Begin typing your search above and press return to search.

ట్రైలర్ లేకున్నా ఫుల్ హైప్.. నెక్స్ట్ ఫాలో అయ్యేదెవరు?

సాధారణంగా సినిమాకు ట్రైలర్ ఇంపార్టెంట్. ముఖ్యంగా రిలీజ్ దగ్గర పడే కొద్దీ ట్రైలర్ ద్వారా అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్లాలని మేకర్స్ చూస్తుంటారు.

By:  M Prashanth   |   12 Sept 2026 2:26 PM IST
ట్రైలర్ లేకున్నా ఫుల్ హైప్.. నెక్స్ట్ ఫాలో అయ్యేదెవరు?
X

సినిమా వస్తుందంటే ముందుగా టీజర్.. ఆ తర్వాత ట్రైలర్.. రిలీజ్‌ కు ముందు వరుస ప్రమోషన్స్.. ఇదే ఇప్పటివరకు బడా సినిమాల ఫార్ములా. కానీ ది ప్యారడైజ్ ఆ ఫార్ములాను కాస్త పక్కన పెట్టేసింది. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఆ సినిమాకు ట్రైలర్ ఉండదని హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రైలర్ లేకుండానే ఫుల్ హైప్ కొనసాగుతుండటం.. నెక్స్ట్ సినిమాలు కూడా ఇదే రూట్‌ ఫాలో అవుతాయా అనే చర్చ మొదలైంది.

సాధారణంగా సినిమాకు ట్రైలర్ ఇంపార్టెంట్. ముఖ్యంగా రిలీజ్ దగ్గర పడే కొద్దీ ట్రైలర్ ద్వారా అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్లాలని మేకర్స్ చూస్తుంటారు. కానీ ప్యారడైజ్ విషయంలో మాత్రం ట్రైలర్ కట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మూవీ టీమ్ మొదట ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకుంది. కానీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ కట్ చేయడానికి 4-5 రోజులు పడుతుంది.

ఆ టైమ్ ను ట్రైలర్ కోసం కేటాయిస్తే.. సినిమా వర్క్ బర్డెన్ దృష్టి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే ట్రైలర్ కంటే సినిమాకే ఎక్కువ టైమ్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ప్రమోషన్ కోసం కొత్త కంటెంట్ రెడీ చేయడం కంటే.. థియేటర్లలోకి వెళ్లే అసలు కంటెంట్‌ ను మరింత స్ట్రాంగ్ గా సిద్ధం చేయడానికే టైమ్ ఇచ్చింది. మరోవైపు ఓవర్సీస్ ప్రీమియర్స్ కోసం కంటెంట్‌ ను ముందుగానే అందించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఒక్కో గంట కూడా చాలా వాల్యుబుల్.

అయితే ఇంతకీ ట్రైలర్ లేకపోవడం వల్ల హైప్ తగ్గిందా అంటే.. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని సినిమాకు ఉన్న క్రేజ్ కూడా దీనికి కలిసొస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై ఉన్న అంచనాలు కూడా హైప్ పెంచుతున్నాయి. దీంతో ట్రైలర్ లేకపోయినా ప్యారడైజ్ పై చర్చ మాత్రం కొనసాగుతోంది.

అయితే ఆ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం టాలీవుడ్‌ లో ఓ కొత్త ఆలోచనకు దారి తీసే అవకాశం ఉంది. ట్రైలర్ లేకుండానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచగలిగితే.. ప్రతి సినిమాకూ మస్ట్ గా ట్రైలర్ కావాలా అనే ప్రశ్న రావచ్చు. అయితే ఇది అందరికీ వర్క్ అవుతుందని చెప్పలేం. ఇప్పటికే బజ్ ఉన్న సినిమా, క్రేజీ కాంబినేషన్, స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నప్పుడే ఇలాంటి ప్రయోగం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.

ఇక ప్యారడైజ్ మూవీ ఇప్పుడు ట్రైలర్ చూపించకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తోంది. మరి ఆ నిర్ణయం ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. ట్రైలర్ లేకుండానే హైప్ క్రియేట్ చేయొచ్చని చూపించిన సినిమాగా ప్యారడైజ్ నిలిచే ఛాన్స్ ఉంది. అప్పుడు నెక్స్ట్ ఎవరు ఆ రూట్‌ ను ఫాలో అవుతారన్నది వేచి చూడాలి.