Begin typing your search above and press return to search.

ది ఒడిస్సీ (X) రామాయ‌ణం: నోలాన్ తెచ్చే ఆ స‌హ‌జ‌త్వం నితీష్ తివారీ తేలేరా?

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ ఏ కథను ఎంచుకున్నా దానిని ప్రేక్షకులకు అత్యంత సహజంగా, రియలిస్టిక్‌గా చూపించడంలో సిద్ధహస్తుడు.

By:  Sivaji Kontham   |   31 July 2026 11:37 PM IST
ది ఒడిస్సీ (X) రామాయ‌ణం: నోలాన్ తెచ్చే ఆ స‌హ‌జ‌త్వం నితీష్ తివారీ తేలేరా?
X

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ ఏ కథను ఎంచుకున్నా దానిని ప్రేక్షకులకు అత్యంత సహజంగా, రియలిస్టిక్‌గా చూపించడంలో సిద్ధహస్తుడు. ఇటీవ‌ల అత‌డు తెర‌కెక్కించిన సినిమాల‌ను సామాన్యుడికి కూడా అర్థ‌మ‌య్యేలా రూపొందించారు. ఆయన తెరకెక్కించిన గ్రీకు పురాణ కథ `ది ఒడిస్సీ` చిత్రంలో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో వచ్చే మాన్‌స్ట‌ర్స్, ఒంటికన్ను రాక్షసుడు (సైక్లోప్స్), మంత్రగత్తెలు లేదా సముద్ర భూతాలను ఎక్కడా కృత్రిమంగా లేదా అసహజంగా చూపించకుండా ఎక్క‌డా క‌న్ఫ్యూజ‌న్ అన్న‌దే లేకుండా, గ్రీకు పురాణ నేపథ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఒక చంద‌మామ క‌థ‌లా విజువల్స్‌తో కళ్లకు కట్టారు. ముఖ్యంగా ఐమ్యాక్స్ కెమెరాల మాయాజాలంతో ఆ ఒంటికన్ను రాక్షసుడి రూపాన్ని `ఇది నిజమేనేమో` అనేంత సహజత్వంతో తెరకెక్కించి సినీ ప్రియులను మెప్పించారు.

నోలాన్ మేకింగ్ శైలి ఎప్పుడూ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకు ఒక రాక్షసుడిని లేదా మాన్‌స్ట‌ర్‌ను తెరపై చూపించాలనుకుంటే నోలాన్ ముందుగా ఒక నటుడికి అత్యంత పర్ఫెక్ట్ మేకప్ వేసి, తన కెమెరా యాంగిల్స్ .. లైటింగ్ మాయాజాలంతో ఆ నటుడినే అత్యంత సహజమైన రాక్షసుడిగా మార్చేస్తారు. సీజీఐ లేదా యానిమేషన్ల కంటే ప్రత్యక్ష చిత్రీకరణకే ఆయన మొగ్గు చూపడం వల్ల ఆయా పాత్రలు వెండితెరపై అత్యంత రియలిస్టిక్‌గా, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా నిలుస్తాయి.

అయితే, మరోవైపు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం `రామాయణం` ప్రచార చిత్రాలు (ట్రైలర్ గ్లింప్స్) విడుదలయ్యాక రాక్షసుల రూపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూవీలో చూపించిన రాక్షసులు, బీస్ట్ రూపాలు అత్యంత అసహజంగా, నాటకీయంగా ఉన్నాయనే అభిప్రాయాలు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దర్శకుడు కథలోని సహజత్వాన్ని పక్కనబెట్టి అతిగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌లపై ఆధారపడడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

నోలాన్ అనుసరించే ప్రాక్టికల్ ప్రాసెస్ కాకుండా.. నితీష్ తివారీ `రామాయణం` చిత్రంలో పూర్తి స్థాయిలో యానిమేషన్లు, సిజిఐ ఎఫెక్ట్స్ పైనే భారం వేశారని విమర్శలు వస్తున్నాయి. పురాణాల్లోని భయంకరమైన రాక్షస పాత్రలను విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడంతో లైవ్‌లీనెస్ తగ్గడం వల్ల ఆ పాత్రలు కార్టూనిష్‌గా లేదా వీడియో గేమ్‌లోని క్యారెక్టర్లలా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది సినిమాలోని అనుభూతికి కొంత మైనస్‌గా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

ఏది ఏమైనా.. పౌరాణిక - జానపద చిత్రాలను తెరకెక్కించేటప్పుడు అతిగా వీఎఫ్ఎక్స్‌పై ఆధారపడటం కంటే ప్రాక్టికల్ మేకప్, లైవ్ లొకేషన్లు.. కెమెరా టెక్నిక్స్ ఉపయోగించడం ఎంత ప్రయోజనకరమో క్రిస్టోఫర్ నోలాన్ ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. `రామాయణం` లాంటి భారతీయ ఇతిహాసాలను వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు గ్రాఫిక్స్ హడావుడి కంటే పాత్రలలో సహజత్వం, ఆత్మ ఉండేలా చూసుకోవడమే ప్రేక్షకులను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. కోతుల‌(వాన‌రాల‌ను)ను సీజీఐ మాయ‌లో ప‌డి.. ఏకంగా రూపాలు మార్చేసి చింపాంజీలుగా చూపించిన `ఆదిపురుష్` ద‌ర్శ‌కుడు ఓంరౌత్ నుంచి చాలా పాఠాల‌ను నేర్చుకుని ఇప్పుడు నితీష్ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కులు కూడా రియ‌లైజ్ అవ్వాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని కూడా క్రిటిక్స్ సూచిస్తున్నారు.