వివాదం దేనికని చెప్పకుండా ముగించేసారా?
వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన `ది కేరళ స్టోరీ` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
By: Srikanth Kontham | 3 Jan 2026 7:00 AM ISTవాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన `ది కేరళ స్టోరీ` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను సాధించి మాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు వివాదం కూడా అంతే సంచలనమైంది. రాజకీయంగానూ ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. అధికార పక్షం సహా విపక్షం కూడా ఒకేతాటిపైకి వచ్చి సినిమా నిలిపివేయాలని డిమాడ్ చేసాయి . కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడా? అనే కథాంశంతో కేరళ స్టోరీ రూపొందించారు.
ఓ నలుగురు యువతులు మతం మారి, ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ సాగుతుంది. ఇదే వివాదానికి దారి తీసిన అంశం. ఆ నలుగురు యువతులు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. మతసామరస్యాన్ని దెబ్బ తీసేలా సినిమా ఉందంటూ రిలీజ్ ఆపాలంటూ అధికార , విపక్ష పార్టీలు మండిపడ్డాయి. సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘాటుగా స్పందించారు. కేరళను ప్రపంచం ముందు మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించేందుకు ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి రాజకీయాలు ఏవీ కేరళలో పనిచేయవని హెచ్చరించారు. విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిప డింది. రిలీజ్ లకు అనుమతులు ఇవ్వొద్దంటూ డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. తమిళనాడు- పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రిలీజ్ ను బ్యాన్ చేసాయి. చివరికి ఎలాగు సుప్రీంకోర్టు అనుమతితోనే రిలీజ్ అయింది. ఇంత వివాదాస్పదమైన సినిమాకు సీక్వెల్ ఎవరైనా తీస్తారా? కానీ సైలెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
`ది కేరళ స్టోరీ 2` టైటిల్ తో ఈ సినిమాను పట్టాలెక్కించినట్లు వినిపిస్తోంది. ఈ సీక్వెల్ లో భయంకరమైన చీకటి కోణాన్ని ప్రపంచానికి చూపించబోతున్నట్లు వినిపిస్తోంది. షూటింగ్ పనులను కఠినమైన భద్రతతో నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా పూర్తి చేసినట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. మిగతా పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 27న రిలీజ్ చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
