ప్యారడైజ్‌లో నాని పోరాటం విలన్‌తో కాదా...
ప్యారడైజ్ టీజర్ చూసినప్పుడు నాని చేతిలో ఆయుధం, చుట్టూ రక్తం, ఎదురుగా శత్రువులు కనిపించారు. దీంతో సినిమా మొత్తం హీరో వర్సెస్ విలన్ పోరాటంలా ఉంటుందేమో అనిపించింది.
By: M Prashanth | 11 Sept 2026 8:00 PM ISTప్యారడైజ్ టీజర్ చూసినప్పుడు నాని చేతిలో ఆయుధం, చుట్టూ రక్తం, ఎదురుగా శత్రువులు కనిపించారు. దీంతో సినిమా మొత్తం హీరో వర్సెస్ విలన్ పోరాటంలా ఉంటుందేమో అనిపించింది. కానీ శ్రీకాంత్ ఓదెల లేటెస్ట్ గా చెప్పిన విషయాలు చూస్తే అసలు కథ మరో వైపు వెళ్లబోతోంది అనిపిస్తోంది. నాని క్యారెక్టర్ ఒక వ్యక్తిని ఓడించడం కోసం కాదు, ఒక జాతికి గుర్తింపు తెచ్చే పోరాటంలో నిలబడేలా కనిపిస్తోంది.
దర్శకుడు చెప్పిన దాని ప్రకారం ఇది అణగదొక్కబడిన ఒక సవారీ జాతి కథ. దేశం కోసం ప్రాణాలు పెట్టి పోరాడిన వాళ్లకే అదే దేశంలో గుర్తింపు లేకపోతే ఎలా ఉంటుందన్న పాయింట్ చుట్టూ కథ నడుస్తుందని ఆయన చెప్పారు. అంటే సినిమాలో నానికి ఎదురుగా ఒక విలన్ ఉన్నా, అతని అసలు సమస్య మాత్రం వాళ్లను అంగీకరించని వ్యవస్థతోనే ఉండొచ్చు. ఈ పాయింట్ వల్ల యాక్షన్‌కు కూడా వేరే కారణం దొరుకుతోంది. వాళ్లకు హక్కులు, గౌరవం దక్కకపోవడం కథలో పెద్ద సమస్య అయ్యేలా కూడా ఉంది.
ఇప్పటివరకు ప్యారడైజ్ ప్రమోషన్స్‌లో నాని లుక్, రఫ్ వరల్డ్, భారీ యాక్షన్ ఎక్కువగా కనిపించాయి. కానీ కథ మధ్యలో ఒక తల్లి, కొడుకు ఎమోషన్ కూడా ఉందని శ్రీకాంత్ చెప్పాడు. ఒక జాతి సమస్యను పెద్ద పెద్ద మాటలతో కాకుండా, ఆ కుటుంబం ఎదుర్కొనే పరిస్థితుల ద్వారా చూపిస్తే నాని పోరాటానికి పర్సనల్ కనెక్షన్ కూడా వస్తుంది. సినిమా ఎమోషన్ అక్కడి నుంచే నడిచే అవకాశం ఉంది.
శ్రీకాంత్ ఈ కథను చెప్పడానికి కాళోజీ నారాయణరావు లైన్‌ను కూడా ప్రస్తావించాడు. పుట్టుక మనది, చావు మనది, బతుకంత దేశానిది అన్న మాట తన సినిమాకు సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. ఆ లైన్ తీసుకుంటే ప్యారడైజ్‌లో దేశభక్తిని రెగ్యులర్ జెండా, ప్రసంగాల రూపంలో కాకుండా గుర్తింపు కోసం చేసే పోరాటంగా చూపించే ఛాన్స్ కనిపిస్తోంది. తమది కూడా ఈ దేశమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ల కథ కావచ్చు.
నాని క్యారెక్టర్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్‌లో ఒక తిరుగుబాటు నాయకుడిలా కనిపిస్తున్నాడు. కానీ అతడు ఎందుకు అంత హింసాత్మకంగా మారాడు, అతని వెనుక అంతమంది ఎందుకు నిలబడ్డారు అన్నది టీమ్ ఇంకా పూర్తిగా బయటపెట్టలేదు. ఇప్పుడు సవారీ జాతి పాయింట్ బయటకు రావడంతో ఆ ప్రశ్నలకు ఒక దారి దొరికింది. తనకోసం కాకుండా వాళ్ల కోసం పోరాడే వ్యక్తిగా నానిని చూపిస్తే పాత్రకు మరో లెవెల్ వస్తుంది.
ప్యారడైజ్ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. ఇప్పటివరకు కథను పూర్తిగా చెప్పకుండా ఒక్కో పాయింట్ మాత్రమే బయటకు వదులుతున్నారు. నాని లుక్ తర్వాత పాటలు వచ్చాయి, ఇప్పుడు దర్శకుడు కథలోని జాతి, తల్లి కొడుకు ఎమోషన్ గురించి మాట్లాడాడు. ఇక ట్రైలర్‌లో విలన్ ఎవరు అన్నదానికంటే, ఈ జనాలకు అసలు ఏం జరిగింది, నాని వాళ్ల మధ్యకి ఎలా వచ్చాడు అనే భాగాన్ని ఎంతవరకు చూపిస్తారన్నదే ఆసక్తిగా ఉంటుంది.
