ప్యారడైజ్ టికెట్ల రేట్లు ఎలా ఉండబోతున్నాయి?
ఏపీలో ఎలాగూ అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వస్తాయి కాబట్టి, కొంచెం ముందుగానే దరఖాస్తు పెట్టుకుని జీవో తెచ్చుకుందామని చూస్తున్నారట.
By: Garuda Media | 12 Sept 2026 3:29 PM ISTతెలుగులో బాగా క్రేజున్న, పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయంటే వాటి టికెట్ల ధరల మీదికి దృష్టి మళ్లుతుంది. ‘పెద్ది’ తర్వాత ఏ తెలుగు చిత్రానికీ రేట్లు పెంచలేదు. ఈ మూడు నెలల్లో రిలీజైనవన్నీ చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే కావడంతో రేట్లు పెంచాల్సిన అవసరం కూడా పడలేదు. ఐతే డబ్బింగ్ మూవీ అయిన ‘టాక్సిక్’కు రేట్లు పెంచి రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమైంది. సినిమా కూడా బాలేకపోవడంతో అధిక రేట్ల తాలూకు ప్రతికూల ప్రభావం సినిమా మీద గట్టిగానే పడింది.
రేట్లు పెంచకుండా రిలీజ్ చేసిన చాలా సినిమాలకు మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 24న విడుదల కానున్న ‘ది ప్యారడైజ్’కు రేట్లు పెంచాలా వద్దా అనే మీమాంసలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఈ సినిమా ప్రెస్ మీట్లో నిర్మాత సుధాకర్ చెరుకూరిని టికెట్ల రేట్ల గురించి అడిగితే.. పెంచాలా వద్దా అని ఆలోచిస్తున్నామని, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ప్రేక్షకుల కోణంలో చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంచకుండా రిలీజ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. కానీ ‘ది ప్యారడైజ్’ మీద నాని మార్కెట్ స్థాయికి మించి చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశారు. బడ్జెట్ రూ.200 కోట్లు దాటినట్లు అంచనా. అందుకు తగ్గట్లే సినిమాను భారీ రేట్లకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచకపోతే రికవరీ కష్టమేమో అన్నది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల భయం. సినిమాకు క్రేజ్ బాగా ఉన్న నేపథ్యంలో ఒక మోస్తరుగా రేట్లు పెంచినా.. పర్వాలేదన్న అభిప్రాయం డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
ఏపీలో ఎలాగూ అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వస్తాయి కాబట్టి, కొంచెం ముందుగానే దరఖాస్తు పెట్టుకుని జీవో తెచ్చుకుందామని చూస్తున్నారట. అక్కడ సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 మేర రేటు పెంచే అవకాశం ఉందట. తెలంగాణలో మామూలుగానే టికెట్ల రేట్లు కొంచెం ఎక్కువ, పైగా ఇక్కడ జీవో తెచ్చుకోవడం తేలిక కాదు.. పైగా ఆలస్యం అయి బుకింగ్స్ మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఇక్కడ హైక్స్ కోసం ప్రయత్నించకపోవచ్చని తెలుస్తోంది.
