'పెద్ది'లో మిస్ అయింది.. 'ది ప్యారడైజ్'లో క్లిక్కవుతాడా?
కానీ ఇక్కడే అసలు తేడా రావాలి. ‘కిల్’లో చేసినదే మళ్లీ చేస్తే కొత్తగా అనిపించదు. రాఘవ్ కూడా తన క్యారెక్టర్ లుక్ చూసిన వాళ్లు “ఇది నువ్వేనా?” అని అడిగారని చెప్పాడు.
By: M Prashanth | 23 Aug 2026 9:51 AM ISTహిందీలో పేరు తెచ్చుకున్న నటుడిని తెలుగు సినిమాలోకి తీసుకొస్తే క్యారెక్టర్ కూడా క్లిక్ అవుతుందనే లెక్క ఈమధ్య పనిచేయడం లేదు. ‘పెద్ది’లో అదే కనిపించింది. ‘మీర్జాపూర్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందును తీసుకొచ్చినా, ఆయన చేసిన పాత్ర మాత్రం సినిమా తర్వాత పెద్దగా మాట్లాడుకునే స్థాయికి వెళ్లలేదు. పేరు వల్ల ముందుగా బజ్ వచ్చింది కానీ, క్యారెక్టర్ బలం అదే రేంజ్‌లో పడలేదు.
ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో రాఘవ్ జుయల్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ‘కిల్’తో సైకో విలన్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. నవ్వుతూ మాట్లాడే తీరు, ఒక్కసారిగా క్రూరంగా మారే బాడీ లాంగ్వేజ్.. ఆ సినిమాలో బాగా వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడు అదే రాఘవ్‌ను శ్రీకాంత్ ఓదెల నానికి ఎదురుగా పెట్టాడు.
కానీ ఇక్కడే అసలు తేడా రావాలి. ‘కిల్’లో చేసినదే మళ్లీ చేస్తే కొత్తగా అనిపించదు. రాఘవ్ కూడా తన క్యారెక్టర్ లుక్ చూసిన వాళ్లు “ఇది నువ్వేనా?” అని అడిగారని చెప్పాడు. అంటే కనీసం లుక్ దగ్గరే పూర్తిగా మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెరపై కూడా విక్రమ్ మాలిక్‌ను ‘కిల్’ విలన్ నుంచి ఎంత దూరంగా తీసుకెళ్లారన్నదే చూడాలి.
‘పెద్ది’లో దివ్యేందు విషయంలో వచ్చిన సమస్య కూడా ఇదే. ఒక పాపులర్ నటుడు ఉన్నాడనే పేరు మాత్రమే సరిపోలేదు. హీరోకి ఎదురుగా నిలిచే క్యారెక్టర్‌కు సీన్స్, బిల్డప్, కథలో బలం కూడా ఉండాలి. లేకపోతే బయట నుంచి తీసుకొచ్చిన పేరే పెద్దదిగా మిగిలిపోతుంది. ‘ది ప్యారడైజ్’లో రాఘవ్ విషయంలో శ్రీకాంత్ ఓదెల ముందు ఉన్న పని కూడా అదే.
నాని ఇందులో జడల్‌గా పూర్తిగా రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాంటి హీరోకి ఎదురుగా విలన్ కూడా కాస్త వేరే రేంజ్‌లో ఉండాలి. పైగా ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల చేస్తున్న సినిమా కావడంతో విలన్ ట్రాక్ మీద కూడా అంచనాలు ఉంటాయి. రాఘవ్‌కు ‘కిల్’ వల్ల ముందే ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, దాన్ని బ్రేక్ చేసి కొత్తగా చూపించగలిగితేనే ఈ కాంబినేషన్‌కు అసలు క్రేజ్ వస్తుంది. అందుకే ‘పెద్ది’లో దివ్యేందు మిస్ అయిన చోట ‘ది ప్యారడైజ్’లో రాఘవ్ క్లిక్ అవుతాడా అన్న కంపారిజన్ టాక్ వస్తోంది. ఇద్దరూ హిందీ నుంచి మంచి గుర్తింపుతో వచ్చిన నటులే. తెలుగులో ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటారో చూడాలి.
