యూఎస్ బాక్సాఫీస్.. చిన్న సినిమాతో సాలిడ్ కలెక్షన్స్
ఓవర్సీస్ మార్కెట్ అంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాల హవానే ఎక్కువగా ఉంటుంది. మిలియన్ డాలర్ల క్లబ్ గురించి మాట్లాడుకుంటాం.
By: M Prashanth | 19 Nov 2025 7:16 PM ISTఓవర్సీస్ మార్కెట్ అంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాల హవానే ఎక్కువగా ఉంటుంది. మిలియన్ డాలర్ల క్లబ్ గురించి మాట్లాడుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏ అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు అక్కడ క్రియేట్ చేసే మ్యాజిక్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది. తాజాగా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిన్న సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఒక సర్ప్రైజింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా, సైలెంట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా 100,777 డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఒక చిన్న సినిమాకు, అందులోనూ పెద్దగా స్టార్ కాస్ట్ లేని సినిమాకు చాలా గొప్ప విషయం. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా ఓవర్సీస్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు, కేవలం 'మౌత్ టాక్' మాత్రమే ఆయుధంగా మారింది.
ఈ సక్సెస్ కి ప్రధాన కారణం దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఎంచుకున్న కథే అని చెప్పాలి. ఇందులో భారీ ట్విస్టులు, కమర్షియల్ హంగులు లేవు. ఒక చిన్న ఊరి ఫోటోగ్రాఫర్ రమేష్, ఒక మెమరీ కార్డు పోగొట్టుకుంటే జరిగే గందరగోళాన్ని చాలా సహజంగా, ఫన్నీగా చూపించారు. మన జీవితంలో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లా అనిపించే ఈ పాయింట్, విదేశాల్లో ఉన్న తెలుగు వారికి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ నేటివిటీ ఫీలింగ్ వారిని థియేటర్లకు రప్పించింది.
హీరోగా తిరువీర్ నటన ఈ సినిమాకు హైలెట్. అమాయకత్వం, గందరగోళం కలగలిపిన రమేష్ పాత్రలో ఆయన జీవించేశారు. ఇక శ్రావ్య, నరేంద్ర రవి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎక్కడా నటిస్తున్నట్లు కాకుండా, మన పక్కింటి వాళ్ళలా అనిపించడమే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సోషల్ మీడియాలో షేర్ అయిన చిన్న చిన్న క్లిప్స్, రియాక్షన్స్ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి.
భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజ్ ల గోలలో.. ఇలాంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయని 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' నిరూపించింది. ఓవర్సీస్ ఆడియన్స్ మంచి కంటెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పడానికి ఇదే లేటెస్ట్ ఉదాహరణ. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
