ది ప్యారడైజ్.. తేల్చుకునే టైమొచ్చింది
ఇలా రకరకాల రియాక్షన్స్ మధ్యనే ది ప్యారడైజ్ తన తొలి వీకెండ్‌ను పూర్తి చేసుకుంది. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం టీమ్ సంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక సోమవారం నుంచి సినిమా అసలు బలం బయటపడే టైమ్ వచ్చింది.
By: M Prashanth | 28 Sept 2026 11:17 AM ISTఒక వర్గం ఫస్ట్ హాఫ్ బాగుందని, మరో వర్గం సెకండ్ హాఫ్ దారుణంగా ఉందని చెబుతోంది. హీరో రోల్ బాగుందని కొందరు అంటుంటే, స్క్రీన్‌ప్లే అర్థం కాలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా రకరకాల రియాక్షన్స్ మధ్యనే ది ప్యారడైజ్ తన తొలి వీకెండ్‌ను పూర్తి చేసుకుంది. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం టీమ్ సంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక సోమవారం నుంచి సినిమా అసలు బలం బయటపడే టైమ్ వచ్చింది.
వీకెండ్‌లో పరిస్థితి కొంచెం వేరు. కొత్త సినిమా, పెద్ద హీరో, హైప్ ఉంటే టాక్ పూర్తిగా క్లియర్ కాకపోయినా థియేటర్‌కు వెళ్లే వాళ్లు ఉంటారు. శని, ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా బయటకు వస్తారు. అందుకే మొదటి నాలుగు రోజుల నంబర్లు సినిమాకు బలమైన స్టార్ట్ ఇచ్చినా, అదే స్పీడ్ వీక్‌డేస్‌లో కొనసాగుతుందా అన్నదే ఇప్పుడు అసలైన విషయం.
ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా వంద కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. థియేట్రికల్ బిజినెస్‌లో దాదాపు సగానికి పైగా వరకు రికవరీ అయినట్లు కూడా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా ఇంకా పూర్తిగా సేఫ్ జోన్‌లోకి వెళ్లలేదు. మిగిలిన భాగం రావాలంటే సోమవారం నుంచి వచ్చే షేర్ చాలా అవసరం.
ఇక్కడే పబ్లిక్ టాక్ చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే పుష్, మీమ్స్, క్లిప్స్ ఒక స్థాయి వరకు బజ్ నిలబెడతాయి. కానీ సోమవారం టికెట్ కొనేవాడు హడావుడి కోసం వెళ్లడు. సినిమా చూడాలనిపిస్తేనే వెళ్తాడు. అందుకే మిక్స్డ్ టాక్ మధ్య నిజంగా ఎంతమంది ప్రేక్షకులను థియేటర్‌కు లాగగలిగిందో ఇప్పుడు షో వారీగా తెలుస్తుంది.
హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లు ఇప్పటికే తమ వంతు సపోర్ట్ ఇచ్చాయి. కానీ పెద్ద థియేట్రికల్ బిజినెస్ ఉన్న ఏపీ, తెలంగాణలో వీక్‌డే హోల్డ్ బలంగా ఉండటం మాత్రం మరింత అవసరం. అక్కడ వచ్చే డ్రాప్ మొత్తం రికవరీ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్యారడైజ్‌కు ఇప్పుడు పోస్టర్లు, హ్యాష్‌ట్యాగ్స్ కంటే సోమవారం కలెక్షన్స్ ముఖ్యం. మొదటి రోజు హైప్ పని చేసింది, వీకెండ్ పండగలా వెళ్లిపోయింది. ఇక రెగ్యులర్ వర్కింగ్ డేస్‌లో ప్రేక్షకుడు స్వచ్ఛందంగా టికెట్ తీసుకుంటాడా అన్నదే చూడాలి.
