Begin typing your search above and press return to search.

ఒడిస్సీ : చారిత్రక వాస్తవమా లేక కల్పిత కావ్యమా?

`ది ఒడిస్సీ` అనేది పూర్తిగా చారిత్రక వాస్తవం కాదు. ఇది ప్రాచీన గ్రీకు కవి హోమర్ సృష్టించిన అద్భుతమైన ఇతిహాస కావ్యం.

By:  Srikanth Kontham   |   18 July 2026 7:48 PM IST
ఒడిస్సీ : చారిత్రక వాస్తవమా లేక కల్పిత కావ్యమా?
X

`ది ఒడిస్సీ` అనేది పూర్తిగా చారిత్రక వాస్తవం కాదు. ఇది ప్రాచీన గ్రీకు కవి హోమర్ సృష్టించిన అద్భుతమైన ఇతిహాస కావ్యం. ఇందులో దేవతలు, సైక్లోప్స్ , సైరెన్స్ వంటి అద్భుత శక్తులు, కల్పిత జీవులు కనిపిస్తాయి. అలాగ‌ని పూర్తిగా ఊహాజనితం మాత్రమే కాదు. ట్రోజన్ యుద్ధం, కాంస్య యుగపు గ్రీకు సంస్కృతి , నాటి యుద్ధ రీతులు వంటి చారిత్రక మూలాల నుండి ప్రేరణ పొంది కవి సృజనాత్మకతతో దీన్నీ ఓ కావ్యంగా మలిచారు. హోమర్ రచించిన 24 భాగాల ఇతిహాసాన్ని పూర్తి స్థాయిలో హాలీవుడ్ తెరపైకి తీసుకురావాలనేది దశాబ్దాలుగా ఉన్న సవాలు.

ఈ భారీ ప్రాజెక్టును క్రిస్టోఫర్ నోలన్ తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు. `ది ఇలియడ్` యుద్ధ ఘట్టాలను వివరిస్తే `ది ఒడిస్సీ` ట్రోజన్ యుద్ధం తర్వాత ఇథాకా రాజు ఒడిస్సియస్ పదేళ్లపాటు ఇంటికి చేరడానికి చేసిన కఠినమైన ప్రయాణాన్ని.. ఆ క్రమంలో ఎదురైన? సవాళ్లను ప్రధానంగా హైలైట్ చేస్తుంది. సినిమాటిక్ అనుభవాన్ని పరాకాష్టకు తీసుకెళ్లడమే లక్ష్యంగా చిత్రాన్ని తెరకెక్కించారన్న‌ది వాస్త‌వం. నిజానికి `ది ఒడిస్సీ` ఒకేసారి పుస్తకంగా వచ్చిన రచన కాదు. ఇది ప్రాచీన కాలంలో గ్రీకు బార్డ్స్ (కవులు) మౌఖిక సంప్రదాయం ద్వారా తరతరాలకు అందించిన కథ. ఎందరో? కళాకారుల వాక్చాతుర్యం ద్వారా ప్రజల మనసుల్లో నిలిచిన కథాంశం కాలక్రమేణా లిఖిత రూపంలోకి వచ్చింది.

నేడు నోలన్ వంటి దర్శకులు ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక సాంకేతికతతో వెండితెరపై ఆవిష్కరించడం ద్వారా ఈ ఇతిహాసానికి సరికొత్త జీవం పోసిన‌ట్లు అయింది. ఒడిస్సియస్ కథ కేవలం ప్రయాణం మాత్రమే కాదు. అది ఓటమి లేని సంకల్పానికి నిదర్శనం. పదేళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత ఇథాకా రాజ్యానికి చేరుకున్న ఒడిస్సియస్ తన భార్య పెనెలోప్ , కుమారుడు టెలిమాకస్ మద్దతుతో అధికారాన్ని తిరిగి దక్కించుకునే ఘట్టాలు సినిమాకు అత్యంత బలాన్ని ఇచ్చాయి. ఒక రాజు తన కుటుంబాన్ని, రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం నేటి ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా నోలన్ తీర్చిదిద్దారు.

పురాతన గ్రీకు సంస్కృతిని, వారి నమ్మకాలను ప్రతిబింబించడంలో `ది ఒడిస్సీ` కీలక పాత్ర పోషించింది. చారిత్రక ప్రదేశాల గుర్తింపు, ఆనాటి సామాజిక విలువలు , మానవ మనస్తత్వాల లోతును ఈ కావ్యం ప్రతిబింబిస్తుంది. సినిమా రూపంలోకి మారడం వల్ల వేల సంవత్సరాల నాటి కథాంశం నేటి ఆధునిక తరానికి కూడా గ్రీకు నాగరికతలోని గొప్పతనాన్ని, వారి జీవనశైలిని అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది క్లాసిక్ సాహిత్యం మాత్రమే కాదు. ఒక కమర్షియల్ హాలీవుడ్ చిత్రంగా కూడా `ది ఒడిస్సీ` అద్భుతమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటికే సినిమా విడుదలైన అన్ని చోట్లా గణనీయమైన వసూళ్లను సాధించి ప్రేక్షకులను అలరిస్తోంది. విజువల్ వండర్‌గా రూపొందిన చిత్రం సాహిత్యం , సినిమా కలయికలో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది.

చివ‌రిగా `ది ఒడిస్సీ`ని కల్పితమని కొట్టిపారేయలేం. అలాగని సంపూర్ణ చారిత్రక గ్రంథమని భావించలేం. ఇది వాస్తవానికి - ఊహకు మధ్య ఉన్న‌ అద్భుత వారధి. ట్రోజన్ యుద్ధం వంటి చారిత్రక సంఘటనల బలమైన పునాదులపై కవి సృజనాత్మకతను జోడించి అల్లిన అద్భుత కావ్యం ఇది. మానవ ప్రయాణం, కష్టాలు, సంకల్పం ఇంటిపై ఉన్న మక్కువ వంటి సార్వత్రిక భావోద్వేగాలను ప్రతిబింబించడం వల్ల కాలాతీతమైన ఇతిహాసంగా నిలిచిందనొచ్చు. అందువల్ల `ది ఒడిస్సీ` అనేది చరిత్ర నుండి పుట్టిన కల్పిత ప్రయాణం అని చెప్పడం సమంజసంగా ఉంటుందేమో.