Begin typing your search above and press return to search.

సుమ‌ల‌త మాస్టార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. మెగా ప‌రిష్కారం సాధ్య‌మేనా?

ఈ క్రమంలోనే ఫెడరేషన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 24 క్రాఫ్ట్స్ సూపర్ బాడీ (TFIEF) జానీ మాస్టర్‌పై 'సహాయ నిరాకరణ' నిర్ణయాన్ని ప్రకటించింది.

By:  Sivaji Kontham   |   1 Sept 2026 12:27 PM IST
సుమ‌ల‌త మాస్టార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. మెగా ప‌రిష్కారం సాధ్య‌మేనా?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) నిబంధనలు, యూనియన్ కార్డ్ లేని నాన్-మెంబర్లతో షూటింగ్‌లు నిర్వహించడం.. అంతర్గత వర్గపోరు టాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యంగా హీరో నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంలోని ఒక పాట చిత్రీకరణలో యూనియన్ కార్డ్ లేనివారిని అధిక సంఖ్యలో ఉపయోగించారనే పాయింట్‌పై అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ సుమలత చేసిన ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత రాజేసాయి. యూనియన్ నిబంధనలను పక్కనపెట్టి ఇతర ప్రాంతాల నుండి డ్యాన్సర్లను తీసుకురావడం స్థానిక సభ్యుల ఉపాధిని దెబ్బతీస్తోందని డ్యాన్సర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదానికి ప్రధాన మూలకారణం 'ది ప్యారడైజ్' పాట షూటింగ్ సమయంలో బయటపడిన అక్రమాలేనని సుమలత స్పష్టం చేశారు. సుమారు 300 మంది డ్యాన్సర్లు కావలసిన ఆ పాట కోసం తమ యూనియన్ నుంచి కేవలం 100 మంది అధికారిక సభ్యులను మాత్రమే పంపి మిగతా 200 మందిని అసోసియేషన్ కార్డులు లేని నాన్-మెంబర్లతో భర్తీ చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని నిర్మాతలు లేదా మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లకుండా యూనియన్ ఇన్ఛార్జ్‌లే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని.. నిర్మాతలు చెల్లించే రెమ్యునరేషన్ నాన్-మెంబర్లకు సరిగ్గా అందుతుందో లేదో పారదర్శకత లేకపోవడం ఇన్ఛార్జ్‌ల పెద్ద తప్పిదమని ఎండగట్టే ప్ర‌య‌త్నం చేసారు.

ఈ క్రమంలోనే అసోసియేషన్‌లో అంతర్గత వర్గపోరు సైతం భగ్గుమంది. జానీ మాస్టర్ సతీమణి సుమలత వర్గానికి, శేఖర్ మాస్టర్ - రఘు మాస్టర్ నేతృత్వంలోని మరో వర్గానికి మధ్య ఎన్నికలు, ఆర్థిక అవకతవకలపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఫెడరేషన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 24 క్రాఫ్ట్స్ సూపర్ బాడీ (TFIEF) జానీ మాస్టర్‌పై 'సహాయ నిరాకరణ' నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిఫలితంగానే ఆయన 'ది ప్యారడైజ్' పాట షూటింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు తమపై విధించిన సహాయ నిరాకరణ నిర్ణయాన్ని సుమలత తీవ్రంగా ప్రశ్నించారు. తాము జరుగుతున్న అక్రమాలను బయటపెట్టి ప్రశ్నిస్తున్నందుకే ఫెడరేషన్ తమ అసోసియేషన్‌పై ఏకపక్షంగా నాన్-కోఆపరేషన్ విధించిందా అని నిలదీశారు. ఈ సమస్య పరిష్కారం కోసం టాలీవుడ్ పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారిని సంప్రదించామని.. మొదట స్పందించి పిలిచి మాట్లాడింది ఆయనేనని తెలిపారు. తప్పు చేసిన వారికే కాదు, దాన్ని ప్రోత్సహించిన వారికి కూడా శిక్ష పడాలి! అని చిరంజీవి గారు స్పష్టం చేశారని పేర్కొన్న సుమలత, బాలకృష్ణ గారి ప్రమేయంపై వస్తున్న పుకార్లలో నిజం లేదని తేల్చిచెప్పారు.

పరిశ్రమలోని పెద్దలు.. ఫెడరేషన్ బాధ్యులు సమస్య ఎక్కడ ఉందో సరిగ్గా తెలుసుకుని న్యాయం చేయాలని, తాము ఫెడరేషన్‌తో కలిసి పనిచేయడానికే మొగ్గు చూపుతున్నామని సుమలత విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో మెజారిటీ డ్యాన్సర్లు, ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఏకమై రఘు మాస్టర్‌ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించగా ఫెడరేషన్ కూడా ఆ కమిటీకే మద్దతు తెలిపింది. ఈ నూతన కమిటీ రాకతోనైనా నాన్-మెంబర్ల షూటింగ్‌లు, ఏకపక్ష నిర్ణయాల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందో లేదోన‌న్న చర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం కొరియోగ్రాఫ‌ర్ సుమ‌ల‌త ఆరోప‌ణ‌ల‌పైనా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి సినీపెద్ద‌లు ఏం ఆలోచిస్తారో వేచి చూడాలి.