ది ప్యారడైజ్.. ఆయుధం లేకుండానే..
సెప్టెంబర్ 24కు ప్యారడైజ్ థియేటర్లలోకి రావాల్సి ఉంది. రిలీజ్‌కు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. షూటింగ్ పూర్తైందనే వార్తలు వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
By: M Prashanth | 11 Sept 2026 8:00 PM ISTసెప్టెంబర్ 24కు ప్యారడైజ్ థియేటర్లలోకి రావాల్సి ఉంది. రిలీజ్‌కు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. షూటింగ్ పూర్తైందనే వార్తలు వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో పెద్ద సినిమాలు సాధారణంగా ప్రమోషన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. కానీ ప్యారడైజ్ టీమ్ మాత్రం అందరూ ఎదురుచూసే ఒక ముఖ్యమైన ప్రమోషనల్ ఆయుధాన్నే ఈసారి పక్కన పెట్టింది. రిలీజ్ డేట్ మార్చే ఆలోచన కూడా లేదని టీమ్ చెప్పింది.
సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్వయంగా చెప్పేశారు. ప్రెస్ మీట్‌లో ఈ విషయం అడగగానే, ఆ వార్త బయట నుంచి రాలేదని తమ దగ్గరి నుంచే లీక్ అయిందని సరదాగా అన్నారు. ట్రైలర్ కట్ చేయాలని తమకూ ఉందని, కానీ దానికి కనీసం నాలుగు రోజులు పూర్తిగా కేటాయించాల్సి వస్తుందని చెప్పారు. ఆ నాలుగు రోజులు ఇప్పుడు సినిమాకే అవసరమని టీమ్ నిర్ణయించిందట.
ఇది సినిమాపై ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తీసుకున్న నిర్ణయం కాదని నాని ప్రత్యేకంగా చెప్పారు. మంచి ట్రైలర్ చేయాలంటే శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్, ఎడిటింగ్ టీమ్, వీఎఫ్ఎక్స్ వాళ్లు అందరూ దానిపైనే కూర్చోవాలి. ఫైనల్ కట్ పనులు నడుస్తున్న సమయంలో ఆ నాలుగు రోజులు కూడా విడిగా పెట్టడం కష్టమైందని ఆయన వివరించారు. అందుకే ప్రమోషన్ కంటే ప్రస్తుతం సినిమా పూర్తి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు.
ఇప్పటికే ప్యారడైజ్ నుంచి టీజర్, పాటలు, పోస్టర్లు బయటకు వచ్చాయి. ఆయా షేర్, యేషా నాగులా పాటలు కూడా బాగా క్లిక్ అయ్యాయి. నాని లుక్, సినిమా వరల్డ్ గురించి ప్రేక్షకులకు ఒక ఐడియా వచ్చింది. కానీ కథను ఒకే వీడియోలో సెట్ చేసే అవకాశం ఇప్పుడు ఉండదు. సవారీ జాతి, తల్లి కొడుకు ఎమోషన్, తిరుగుబాటు నేపథ్యం లాంటి పాయింట్లు ఇప్పటివరకు విడివిడిగానే బయటకు వచ్చాయి. అందుకే సినిమా పూర్తి కథపై క్యూరియాసిటీ ఇంకా అలాగే ఉంది.
ఇక్కడ పాన్ ఇండియా రిలీజ్ కూడా గుర్తుంచుకోవాలి. తెలుగు ప్రేక్షకులకు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మీద ఇప్పటికే మంచి పరిచయం ఉంది. కానీ హిందీ, తమిళం, మలయాళం మార్కెట్లలో చివరి వారంలో కథను త్వరగా అమ్మేది ఎక్కువగా ట్రైలరే. ఇప్పుడు అక్కడ టీజర్, పాటలు, ఇంటర్వ్యూలు, క్యారెక్టర్ వీడియోల మీదే ఎక్కువ పని పడుతుంది. రిలీజ్‌కు ముందు టీమ్ ఇంకో కొత్త ప్రమోషనల్ కట్ తీసుకొస్తుందా అన్నది చూడాలి. నార్త్ మార్కెట్‌లో ఇది పరీక్షే.
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఈ నిర్ణయానికి అసలు ఛాలెంజ్ వస్తుంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఎంతవరకు ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకెళ్తుందో తెలుస్తుంది. నాలుగు రోజులు ట్రైలర్ కోసం ఖర్చు చేయకుండా సినిమాకే ఇచ్చిన టీమ్, చివరి వారం హైప్‌ను ఏ కంటెంట్‌తో పెంచుతుందో ఇప్పుడు చూడాలి.
