Begin typing your search above and press return to search.

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ లో The 3rd.. మీరు చూశారా?

చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను తిట్టిపోసే, మానసికంగా వేధించే లెక్చరర్ల వైఖరిని కథగా ఎంచుకున్నారు మేకర్స్.

By:  M Prashanth   |   25 April 2026 2:45 PM IST
ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ లో The 3rd.. మీరు చూశారా?
X

దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో స్క్రీనింగ్ కు తెలుగు షార్ట్ ఫిల్మ్ The 3rd సెలెక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు, రైటర్ కేఏ ముని సురేష్ పిళ్లె దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన ఆ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఏప్రిల్ 30న జరగనుంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి.. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు సంపాదించుకున్న దాదాసాహెబ్ ఫాల్కే బర్త్ డే సందర్భంగా ఏటా ఢిల్లీలో నిర్వహించే ఫిల్మ్ ఫెస్టివల్‌ కు ఎన్నో చిత్రాలు వెళ్తుంటాయి. వాటిలో ఇప్పుడు ఎంపిక కావడం The 3rdకు అరుదైన ఘనత అని చెప్పాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడి, కార్పొరేట్ జూనియర్ కాలేజీల బిహేవియర్ కు షార్ట్ ఫిల్మ్ స్ట్రాంగ్ మెసేజ్ అందిస్తుంది.

చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను తిట్టిపోసే, మానసికంగా వేధించే లెక్చరర్ల వైఖరిని కథగా ఎంచుకున్నారు మేకర్స్. దాదాపు 40 నిమిషాల రన్ టైమ్ గల షార్ట్ ఫిల్మ్ లో ఒక ఫిజిక్స్ లెక్చరర్ ప్రవర్తన, అతని చర్యల వల్ల ఒక విద్యార్థినికి ఎదురైన విషాదం మెయిన్ స్టోరీ లైన్. కథ ప్రకారం.. ఫిజిక్స్‌ లో వెనుకబడిన ఓ విద్యార్థినిపై లెక్చరర్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాడు. ర్యాంకులే జీవితమని చెప్పుతూ ఆమెను మానసికంగా ఇబ్బంది పెడతాడు.

సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టి వేధింపులకు గురిచేస్తాడు. చివరకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆ తర్వాత సదరు లెక్చరర్ జీవితంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. న్యూటన్ థర్డ్ లా.. ప్రతి చర్యకు కచ్చితమైన ప్రతిచర్య ఉంటుంది అనే ఫార్ములాను కథలో మెయిన్ గా తీసుకున్నారు మేకర్స్.

చదవకపోతే జీవితాలు నాశనం అవుతాయని చెప్పుతూ విద్యార్థులను వేధించే లెక్చరర్‌ కు ఎదురయ్యే సమస్యులు ఏమిటి? అతను ఎలాంటి లెసెన్స్ నేర్చుకుంటాడు? చివరికి అతనిలో మార్పు ఎలా వస్తుంది? అనే కోణంలో సినిమా సాగుతుంది. ఆదర్శిని చిత్రాలు బ్యానర్‌ పై భారతమ్మ నిర్మించిన ఆ షార్ట్ ఫిల్మ్ కు ఆదర్శిని భారతీకృష్ణ సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఆదర్శిని శ్రీ, ఒబ్బు ప్రసాద్, సూరావజ్ఝల రాము, పెమ్మరాజు విజయరామచంద్ర, డా. కిరణ్ కుమార్, బాలమురళి తదితరులు నటించారు. షార్ట్ ఫిల్మ్ లోని రెండు పాటలు సునో యాప్ ద్వారా ఏఐ సాయంతో కంపోజ్ చేశారు. ఆ సాంగ్స్ కు సాహిత్యాన్ని దర్శకుడే అందించారు. ఏదేమైనా సమాజంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, దాని ఎఫెక్ట్ పై ఆలోచింపజేసే ప్రయత్నమే The 3rd షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక కావడం ద్వారా తెలుగు చిన్న చిత్రాలకు మరింత గుర్తింపు లభిస్తుందని చెప్పాలి.