్రత్యేక అనుమతిలో టికెట్ ధరలతో పాటు థియేటర్లు పాటించాల్సిన అంశాలను కూడా ప్రభుత్వం జత చేసింది.

ఇప్పుడు సెప్టెంబర్ 23 బుకింగ్స్‌పైనే ఫోకస్ ఉంటుంది. స్పెషల్ షోకు రూ.500 అనుమతి ఉన్నా అన్ని థియేటర్లు అదే ధర పెడతాయా, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుందా అన్నది బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. అలాగే 24 నుంచి మల్టీప్లెక్స్‌లలో ప్రస్తుత ధరకు రూ.95 పెరిగితే కొన్ని ప్రైమ్ షోలు ఎంత వరకు వెళ్తాయన్నది కూడా అప్పుడే తెలుస్తుంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర సెంటర్లలో ధరలు బయటకు వచ్చిన తర్వాత నాని సినిమాకు ఈ హైక్ ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.