మగధీర గుర్రం.. ది ప్యారడైజ్ కుక్క
అయితే ఆ ప్రయాణాన్ని, ఆ బాండింగ్ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా చూపించడం వల్లే ట్రాన్స్ లేషన్ లో ఆ ఫీల్ మిస్సయిందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
By: M Prashanth | 28 Sept 2026 1:59 PM IST'ది ప్యారడైజ్' థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వస్తున్నా, సోషల్ మీడియాలో కొన్ని సీన్లపై మీమ్స్, ట్రోల్స్ గట్టిగానే పేలాయి. ముఖ్యంగా సినిమాలో ఒక కుక్క దేవతకు దండం పెట్టుకోవడం, హీరోను కాపాడే ప్రయత్నం చేయడం లాంటి విజువల్స్ పై నెటిజన్లు లాజిక్స్ వెతుకుతూ ఆడేసుకున్నారు. ఇక రిలీజ్ తర్వాతి ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ చాలా ఓపెన్ గా మాట్లాడారు.
తన ఆలోచనలో ఆ సీన్ తప్పు కాదని, కానీ ఆ ఎమోషన్ ను తెరపై సరిగ్గా కన్వే చేయడంలో తాను విఫలమయ్యానని శ్రీకాంత్ నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. నిజానికి కథ ప్రకారం హీరోను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆ కుక్క జీప్ వెనకాలే పరుగెడుతుంది. హీరో జైలు గోడకు అటువైపు ఉంటే, కుక్క ఇటువైపు ఉండిపోతుంది. వాడు ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురుచూస్తూ హీరోతో పాటే అది కూడా పెరుగుతుందనేది అసలు ప్లాన్.
అయితే ఆ ప్రయాణాన్ని, ఆ బాండింగ్ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా చూపించడం వల్లే ట్రాన్స్ లేషన్ లో ఆ ఫీల్ మిస్సయిందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ డీటెయిలింగ్ అంతా ఆడియన్స్ కు అర్థమయ్యేలా కట్ చేసి ఉంటే, కుక్క చేసిన పని ఒక మిరాకిల్ లా కాకుండా సహజమైన ప్రేమలా అనిపించేదని చెప్పారు. పేపర్ మీద ఉన్న డెప్త్ స్క్రీన్ మీదకు వచ్చేసరికి మిస్ అవ్వడం వల్లే ఇలాంటి కామెంట్స్ వచ్చాయన్నారు.
ఇదే సమయంలో రాజమౌళి తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'మగధీర' సినిమాను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. మగధీరలో హీరో.. బాద్షా అనగానే గుర్రం తాడును ఎగరేసే మూమెంట్ చూసి థియేటర్లలో తాను పిచ్చెక్కిపోయానని గుర్తు చేసుకున్నారు. హీరో నాని కూడా దీనిపై రియాక్ట్ అవుతూ, సినిమాను మరీ లాజికల్ కళ్లద్దాలతో చూస్తే భావోద్వేగాలు కనెక్ట్ కావని సమర్థించారు.
అయితే ఆడియన్స్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను ఏమాత్రం తప్పుపట్టకుండా, ఎక్కడ లోపం జరిగిందో దర్శకుడే స్వయంగా బయటపెట్టడం మాత్రం విశేషం. హిట్ ట్రాక్ లో ఉన్న నాని, శ్రీకాంత్ కాంబో ఇలాంటి చిన్న చిన్న లోపాలను కూడా ఓపెన్ గా డిస్కస్ చేసుకోవడం మంచి విషయమే. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, ఆడియన్స్ లేవనెత్తిన ప్రశ్నలకు గౌరవం ఇస్తూ సమాధానం చెప్పిన విధానం బాగుంది. చూస్తుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వీరు మరింత జాగ్రత్త పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
