ది ప్యారడైజ్ ఎమోషన్ అంతా అందులోనేనా?
కానీ ఇప్పుడదే పదం గురించి నాని చేసిన కామెంట్స్ చూస్తే.. అది కేవలం హైప్ కోసం ఉపయోగించిన డైలాగ్ కాదనే విషయం స్పష్టమవుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 18 Sept 2026 6:28 PM ISTనేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్‌పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మొదటి నుంచే దీనిపై ఆసక్తి ఏర్పడింది. అయితే సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ వరకు ప్రతీ అంశం ది ప్యారడైజ్ పై డిస్కషన్ ను పెంచుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమోలో వినిపించిన ఓ అసభ్యకర పదం సోషల్ మీడియాలో వైరల్ కావడం సినిమాకు ఎక్స్‌ట్రా బజ్ ను తీసుకొచ్చింది. కానీ ఇప్పుడదే పదం గురించి నాని చేసిన కామెంట్స్ చూస్తే.. అది కేవలం హైప్ కోసం ఉపయోగించిన డైలాగ్ కాదనే విషయం స్పష్టమవుతోంది.
బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ పదం గురించి నానికి ప్రశ్న ఎదురైంది. కన్నడ సినిమాల్లో ఇలాంటి పదాలను ఎక్కువగా ఉపయోగించరని, మరి ది ప్యారడైజ్ సినిమాలో దాన్ని స్పెషల్ గా పెట్టడమే కాకుండా అనౌన్స్‌మెంట్ వీడియోలో కూడా దాన్ని ఎందుకు పెట్టారని మీడియా అడగ్గా దానికి నాని ఇచ్చిన ఆన్సర్ మరింత ఆసక్తిని పెంచింది. ఆ పదం సినిమా కోర్ ఎమోషన్‌తో ముడిపడి ఉందని, చాలా కీలకమైన సన్నివేశంలో మాత్రమే అది వస్తుందని నాని చెప్పాడు. అయితే ఆ సీన్ ఏంటి? ఆ పదానికి కథతో ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలను మాత్రం నాని చెప్పకుండా, అవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని చెప్పారు.
ఇక్కడే ది ప్యారడైజ్ ప్రమోషన్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటపడుతోంది. రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్నా మేకర్స్ సినిమా కథను పూర్తిగా చెప్పడం లేదు. కనీసం ట్రైలర్ చూసి అయినా ఓ అంచనాకు వద్దామనుకుంటే ట్రైలర్ లేకుండానే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నాని ఇంటర్వ్యూల్లో తన పాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు చెబుతున్నప్పటికీ, కథలోని కీలకమైన ట్విస్టులు, ఎమోషన్స్ వెనుక ఉన్న కారణాలను మాత్రం దాచిపెడుతున్నారు. సాధారణంగా భారీ సినిమా రిలీజ్ కు ముందు ఎక్కువ కంటెంట్‌ను చూపించి హైప్ పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ ది ప్యారడైజ్ విషయంలో మాత్రం మిస్టరీని కంటిన్యూ చేస్తూ క్యూరియాసిటీని పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది.
మరోవైపు శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేసిన వరల్డ్ కూడా ఈ ఇంట్రెస్ట్‌కి మెయిన్ రీజన్‌గా మారుతోంది. రఫ్ లుక్, నాని జడలు, క్యారెక్టర్ల బాడీ లాంగ్వేజ్, డైలాగ్ టోన్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ కలిసి ఒక స్పెషల్ రా వరల్డ్‌ను పరిచయం చేస్తున్నాయి. దీంతో అందరూ అనుకున్నట్టు ది ప్యారడైజ్ కేవలం యాక్షన్ డ్రామానే కాదని దాని వెనుక స్ట్రాంగ్ ఎమోషనల్ స్టోరీ ఉందని భావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వైరలైన ఆ ఒక్క పదాన్ని కేవలం వివాదాస్పద డైలాగ్‌గా చూడాల్సిన అవసరం లేదనే డిస్కషన్ మొదలైంది. మరి ఆ పదం వెనుక దాగిన కథేంటో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 24 వరకు ఆగాల్సిందే.
