15 ఏళ్ల తర్వాత `ది డర్టీ పిక్చర్ 2`.. అదే క్రేజ్ ఉంటుందా?
సీక్వెల్స్ ట్రెండ్ ఎప్పటికీ ఆగనిది. బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ తీయడంపైనే మేకర్స్ ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
By: Sivaji Kontham | 11 Oct 2026 10:16 PM ISTసీక్వెల్స్ ట్రెండ్ ఎప్పటికీ ఆగనిది. బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ తీయడంపైనే మేకర్స్ ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అంతగా వీటి బాక్సాఫీస్ ఫలితాలు ప్రభావితం చేస్తున్నాయి. బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన బోల్డ్ అండ్ హిట్ మూవీ `ది డర్టీ పిక్చర్`కు సీక్వెల్ రాబోతోంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తాజాగా `ది డర్టీ పిక్చర్ 2` చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగం విడుదలై దాదాపు 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ సీక్వెల్ పనులను ప్రారంభించినట్లు ఏక్తా వెల్లడించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
2011లో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `ది డర్టీ పిక్చర్` సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ప్రముఖ దక్షిణ భారత నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మి, తుషార్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మహిళల లైంగికత, ఆశయం.. చలనచిత్ర పరిశ్రమలో వారు ఎదుర్కొనే విమర్శలు, తీర్పుల చుట్టూ తిరిగిన ఈ కథ ప్రేక్షకులను గొప్పగా ఆకట్టుకుంది.
తాజాగా రణవీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఏక్తా కపూర్ మాట్లాడుతూ... తాను చాలాకాలంగా ఒక బలమైన కథ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ``నేను తెరకెక్కించబోయే అతిపెద్ద చిత్రాలలో `ది డర్టీ పిక్చర్ 2` ఒకటి. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత దీనిని ప్లాన్ చేస్తున్నాను. ఈసారి ప్రేక్షకులకు చెప్పడానికి నా వద్ద ఒక అద్భుతమైన కథ ఉంది అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. మొదటి చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను తాను ఎప్పుడూ బాధితురాలిగా చూడలేదని... తన లైంగికతను ధైర్యంగా ఆస్వాధించిన మహిళగా భావించానని ఆమె వివరించారు.
`ది డర్టీ పిక్చర్ 2` చిత్రంలో కూడా సిల్క్ స్మిత లాంటి ధైర్యశాలి అయిన ఒక మహిళ జీవిత కథే ప్రధానాంశంగా ఉండబోతుందని ఏక్తా కపూర్ హింట్ ఇచ్చారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరు? ప్రధాన పాత్రలో నటించే నటి ఎవరనే వివరాలను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది.
మొత్తానికి దశాబ్దకాలం క్రితం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఒక బోల్డ్ కాన్సెప్ట్‌కు సీక్వెల్ వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కొత్త భాగంలో ఏ నటి ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఏ నటి జీవితంలోని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కథను తెరకెక్కిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దాదాపు 15ఏళ్ల తరవాత ఒక క్రేజీ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తే మునుపటి బజ్ ఉంటుందా? అనే కోణంలోను నెటిజనుల్లో చర్చ మొదలైంది. ఈసారి సిల్క్ స్మితను మించిన గట్స్ ఉన్న నటి జీవితంపై సినిమా తీసినా ఏక్తాకపూర్ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న చర్చా సాగుతోంది.
