Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ లైనప్.. ఆ రెండూ హిట్టయితే..

టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ దాస్యం మరోసారి తన సినిమాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు.

By:  M Prashanth   |   27 April 2026 11:01 AM IST
తరుణ్ భాస్కర్ లైనప్.. ఆ రెండూ హిట్టయితే..
X

టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ దాస్యం మరోసారి తన సినిమాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, నేచరుల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు.

2016లో విడుదలైన పెళ్ళి చూపులు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్, తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాతో అవార్డులు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మార్మోగింది. అనంతరం ఆయన రూపొందించిన ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా చిత్రాలు కూడా కొత్త తరహా కథలతో యువతను ఆకట్టుకున్నాయి.

ఇక దర్శకత్వంతో పాటు నటనలో కూడా తన సత్తా చాటాలని భావించిన తరుణ్ భాస్కర్, మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారారు. మహానటి సినిమాలో కీలక పాత్ర పోషించి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఫలక్ నుమా దాస్, సీతారామం, దాస్ కా ధమ్కీ, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా వంటి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఆయన లీడ్ రోల్ లో వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రం మిక్స్ డ్ రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఆయన టాలెంట్‌ పై మాత్రం ఎలాంటి డౌట్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కథల సెలెక్షన్ లో కొత్తదనం, డైలాగ్స్ లో నేచురాలిటీ ఆయన ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ చేతిలో రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

ఒకటి ఆయన హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం కాగా, మరొకటి ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ENE 2. ముఖ్యంగా ENE 2.. ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ కావడంతో ఆ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. ఒకవైపు నటుడిగా, మరోవైపు దర్శకుడిగా బిజీ బిజీగా ఉంటూ ముందుకెళ్తున్న తరుణ్ భాస్కర్‌ కు ఇటీవల భారీ హిట్ మాత్రం దక్కలేదనే చెప్పాలి.

కంటెంట్ పరంగా మంచి సినిమాలు తీస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు రాకపోవడం గమనార్హం. దీంతో గాయపడ్డ సింహం, ENE 2 సినిమాలు ఆయన కెరీర్‌ కు టర్నింగ్ పాయింట్ కావచ్చని అంతా భావిస్తున్నారు. ఆ రెండు సినిమాలు హిట్ అయితే, తరుణ్ భాస్కర్‌ కు టాలీవుడ్‌ లో మరింత స్ట్రాంగ్ స్థానం దక్కే అవకాశం ఉంది. ఏదేమైనా తన టాలెంట్‌ కు తగ్గ విజయాన్ని అందుకోవాలనే ఆశతో ఉన్న తరుణ్ భాస్కర్.. ఈసారి తన లైనప్‌ తో ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.