Begin typing your search above and press return to search.

కుటుంబ క‌ల‌హాల కారణంగా సినిమాకు బ్రేక్ !

హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కథానాయకుడిగా న‌టిస్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `ది బ్యాట్‌మ్యాన్ పార్ట్ 2` షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

By:  Srikanth Kontham   |   7 Oct 2026 5:00 AM IST
కుటుంబ క‌ల‌హాల కారణంగా సినిమాకు బ్రేక్ !
X

హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కథానాయకుడిగా న‌టిస్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `ది బ్యాట్‌మ్యాన్ పార్ట్ 2` షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్ర దర్శకుడు మ్యాట్ రీవ్స్ కుటుంబ కారణం వల్ల షూటింగ్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. దీంతో లండన్‌లో శరవేగంగా జరుగుతున్న చిత్రీకరణ నిలిచిపోయింది.

ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థలైన వార్నర్ బ్రోస్ - డీసీ స్టూడియోస్ అధికారిక ప్రకటనను విడుదల చేశాయి. మ్యాట్ రీవ్స్ తన కుటుంబానికి సంబంధించిన అత్యవసర వ్యవహారంపై దృష్టి సారించడానికి షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపాయి.

ఈ సమయంలో మ్యాట్‌కు డీసీ స్టూడియోస్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని.. త్వరలోనే సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తామని పేర్కొన్నాయి. ఈ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్ మరోసారి బ్యాట్‌మ్యాన్‌గా అలరించనున్నారు. ఆయనతో పాటు ఆల్ఫ్రెడ్‌గా యాండీ సెర్కిస్, పెంగ్విన్‌గా కోలిన్ ఫారెల్ తమ పాత్రలను పునరావృతం చేస్తున్నారు. సీక్వెల్‌లో కొత్తగా స్కార్లెట్ జోహాన్‌సన్, సెబాస్టియన్ స్టాన్, బ్రయాన్ టైరీ హెన్రీ, చార్లెస్ డాన్స్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు.

అయితే `ది బ్యాట్‌మ్యాన్ పార్ట్ 2` విడుదల తేదీ వాయిదా పడటం.. ఆలస్యం కావడం ఇదే తొలిసారి కాదు. తొలుత‌ ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు. అటుపై 2027 అక్టోబర్ 1కి మార్చారు. ఇటీవల వార్నర్ బ్రోస్ సినిమా విడుదలను మరికొంత కాలం పొడిగిస్తూ 2028 ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాట్ రీవ్స్ దర్శకత్వంలో రిలీజ్ అయిన తొలి `ది బ్యాట్‌మ్యాన్` సినిమా 2022 మార్చిలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నేథ్యంలో సినిమా నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై డీసీ స్టూడియోస్ కో-చైర్మన్ జేమ్స్ గన్ మద్దతుగా నిలిచారు. పెద్ద హిట్ సినిమాల సీక్వెల్స్ మధ్య 5 నుండి 7 ఏళ్ల సమయం ఉండటం చిత్ర పరిశ్రమలో సహజమేనని పేర్కొన్నారు. `ఏలియన్`, `టెర్మినేటర్`, `అవతార్`, `గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ` వంటి అనేక సూపర్ హిట్ ఫ్రాంచైజీలకు కూడా సీక్వెల్స్ మధ్య ఇలాంటి సమయమే పట్టిందని గుర్తుచేశారు. దర్శకుడు మ్యాట్ రీవ్స్ అత్యుత్తమ కథనాన్ని అందించేందుకే స్క్రిప్ట్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వివరించారు.

మ్యాట్ రీవ్స్ 1998లో `ఫెలిసిటీ` అనే టీవీ డ్రామా సిరీస్‌తో కెరీర్ ప్రారంభించారు. అటుపై `క్లోవర్‌ఫీల్డ్` (2008), `వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` (2017) వంటి హిట్ చిత్రాలతో హాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యానిమేటర్ మెలిండా వాంగ్‌ను వివాహం చేసుకున్న రీవ్స్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ అత్యవసరాల వల్ల ప్రస్తుతం విరామం తీసుకున్న ఆయన త్వరలోనే మళ్లీ `ది బ్యాట్‌మ్యాన్ 2` సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.