ట్రెండీ టాక్: 'ఫ్యామిలీమ్యాన్ 3' ఎందుకింత ఆలస్యం?
వెబ్ సిరీస్ లు చాలా మజాను అందిస్తాయని `ఫ్యామిలీమ్యాన్` ఫ్రాంఛైజీతో నిరూపణ అయింది.
By: Sivaji Kontham | 18 Sept 2025 11:26 AM ISTవెబ్ సిరీస్ లు చాలా మజాను అందిస్తాయని 'ఫ్యామిలీమ్యాన్' ఫ్రాంఛైజీతో నిరూపణ అయింది. మొదటిసారి వెబ్ సిరీస్ లను వీక్షించే ప్రజలు `ఫ్యామిలీమ్యాన్` తో ప్రారంభిస్తే ఆ తర్వాత ఓటీటీ ప్రపంచంపై అభిప్రాయమే మారిపోతుంది. ఈ ఫ్రాంఛైజీలో రెండు సీజన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. సీజన్ 3 కూడా ఉండాలని ప్రజలు తమంతట తాము కోరుకునేలా చేసారు రాజ్ అండ్ డీకే. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన ఈ క్రియేటర్లు బాలీవుడ్ లో అసాధారణ ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. సినిమాలతో నిరూపిస్తూనే వెబ్ సిరీస్ లతో మాయాజాలం సృష్టిస్తున్నారు.
తీవ్రవాదం ఎలా ఉంటుందో, ఎన్.ఐ.ఏ ఎలా వేటాడుతుందో, చాలా సహజసిద్ధమైన పంథాలో చూపించడంలో రాజ్ అండ్ డీకే ప్రదర్శించిన నైపుణ్యం ఇతర ఫిలింమేకర్స్ కి ఎప్పటికీ స్ఫూర్తివంతమైనది. సహజత్వాన్ని చూపిస్తూనే, సంథింగ్ స్పెషల్ ఏదైనా చూపించాలనే వారి ప్రయత్నం మెప్పు పొందింది. ఫ్యామిలీమ్యాన్ శ్రీకాంత్ తివారీని తిప్పలు పెట్టే మరో ఇద్దరు కొత్త శత్రువులను బరిలో దించుతున్నామని `ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3` సీజన్ పై మరింత అంచనాలు పెంచారు. ఆ ఇద్దరూ ఎవరి అంచనాలకు చిక్కని రీతిలో కథానాయకుడిని ఢీకొడతారని రాజ్ అండ్ డీకే వెల్లడించారు.
మనోజ్ బాజ్‌పేయి కొత్త శత్రువు జైదీప్ అహ్లవత్, నిమ్రత్‌లను స్పై-థ్రిల్లర్‌లో ఎదుర్కొంటున్నారు. అందాల భామ నిమ్రత్ కౌర్ స్టంట్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రహస్య గూఢచారి శ్రీకాంత్ తివారీ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడన్నది ప్రతి ఒక్కరూ సిరీస్ రిలీజయ్యాక చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ లో ఏజెంట్ శ్రీకాంత్ తివారీ దేశ శత్రువులను వెంబడిస్తూ, పోరాడటం చూసాం. అదే సమయంలో క్యాప్ ధరించిన అహ్లవత్ బైక్ నడుపుతూ కనిపించగా, నిమ్రత్ కౌర్ ఒక రెస్టారెంట్‌లో రహస్యంగా కూర్చుని కనిపిస్తుంది. ఇంతకుముందు విడుదలైన వీడియోలు ఉత్కంఠను పెంచడంలో సఫలమయ్యాయి. కొత్త సీజన్ లో ప్రియమణి, హరీష్, అశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా తిరిగి వారి పాత్రలను పోషిస్తున్నారు. తొలి రెండు భాగాలను మించేలా ఇప్పుడు `ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3`ని రాజ్ అండ్ డీకే టీమ్ సిద్ధం చేస్తోంది. ప్రతి నిమిషం థ్రిల్ కి గురయ్యేలా గగుర్పొడిచే ట్విస్టులు, టర్నులతో కుర్చీ అంచుకు జారిపోయేలా కథనాన్ని చూపించబోతున్నారని సమాచారం.
ప్రతి సీజన్ లో కథాంశం ఎగ్జయిట్ చేస్తుంది. దాంతో పాటే నటీనటుల ప్రదర్శన, కీలకమైన మలుపులు గొప్ప వినోదాన్ని పంచుతున్నాయి. ఈసారి ఆ విషయంలో తగ్గకుండా తెరకెక్కిస్తున్నామని టీమ్ చెబుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు, ప్రమాదాలు ఇలా ప్రతిదీ రంజింపజేస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సిరీస్ ని నిర్మించేందుకు రాజీ లేకుండా కృషి చేసిందని రాజ్ అండ్ డీకే చెబుతున్నారు. అయితే ఇప్పటికే పెరిగిన హైప్ కారణంగా ఈ సిరీస్ రాక అంతకంతకు ఆలస్యమవ్వడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో ఆరాలు కూడా విపరీతంగా పెరిగాయి. అందుకే ఇప్పుడు అభిమానులకు ఒక శుభవార్త అందింది.
ఈ స్పై థ్రిల్లర్‌లో భయంకరమైన మేజర్ సమీర్‌గా నటించిన నటుడు దర్శన్ కుమార్ అధ్యాయం గురించి కొన్ని ఎగ్జయిట్ చేసే అంశాలను కూడీ టీమ్ వెల్లడించింది. జూమ్ టీవీతో తాజా సంభాషణలో `ది ఫ్యామిలీ మ్యాన్ 3` మరో రెండు మూడు నెలల్లో స్ట్రీమింగుకు వస్తుందని దర్శన్ కుమార్ తెలిపారు. మేజర్ సమీర్ అధికారులతో గేమ్‌ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళతాడని, ఈ పాత్ర షాకింగ్ ట్విస్టులతో రక్తి కట్టిస్తుందని కూడా వెల్లడించాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దళాలను నడిపించే సూత్రధారిగా అతడు రక్తం మరిగిస్తాడు. అతడితో శ్రీకాంత్ అతడి టీమ్ కి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయన్నది తెరపై చూడండి అని కూడా అన్నారు. ప్రధానంగా కథానాయకుడు శ్రీకాంత్ తివారీ ఓవైపు దేశ భద్రత గురించి పోరాడుతూనే, తన కుటుంబంలో విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని ఎలా డీల్ చేసాడన్నది ఫ్యామిలీమ్యాన్ 3లో చూసి తీరాల్సిందేనని మేకర్స్ చెబుతున్నారు. సుమన్ కుమార్‌తో కలిసి ఈ సిరీస్‌ను రాజ్ & డికె రాసారు. సీజన్ 3 లో కొత్త విలన్లు మరో స్థాయిలో ఆటాడుతారని కూడా దర్శకచయితలు వెల్లడించారు.
