Begin typing your search above and press return to search.

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

వెంకటేష్‌తో సినిమా ఆగిపోవడానికి తన స్క్రిప్టే కారణమని దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించారు. కథ ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ సంతృప్తికరంగా రాకపోవడంతో ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు తెలిపారు. స్క్రిప్ట్‌ను పూర్తిగా మెరుగుపరిచి ఎప్పటికైనా వెంకటేష్‌తోనే సినిమా చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

By:  M Prashanth   |   11 Nov 2026 7:11 AM IST
ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట
X

స్క్రిప్ట్ వర్కవుట్ కాలేదని ఓ డైరెక్టర్ ఓపెన్‌గా ఒప్పుకోవడం ఇండస్ట్రీలో చాలా అరుదు. ఏదైనా ప్రాజెక్ట్ ఆగిపోతే హీరో డేట్స్ ఇవ్వలేదనో, ప్రొడక్షన్ సమస్యలనో సాకులు చెప్పడం కామన్. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా అసలు విషయం బయటపెట్టేశారు. వెంకటేష్‌తో చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ ఎందుకు పట్టాలెక్కలేదో చెబుతూ, తన రైటింగ్‌లోనే లోపం ఉందని నిర్మొహమాటంగా తేల్చేశారు.

వెంకీకి ఒక కథ చెప్పిన మాట నిజమేనన్న తరుణ్, అందులో ఫస్ట్ హాఫ్ వరకు అంతా అదిరిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే కథ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఎటో వెళ్లిపోయిందట. తనకే ఆ ట్రాక్ ఏమాత్రం నచ్చకపోవడంతో, బలవంతంగా లాగడం ఇష్టం లేక ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టానని వెల్లడించారు. ఎప్పటికైనా ఆ స్క్రిప్ట్‌ని పక్కాగా రిన్యూ చేసి, వెంకీతోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తానని ఆయన చెబుతున్నారు.

కామెడీ జానర్‌లో సెకండ్ హాఫ్ సరిగ్గా రాకపోతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ ఎంత బాగా నవ్వించినా, రెండో సగంలో కంటెంట్ తేలిపోతే ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు. అందుకే అసంపూర్తి స్క్రిప్ట్‌తో వెంకటేష్ లాంటి స్టార్‌తో రిస్క్ చేయడం కంటే, వర్కవుట్ కాదని తెలిసిన వెంటనే ప్రాజెక్ట్‌ను ఆపేసి తరుణ్ చాలా ప్రాక్టికల్ నిర్ణయమే తీసుకున్నారు.

అయితే టాలీవుడ్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే, ఒక్కసారి కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిన ప్రాజెక్ట్ మళ్లీ బయటకు రావడం దాదాపు అసాధ్యం. హీరోల ఆలోచనలు, మార్కెట్ సమీకరణాలు ఏటేటా మారిపోతుంటాయి. పైగా వెంకీ ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ఏమాత్రం అవుట్‌డేటెడ్ అనిపించినా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు పక్కన పెట్టిన పాత లైన్‌తోనే మళ్లీ ఆయన్ను కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు.

మరోవైపు తరుణ్ భాస్కర్ నుంచి గట్టి హిట్ వచ్చి చాలా కాలమైంది. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తెచ్చిన క్రేజ్ ఇంకా ఉన్నప్పటికీ, ఇప్పుడున్న కాంపిటీషన్‌లో స్టార్ హీరో ప్రాజెక్ట్ దక్కించుకోవాలంటే కేవలం మాటలు సరిపోవు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2తో బిగ్ హిట్ అందుకోవాలి. అలాగే ఆగిపోయిన సెకండ్ హాఫ్‌ని తిరగరాయడం అంటే ఏదో రెండు సీన్లు మార్చడం కాదు, వెంకీ ఎనర్జీకి పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా హోల్ స్క్రిప్ట్‌ను రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. మరి తరుణ్ మాట ఇచ్చినట్లే ఆ కథను పూర్తి చేస్తాడో లేదో చూడాలి.