Begin typing your search above and press return to search.

సైకిల్‌పై స్వీడ‌న్ వెళ్లి ప్రియురాలిని పెళ్లాడిన భార‌తీయ‌ ప్రేమికుడి క‌థ‌తో

నిజమైన ప్రేమకు హద్దులు ఉండవని.. అది ఎంతటి కష్టానైనా జయిస్తుందని నిరూపించే అపూర్వమైన కథలతో చాలా ప్రేమ‌క‌థ‌లు వెండితెర‌కెక్కి వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టాయి.

By:  Sivaji Kontham   |   19 Aug 2026 9:30 AM IST
సైకిల్‌పై స్వీడ‌న్ వెళ్లి ప్రియురాలిని పెళ్లాడిన భార‌తీయ‌ ప్రేమికుడి క‌థ‌తో
X

నిజమైన ప్రేమకు హద్దులు ఉండవని.. అది ఎంతటి కష్టానైనా జయిస్తుందని నిరూపించే అపూర్వమైన కథలతో చాలా ప్రేమ‌క‌థ‌లు వెండితెర‌కెక్కి వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టాయి. ఆషిఖి, ఆషిఖి 2, స‌య్యారా లాంటి ప్రేమ‌క‌థా చిత్రాలు వంద‌ల కోట్ల వ‌సూళ్లను సాధించ‌డంలో ప్యూర్ లవ్ స్టోరి ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఇదే కేట‌గిరీలో మ‌రో అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ది సైకిల్ ఆఫ్ లవ్`. ఒక విదేశీ యువ‌తితో ప్రేమ‌లో ప‌డి త‌న కోసం సైకిల్ పైనే ఖండాంత‌రాలు ప్ర‌యాణించిన భార‌తీయ ప్రేమ‌కుడి క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతోంది. అంతర్జాతీయ నటి, వార‌ణాసి ఫేం ప్రియాంక చోప్రా (పీసీ) భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఒక యువ‌కుడి నిజ జీవిత క‌థ‌తో రూపొందుతోంది. ఒక సాధార‌ణ యువ‌కుడి జీవితంలో జరిగిన ఒక నమ్మశక్యంగాని నిజమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కింది.

ఈ చిత్రం ప్రధానంగా భారతదేశానికి చెందిన చిత్రకారుడు పికె మహానందియా- స్వీడన్‌కు చెందిన చార్లెట్ ల్యాండ్‌క్విస్ట్ మధ్య చిగురించిన అమర ప్రేమను ఆవిష్కరిస్తుంది. తన ప్రేమికురాలిని కలవడం కోసం ఎటువంటి ఆటంకాలు ఉన్నా లెక్కచేయకుండా సుమారు 6000 మైళ్ల సుదీర్ఘ దూరాన్ని కేవలం ఒక సైకిల్‌పై ఖండాలు దాటి ప్రయాణించిన అత‌డి సాహస యాత్ర ఈ సినిమాకు ముఖ్యమైన ఆకర్షణ.

అత్యంత ఉద్వేగభరితంగా రూపొందిన ఈ సినిమా టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అమెరికాలోని ఎంపిక చేసిన థియేటర్లలో ఆగస్టు 28 నుండి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. నిజజీవితంలో జరిగిన ఈ వినూత్న ప్రేమ కథను వెండితెరపై వీక్షించేందుకు విదేశీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గ్లింప్స్‌కు అసాధార‌ణ‌ స్పందన లభిస్తోంది. గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకురావడం .. హృదయానికి హత్తుకునే ఈ ప్రేమకథను ప్రపంచ స్థాయికి చేర్చాల‌నే ఆలోచ‌న చేయ‌డంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లలో ప్రేమ చిహ్నాలతో పాటు సినిమా విడుదల కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నామని ఫ్యాన్స్ తమ ఉత్సాహాన్ని షేర్ చేస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం.. రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో కేవలం ప్రేమ అనే ఒకే ఒక్క నమ్మకంతో సైకిల్‌పై సాగించిన ఈ ప్రయాణం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాల పరీక్షను తట్టుకుని నిలిచిన ఈ నిఖార్సయిన ప్రేమకథ.. నేటి తరం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుదనడంలో సందేహం లేదు.

ఈ త‌ర‌హా టాప్ 10 సినిమాలు:

ప్రేమ సరిహద్దులకు, దేశాలకు, ఖండాలకు అతీతమైనదని నిరూపిస్తూ వెండితెరపై వ‌చ్చిన‌ ప్రణయ గాథలు వీక్షకుల హృదయాలను ఎప్పుడూ హత్తుకుంటూనే ఉంటాయి. భాష, సంస్కృతి, భౌగోళిక సరిహద్దులను చెరిపేసి కేవలం మనసుల బంధంతో సాగే ఈ కథల్లో ప్రేమికులు పడే ఆవేదన... వారి నిరీక్షణ ప్రేక్షకులను ఒక భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్తాయి. తెలుగులో వచ్చిన `రచన పరిణయం`, `1830: ఎ లవ్ స్టోరీ`, `ఫిదా`, `దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ)`, `మై నేమ్ ఈజ్ ఖాన్`, `వీర్ జారా`, `సీతా రామం`, హాలీవుడ్ క్లాసిక్స్ అయిన `ది బ్రైడ్ అండ్ ప్రెజుడీస్`, `బిఫోర్ సన్‌రైజ్` వంటి చిత్రాలు ఈ కోవకే చెందుతాయి. వేర్వేరు ఖండాలు, విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులు ప్రేమలో పడటం... వారిని కలపడానికి లేదా వారి ప్రేమను గెలిపించడానికి మైళ్ల దూరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయాణించడం ఈ సినిమాల్లో ప్రధానాంశంగా ఉండి ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.