Begin typing your search above and press return to search.

విషమే ఆహారమైతే..? కాజల్ 'ది ఇండియా స్టోరీ' టీజర్

'స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' అనే ట్యాగ్‌ లైన్‌ తో వస్తున్న ఆ సినిమా వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే పురుగుమందులు, కెమికల్స్ వల్ల ఆహారంలో ఏర్పడుతున్న ప్రమాదాలకు సంబంధించిన కథతో తెరకెక్కుతోంది.

By:  M Prashanth   |   26 Jun 2026 4:14 PM IST
విషమే ఆహారమైతే..? కాజల్ ది ఇండియా స్టోరీ టీజర్
X

రోజూ తినే ఆహారమే స్లోగా ప్రాణాలకు ముప్పుగా మారితే? మనకు తెలియకుండానే విషపూరిత పదార్థాలు మన బాడీలోకి చేరి ఆరోగ్యాన్నే ప్రమాదంలోకి నెడితే..? ఇలాంటి ఆలోచింపజేసే అంశాన్నే మెయిన్ స్టోరీ లైన్ గా తీసుకుని రూపొందిన చిత్రం ది ఇండియా స్టోరీ. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే లీడ్ రోల్స్ నటించిన ఆ సినిమాపై తాజాగా విడుదలైన టీజర్‌ ఆసక్తి పెంచుతోంది.

'స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' అనే ట్యాగ్‌ లైన్‌ తో వస్తున్న ఆ సినిమా వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే పురుగుమందులు, కెమికల్స్ వల్ల ఆహారంలో ఏర్పడుతున్న ప్రమాదాలకు సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం వెనుక దాగి ఉన్న ఆరోగ్య ముప్పును సిల్వర్ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్‌ లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే పాత్రలను చాలా ఇంటెన్స్‌ గా చూపించారు. సమాజంలో చాలామందికి తెలియకుండా కొనసాగుతున్న ఒక సమస్యను వెలుగులోకి తీసుకురావడానికి వారు చేసే పోరాటం కథలో మెయిన్ గా కనిపిస్తోంది. అవినీతి, వ్యవస్థలోని లోపాలు, ప్రజల ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్‌ గా చెప్పే ప్రయత్నం దర్శకుడు చేసినట్లు టీజర్ చెబుతోంది.

సినిమాకు చేతన్ డీకే దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్‌ ప్లేతో పాటు నిర్మాణ బాధ్యతలను సాగర్ బి. షిండే నిర్వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఆ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నార్త్ తోపాటు సౌత్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు.

సినిమా ద్వారా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక సామాజిక సమస్యపై చర్చ ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని దర్శకుడు వెల్లడించారు. లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న సైలెంట్ హెల్త్ క్రైసిస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. శ్రేయాస్ తల్పడే కూడా ఆ అంశం ప్రతి కుటుంబానికీ సంబంధించినదేనని చెప్పారు.

మనం తినే ఆహారం, మన ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాజల్ అగర్వాల్ కూడా సినిమా ఫ్యూచర్ జెనరేషన్స్ ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనలను రిఫ్లైక్ చేస్తుందని పేర్కొన్నారు. మురళీ శర్మ, మనీష్ వాధ్వా, అతుల్ తివారీ, కమలేష్ సావంత్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఆ చిత్రానికి నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ అందించగా, మంగేష్ ధాక్డే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఇది కేవలం థ్రిల్లర్‌ గా కాకుండా సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ది ఇండియా స్టోరీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.