మీడియా మోసింది, ప్రేక్షకులు నిలబెట్టారు.. 'ప్రీ వెడ్డింగ్ షో' సక్సెస్ మీట్!
ఈ శుక్రవారం చిన్న సినిమాగా విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'.
By: M Prashanth | 8 Nov 2025 8:30 PM ISTఈ శుక్రవారం చిన్న సినిమాగా విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్ల నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరో తిరువీర్, నిర్మాత సందీప్ మాట్లాడిన మాటలు సినిమా వెనుక కష్టాన్ని, సినిమా విజయాన్ని తెలియజేశాయి.
నిర్మాత సందీప్ మాట్లాడుతూ, "మేం వేసిన ప్రీమియర్ షోలు అయ్యాక, మీడియా మిత్రులందరూ దాదాపు గంటసేపు ఉండి టీమ్‌ను అభినందించారు. కానీ, రిలీజ్ రోజు ఉదయం 4 గంటల వరకు బుకింగ్స్ లేవు. చాలా కంగారుపడ్డాం. కానీ సాయంత్రం 5 గంటల నుంచి సినిమా పికప్ అయింది. దీనికి కారణం పూర్తిగా మీడియానే. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను మనస్ఫూర్తిగా మోశారు. ఈరోజు వాళ్ల వల్లే సినిమా నిలబడింది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
"నేను ఈరోజు డబ్బులు గెలిచానో లేదో తెలీదు కానీ, అందరి హృదయాలను గెలుచుకున్నాను. మీడియా మిత్రులు ఎప్పుడూ నెగిటివ్‌గానే ఉంటారని చాలా మంది అంటారు, కానీ నేను చూశాను, మంచి సినిమా వస్తే వాళ్లే కచ్చితంగా మోస్తారు. నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు, అయినా నన్ను నిలబెట్టారు" అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టుల సంక్షేమ నిధికి తన వంతుగా కొంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించి అందరి మనసులూ గెలుచుకున్నారు. సినిమా హిట్ అయితే మళ్లీ సాయం చేస్తానని మాటిచ్చారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. "మా సినిమాకు పబ్లిసిటీ తక్కువ జరిగి ఉండొచ్చు, కానీ మీడియా, ప్రేక్షకులు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను 'మసూద' నుంచి గమనిస్తున్నాను, నా సినిమాలకు ఎప్పుడూ మౌత్ టాకే పెద్ద బలం. 'తిరువీర్ సినిమాలు బాగుంటాయి, చూడొచ్చు' అని ప్రేక్షకులే ఒకరికొకరు చెప్పుకుంటున్నారు" అని ఆనందం వ్యక్తం చేశారు.
"నిజానికి, ఇండస్ట్రీలో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఫస్ట్ డే టపాసులు కాల్చి, కేకులు కట్ చేస్తారు. కానీ మాకు నిన్న డౌట్ ఉండింది. ఏం జరుగుతుందోనని భయపడ్డాం. అందుకే మేం కేక్ కట్ చేయలేదు. కానీ, సాయంత్రానికి సినిమా పికప్ అయ్యాక అందరి ముఖాల్లో నవ్వు వచ్చింది" అని అన్నారు.
"నిన్నటి నుంచి థియేటర్ విజిట్స్ చేస్తున్నాం. ప్రేక్షకులు మాకు ఇచ్చిన ధైర్యంతో ఇకపై సినిమాను జనాల్లోకి మరింత బలంగా తీసుకెళ్తాం. సోషల్ మీడియాకు, ప్రేక్షకులకు, ముఖ్యంగా మమ్మల్ని నమ్మి ఎంకరేజ్ చేసిన మీడియాకు థాంక్స్" అంటూ తిరువీర్ తన ప్రసంగాన్ని ముగించారు.
