Begin typing your search above and press return to search.

ఆ హీరోల రిస్కులు.. నాని ఇప్పుడు పెద్ద జంప్ కొడతాడా?

ఒకప్పుడు హీరో మార్కెట్‌కు ఒక లెక్క ఉండేది. ఇంత ఓపెనింగ్ వస్తుంది, ఇంత బిజినెస్ చేయొచ్చు అంటూ ముందే రేంజ్ ఫిక్స్ చేసేవాళ్లు.

By:  M Prashanth   |   9 Sept 2026 9:36 AM IST
ఆ హీరోల రిస్కులు.. నాని ఇప్పుడు పెద్ద జంప్ కొడతాడా?
X

ఒకప్పుడు హీరో మార్కెట్‌కు ఒక లెక్క ఉండేది. ఇంత ఓపెనింగ్ వస్తుంది, ఇంత బిజినెస్ చేయొచ్చు అంటూ ముందే రేంజ్ ఫిక్స్ చేసేవాళ్లు. ఇప్పుడు మంచి కంటెంట్ పడితే ఆ లెక్కలు ఒక్క సినిమాతో మారిపోతున్నాయి. హనుమాన్ ముందు తేజ సజ్జకు ఉన్న మార్కెట్ వేరు. ఆ సినిమా తర్వాత వచ్చిన రేంజ్ వేరు. నిఖిల్‌కు కార్తికేయ 2 కూడా అలాంటి జంప్ ఇచ్చింది. ఇప్పుడు నాని ముందు కూడా అలాంటి అవకాశం ది ప్యారడైజ్ రూపంలో ఉంది.

నాని ఇప్పటికే తెలుగు మార్కెట్‌లో 100 కోట్లు చూసిన హీరో. దసరాతో ఆ క్లబ్‌లోకి వెళ్లాడు. హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3తో తన బిజినెస్‌ను పెంచుకుంటూ వచ్చాడు. కానీ నాని సినిమాకు తెలుగు రాష్ట్రాల బయట కూడా అదే స్థాయిలో ఓపెనింగ్ వచ్చే పరిస్థితి ఇంకా పూర్తిగా రాలేదు. ది ప్యారడైజ్ అక్కడే కొత్త లెక్క మొదలుపెట్టాలి.

ఇదే రేంజ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ పట్టుకోవాలని గతంలో కొందరు ప్రయత్నించారు. విజయ్ దేవరకొండ లైగర్‌తో నేరుగా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు. సినిమా వర్కౌట్ కాకపోవడంతో అనుకున్న జంప్ రాలేదు. రామ్ కూడా స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి పెద్ద యాక్షన్ సినిమాలతో తన మార్కెట్ పెంచుకోవాలని చూశాడు. కానీ తెలుగు బయట స్థిరమైన మార్కెట్ మాత్రం ఏర్పడలేదు.

తేజ సజ్జ, నిఖిల్ దగ్గర జరిగిన విషయం మాత్రం వేరు. హీరో పేరుతో ముందు నుంచి భారీ మార్కెట్ లేకపోయినా హనుమాన్, కార్తికేయ 2 కథలే వాళ్లను కొత్త ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా హిందీలో మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ రాకపోయినా మౌత్ టాక్ తో షోలు పెరిగాయి. ఇప్పుడు పాన్ ఇండియా అంటే హీరో ముందే అక్కడ స్టార్ అయి ఉండాల్సిన అవసరం లేదని ఈ సినిమాలు చెప్పాయి.

ది ప్యారడైజ్ కూడా నాని రెగ్యులర్ సినిమాల కంటే చాలా పెద్ద స్కేల్‌లో తయారవుతోంది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ చేస్తున్న సినిమా కావడం, నాని లుక్ నుంచి కథ ప్రపంచం వరకు పూర్తిగా కొత్తగా ఉండటం ఇప్పటికే కనిపిస్తోంది. సెప్టెంబర్ 24న సినిమాను పెద్ద స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. నాని కోసం తెలుగు ప్రేక్షకులు వస్తారు. కానీ ఈసారి అసలు ఛాలెంజ్ తెలుగు బయటే ఉంటుంది.

దసరా కూడా హిందీలో విడుదలైంది. కానీ నానికి అక్కడ ప్రత్యేకమైన థియేట్రికల్ మార్కెట్‌ను తయారు చేసే స్థాయికి వెళ్లలేదు. ది ప్యారడైజ్ అక్కడ బ్రేక్ అయితే మాత్రం తర్వాత నాని సినిమాల బిజినెస్ లెక్కే మారుతుంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జకు, కార్తికేయ 2 తర్వాత నిఖిల్‌కు వచ్చిన మార్పు ఇప్పుడు నానికి చాలా పెద్ద స్కేల్‌లో రావచ్చా అన్నదే ఈ సినిమాతో ఉన్న అసలు లెక్క. చూడాలి మరి ఏమవుతుందో.